Pashamaylaram Incident: పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ రియాక్టర్ పేలుడు ఘటన అందరినీ కలచివేస్తోంది. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. పేలుడి దాటికి మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. మృతులను గుర్తు పట్టలేనంతగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందినట్లు గుర్తించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 43 మంది కార్మికులు గల్లంతు అయినట్లు సమాచారం.
పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. ప్రమాదంలో పలువురు మరణించగా.. తీవ్ర గాయాలతో మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాద ఘటన వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు. ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది. మరోవైపు మంత్రులు, అధికారులు సైతం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద ప్రభుత్వం లక్ష రూపాయలు ప్రకటించింది. క్షతగాత్రులకు 50 వేలు తక్షణం అందజేయాలని ఆదేశించింది.
ప్రమాద ఘటనను పరిశీలించిన సీఎం రేవంత్ సిగాచి కంపెనీ యాజమాన్యం నుంచి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పిస్తామని ప్రకటించారు. ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని విచారం వ్యక్తం చేశారు.
మృతుల్లో ఎక్కువగా బిహార్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. కడప జిల్లాకు చెందిన నెలక్రితం పెళ్లి అయిన ఓ జంట ప్రమాదంలో సజీవ దహనం అయినట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు మొత్తం ప్లాంట్ లో 143 మంది కార్మికులు ఉన్నారు.
ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వారి వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.