హోలీ బాగా ఆడారా? రంగుల పండుగ రోజు పోసుకున్న కలర్స్ మీ ముఖంపై, మెడపై, శరీరంపై ఇంకా అలాగే ఉన్నాయా? ఆ రంగులతో చర్మంపై సమస్యలు తలెత్తాయా? యాక్నే లాంటి ఇబ్బందులు చర్మంపై కనిపిస్తున్నాయా? రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించినపుడు చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. అవి పోవడానికి కింద చెప్పిన డిటాక్స్ డ్రింక్స్ తాగితే చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాదు దీర్ఘకాలంలో చర్మ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.
పోషకాలతో కూడిన డ్రింకులు తాగితే శరీరంలోని విషతుల్యమైన మలినాలు బయటకుపోతాయి.
సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా ఇందులో విటమిన్ కె, సి, కాల్షియం, జింకు వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలు చర్మ రంధ్రాల్లోని ఆయిల్ స్రావాన్ని సమతుల్యం చేస్తాయి. అంతేకాదు సొరకాయ జ్యూసు క్లీన్సర్ గా పనిచేస్తుంది. హోలీ ఆడిన తర్వాత చర్మంపై మొటిమలు, యాక్నే, చర్మం పొట్టూడం వంటి సమస్యలేవీ తలెత్తకుండా ఈ జ్యూసు నియంత్రిస్తుంది.
కీరకాయ జ్యూసులో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఇన్ఫ్లమేటరీ సుగుణాలు కూడా ఇందులో ఎక్కువ ఉన్నాయి. ఇవి చర్మంపై వచ్చే ఎర్రటి దద్దుర్లను, మచ్చలను, వాపులను తగ్గిస్తాయి. ఈ జ్యూసులోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
నిమ్మరసం, అల్లం కలిపిన టీ కూడా హోలీ తర్వాత తలెత్తే చర్మ సమస్యలను పరిష్కరించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని మలినాలను నిమ్మ బయటకు పోయేలా చేస్తుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా కూడా సహాయపడుతుంది. ఎందుకంటే జీర్ణక్రియ బాగా లేకపోయినా దాని ప్రభావం చర్మంపై కనపడుతుంది. అల్లంలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. చర్మం పరిశుభ్రంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు చర్మం మెరిసేలా కూడా తోడ్పడతాయి.
నిమ్మ, పుదీనాలు కలిపిన కొబ్బరినీళ్లు కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చర్మానికి కావలసినంత తేమను ఈ జ్యూసు అందిస్తుంది. కొబ్బరినీళ్లల్లో విటమిన్ సి, కె, ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజిన్ ఉత్పత్తిని బాగా పెంచుతాయి. చర్మం యవ్వనంతో, మ్రుదువుగా ఉండేలా కొల్లాజిన్ చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహకరించే నిమ్మ, పుదీనా ఆకుల్ని కూడా కొబ్బరినీళ్లల్లో చేర్చడం వల్ల శరీరానికి, చర్మానికి ఈ డ్రింకు ఎంతో మేలుచేస్తుంది.
రంగుల హోళి తర్వాత దెబ్బతిన్న చర్మ కణాలను బాగుచేయడంలో పుచ్చకాయ రసం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ పండ్ల రసంలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది చర్మానికి, శరీరానికి ఎంతో మంచిది. కొల్లాజిన్ ను వ్రుద్ధిచేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.