ఐసీసీ మహిళల వరల్డ్ గెలిచిన టీమిండియా క్రికెటర్, తెలుగమ్మాయి శ్రీ చరణి సీఎం చంద్రబాబును శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా తనతో పాటు సహచర క్రీడాకారులు సంతకాలు చేసిన టీమిండియా జెర్సీని ఆమె సీఎంకి బహుకరించింది. శ్రీ చరణి అభిమానంతో ఇచ్చిన జెర్సీని చంద్రబాబు ఆప్యాయంగా స్వీకరించారు.
ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ చరణికి ఆయన పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. శ్రీ చరణిని, మహిళా క్రికెట్ జట్టును సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఓ వీణ బొమ్మను శ్రీచరణికి జ్ఞాపికగా సీఎం చంద్రబాబు బహూకరించారు. ఈ క్రమంలో, తనకు మద్దతుగా నిలిచినందుకు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి శ్రీ చరణి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ చరణి చారిత్రక విజయానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఆమెకు రూ. 2.5 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్టు పేర్కొన్నారు.
అంతే కాకుండా కడపలో ఇల్లు నిర్మించుకునేందుకు వెయ్యి చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు శ్రీ చరణికి హామీ ఇచ్చారు.