Tips for the Instant Sleep: నేటి ఆధునిక కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రంతా మంచం మీద అటూఇటూ దొర్లుతూ, నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. దీనితో పగలంతా అలసటగా ఉండటం, త్వరగా వృద్ధాప్యం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. తీవ్రమైన ఒత్తిడి, జీవనశైలి మార్పులు నిద్రలేమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు శరీరంలోని కొన్ని భాగాలను నొక్కడం ద్వారా త్వరగా నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రను ప్రేరేపించడానికి ఉపయోగపడే శరీరంలోని ఆ ముఖ్యమైన పాయింట్లు, వాటిని ఎలా నొక్కాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
రాత్రంతా హాయిగా నిద్రపోవాలంటే చెవి వెనుక భాగంలో నొక్కాలి. ఆందోళన, తలనొప్పి కారణంగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నట్లయితే.. చెవి వెనుక, చెవి తమ్మెకు కొద్దిగా వెనక ఉండే ప్రాంతాన్ని మెల్లగా నొక్కాలి. ఈ పాయింట్‌ను ఆన్మియన్ అని అంటారు. ఈ ప్రాంతాన్ని సుమారు 10 నుంచి 20 సార్లు మృదువుగా నొక్కడం వల్ల హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.కొన్నిసార్లు అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి కూడా నిద్రలేమికి దారితీయవచ్చు. అటువంటి సందర్భాల్లో కనుబొమ్మల మధ్య, నుదుటిపైన ఉన్న పాయింట్‌ను మెల్లగా నొక్కాలి. ఈ పాయింట్‌ను నొక్కడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. త్వరగా నిద్రలోకి జారుకుంటారు.సాధారణంగా మసాజ్ చేసేటప్పుడు మెడపై స్ట్రోక్ చేసినప్పుడు నిద్ర వచ్చిన భావన కలుగుతుంది. ఎందుకంటే మెడ పైభాగంలో ఒక నిర్దిష్ట పాయింట్ ఉంది. ఈ పాయింట్‌ను బొటనవేలితో నొక్కినప్పుడు తక్షణ ఉపశమనం లభించి నిద్ర వస్తుంది. దీన్ని రిలాక్సేషన్ పాయింట్ అని కూడా అంటారు.నిద్రను ప్రేరేపించే పాయింట్లు చేతి వేళ్లపై కూడా ఉంటాయి. అరచేతి నుంచి మణికట్టు వరకు వేళ్లను చాపి.. ఆ ప్రాంతాన్ని మెల్లగా నొక్కాలి. ఈ పాయింట్లు నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల త్వరగా నిద్ర పడుతుందని, నిద్ర రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.