Surya Namaskar benefits do early in the Morning: సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే పోషకాలతో నిండిన ఆహారంతో పాటు శరీరాన్ని కదిలించే వ్యాయామాలు కూడా చేయాలి. అలా జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కుదరని వాళ్లు.. ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేస్తే అటు ఆరోగ్యంగా, ఇటు సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు. ఈ క్రమంలో సంప్రదాయ యోగాలో సూర్య నమస్కారాల వెనుక చాలా ముఖ్యమైన ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కేవలం ఒక వ్యాయామంగా కాకుండా, శరీరం, మనస్సు, శ్వాసను సమన్వయం చేసే ఒక సంపూర్ణ యోగా సాధనంగా భావిస్తారు.
సూర్య నమస్కారం అంటే.. శరీరం, శ్వాస, మనస్సుల సంపూర్ణ సమన్వయం అని చెబుతారు. ఇది పన్నెండు భంగిమల కలయిక. ఈ సూర్య నమస్కారం శరీరం మొత్తంలోని ముఖ్యమైన కండరాలు, కీళ్లపై బాగా పని చేస్తుంది. భుజాలు, మెడ, వెన్నెముక, మోకాళ్లు వంటి ముఖ్యమైన భాగాలను యాక్టివేట్ చేస్తుంది.సూర్య నమస్కారంలోని కొన్ని భంగిమలు కడుపు, కాలేయం, ప్రేగులు వంటి అవయవాలపై ఒత్తిడిని కలిగించి అవి బాగా పనిచేసేలా చేస్తాయి. ఈ సూర్య నమస్కారం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.సూర్య నమస్కారాలను వేగంగా చేయడం ద్వారా శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందని, దీని వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చువ్వడంతో పాటు జీవక్రియను వేగవంతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గి, బరువు అదుపులో ఉంటుందని వివరించారు.సూర్య నమస్కారాలు చేయడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. ఈ ఆసనాల ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో అవయవాల పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు,చర్మానికి తగినంత ఆక్సిజన్ అందడం వల్ల కాంతివంతంగా మారుతుంది.సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది శరీర భాగాలపైనే కాకుండా గ్రంథులపైనా పని చేస్తాయి. సూర్య నమస్కారాలు థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి.