4 warning signs in your legs that you shouldn’t ignore: మారిన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. క్యాన్సర్, స్ట్రోక్, గుండెపోటు వంటి వ్యాధుల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వీటిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన, వేగంగా వ్యాపించే వ్యాధి. దీనిని తరచుగా సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ప్రారంభ లక్షణాలు అంత స్పష్టంగా ఉండకపోవడం అనేది ఈ వ్యాధిని గుర్తించడంలో అతిపెద్ద సవాలుగా చెప్పవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి సంకేతాలలో కడుపు నొప్పి, కామెర్లు, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలతో ప్రారంభమవుతుంది. అయితే, కొత్త పరిశోధన ప్రకారం.. శరీరంలోని ఇతర భాగాల్లో ముఖ్యంగా కాళ్ళలో కనిపించే కొన్ని సమస్యలు ప్రారంభ హెచ్చరికలుగా చెప్పవచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ దశలో శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కాళ్లలో కనిపించే ముఖ్యమైన లక్షణాలివే..
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడే రోగుల్లో కాళ్లలో నొప్పి, వాపు, ఎరుపు లేదా వెచ్చదనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ చిన్న సమస్యను చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. అయితే, ఇవి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు సంకేతమని గుర్తించరు.
కాళ్లలో నొప్పి
కాళ్లలో నిరంతరంగా లేదా కారణం లేకుండా నొప్పి ఉంటే.. అది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లేదా లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడానికి సంకేతం కావచ్చు. క్యాన్సర్ నిపుణులు అభిప్రాయం ప్రకారం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ విషయంలో శరీరం రక్తం గడ్డకట్టే ప్రక్రియ ప్రభావితమవుతుంది. దీనివల్ల డీవీటీ ప్రమాదం పెరుగుతుంది. సిరలపై ఒత్తిడి, వాపు లేదా రక్త ప్రవాహం ఆగిపోవడం వంటి తీవ్రమైన సమస్యకు సంకేతంగా ఈ నొప్పిని అస్సలు తేలికగా తీసుకోకూడదు.
అకస్మాత్తుగా వాపు
ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఒకటి లేదా రెండు కాళ్లలో అకస్మాత్తుగా వాపు వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. క్యాన్సర్ రోగుల్లో ఇది తరచుగా రక్తం గడ్డకట్టడం వల్ల లేదా కణితి (ట్యూమర్) కారణంగా సిరలపై ఒత్తిడి పడటం వల్ల జరుగుతుంది.
ఎరుపు రంగు మారడం
కాళ్లు సాధారణం కంటే ముదురు ఎరుపు రంగులోకి మారడం లేదా చర్మం రంగులో మార్పులు కనిపించడం క్యాన్సర్ సంకేతంగా చెప్పవచ్చు.
వెచ్చగా అనిపించడం
కాళ్లు సాధారణం కంటే ఎక్కువ వెచ్చగా అనిపించడం, వాపు, ఎరుపు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఆలస్యంగా నిర్ధారిస్తారు. అప్పటికే వ్యాధి చాలావరకు ముదిరి ఉంటుంది. అందువల్ల కాళ్లకు సంబంధించిన ఈ ప్రారంభ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. సకాలంలో రోగ నిర్ధారణ చేయగలిగితే వ్యాధిని గుర్తించడం సులభమవుతుంది.


