AI stethoscope:మెడలో స్టెతస్కోప్ ఉంటే వైద్యులని టకీమని చెప్పేస్తాం. ఇలాంటి స్టెతస్కోప్‌ను తొలిసారిగా 1816లో కనుక్కున్నారు. గుండె కొట్టుకునే శబ్దం, ఊపిరితిత్తుల్లో వచ్చే శబ్దాలు, చివరకు పేగుల కదలికలు, వాటిలో వచ్చే శబ్దాలను వినడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏముంటుంది? అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనికి కూడా ఏఐ పరిజ్ఞానాన్ని జోడించారు. గుండె కొట్టుకోవడంలో అతి సూక్ష్మమైన తేడాలున్నా, గుండెకు రక్తసరఫరా ఎక్కువైనా, తక్కువైనా.. ఇలాంటి వాటిని మామూలు స్టెతస్కోప్‌తో వినలేం, తెలుసుకోలేం. అలాంటి పనులన్నీ చేయడానికి ఇప్పుడు ఏఐ స్టెతస్కోప్‌లు వచ్చేశాయి. దాదాపుగా అదే ఈసీజీ కూడా తీసేసి మొత్తం విషయాన్ని కేవలం 15 సెకన్లలోనే వైద్యుడికి చెప్పేస్తుంది. గుండె వైఫల్యం, గుండె కవాటాల వ్యాధులు, గుండె లయ అసాధారణంగా ఉండడం లాంటి సమస్యలను ఇది వెంటనే కనిపెట్టేస్తుంది.
కాలిఫోర్నియాకు చెందిన ఎకో హెల్త్ అనే కంపెనీ కనిపెట్టిన ఈ ఏఐ స్టెతస్కోప్‌ను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ హెల్త్‌కేర్ ఎన్‌హెచ్ఎస్ ట్రస్టు వాళ్లు పూర్తిగా పరీక్షించి, ఇది బ్రహ్మాండంగా ఉందని నిర్ధారించారు. లండన్‌లోని మొత్త 205 జనరల్ ప్రాక్టీషనర్ క్లినిక్‌లలో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు ఇంగ్లండ్ దేశవ్యాప్తంగా వీటిని అందించాలని చూస్తున్నారు.
ఎలా పనిచేస్తుంది?
సాధారణ స్టెతస్కోప్‌లా కాకుండా ఇది కొంత భిన్నంగా ఉంటుంది. దాదాపుగా ఒక పేకముక్క అంత పరిమాణంలో మనం గుండెమీద పెట్టే భాగం ఉంటుంది. గుండె నుంచి వచ్చే శబ్దాలను, రక్తసరఫరా శబ్దాన్ని వినడానికి ఇది ఒక మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తుంది. అది రికార్డుచేసి, ఆ డేటాను నేరుగా క్లౌడ్‌లోకి పంపుతుంది. అక్కడ వెంటనే ఏఐ ఆల్గరిథమ్‌లు దీన్ని విశ్లేషించి, కొన్ని లక్షలు లేదా కోట్ల మందికి సంబంధించిన డేటాతో సరిపోలుస్తాయి. విశ్లేషణ కొన్ని సెకన్లలోపే పూర్తయిపోతుంది. వెంటనే ఆ ఫలితాలను వైద్యుడి స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. దాన్నిబట్టి ఆ రోగికి గుండె సమస్య ఉందో లేదో వెంటనే తెలిసిపోతుంది. ఇందులో ప్రతి ఒక్క సమస్యకూ వేర్వేరు ఆల్గరిథమ్‌లు ఉంటాయి. అందువల్ల ఎలాంటి సమస్య ఉందో కూడా కచ్చితంగా తెలుస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తెలిస్తే ముందుగానే వాళ్లకు రక్తాన్ని పల్చబరిచే మందులు ఇచ్చి, తర్వాత మిగిలిన చికిత్సలు చేసి గుండెపోటు రాకుండా ముందే ఆపచ్చు.
ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం కనుగొన్న స్టెతస్కోప్‌ను తాజా పరిస్థితులకు అనుగుణంగా 21వ శతాబ్దానికి ఎలా అప్‌గ్రేడ్ చేయచ్చో దీనివల్ల తెలుస్తోందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ క్లినికల్ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సోన్యా బాబు నారాయణ్ అన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు చాలా ముఖ్యమని, గుండెజబ్బులు ఆలస్యంగా తెలియడంతో కొన్ని సందర్భాల్లో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని, అలా జరగకుండా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటే చాలా మరణాలను మనం నివారించగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
పరిమితులు
ఏఐ స్టెతస్కోప్ ఉంది కద అని తమ వద్దకు వచ్చిన రోగులందరినీ దాంతో పరీక్షించడం సరికాదని కూడా నిపుణులు చెబుతున్నారు. అప్పటికే ఏవైనా గుండె సమస్యలు ఉన్నవారు, లేదా వారికి గుండె సమస్య లక్షణాలు కనపడినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే, ఏఐ అనేది అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉన్న లోపాలను కూడా గుర్తిస్తుంది. నిజానికి అప్పటికి అవి చికిత్స చేయాల్సినంత తీవ్రత కలిగి ఉండకపోవచ్చు. అందువల్ల ఏఐ స్టెతస్కోప్ ఉపయోగించే విషయంలో వైద్యులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి.


