Friday, September 20, 2024
Homeహెల్త్Almond oil: బాదం నూనెతో బ్యూటీ

Almond oil: బాదం నూనెతో బ్యూటీ

బాదం నూనెతో చర్మం, శిరోజాలు అందంగా , అరోగ్యంగా ఉంటాయి. ఇందులో యాంటాక్సిడెంట్లు, విటమిన్లు, ఫ్యాట్స్ ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాదు బాదం నూనెతో పలు బ్యూటీ సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. అవేమిటంటే:
 వేసవి కాలంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంపై ట్యాన్ సమస్య తలెత్తుతుంది. బాదం నూనె, తేనె, నిమ్మరసం మూడింటినీ కలిపి పేస్టులా చేసుకుని చర్మంపై రాసుకుంటే ట్యాన్ సమస్య నుంచి బయటపడతాం. ఆరోగ్యవంతమైన, మెరిసే చర్మానికి కూడా ఈ పేస్టు బాగా పనిచేస్తుంది.
 బాదం నూనె చర్మానికి రాసుకుంటే చర్మం పగలదు. చర్మంపై తరచూ దురద వస్తుంటే రాత్రి పడుకోబోయే ముందు దురద వస్తున్న చోట బాదం నూనె రాసుకుని పడుకుంటే చాలు ఉదయానికి ఆ సమస్య మటుమాయం అవుతుంది.

- Advertisement -

 బాదంలో ఎసెన్షియల్ విటమిన్లు ఎక్కువగా ఉండడంతో చర్మానికి కావలసినంత మాయిశ్చరైజర్ అందుతుంది. బాదం నూనె ముఖానికి రాసుకుని కాసేపు అలాగే ఉంచుకుని కడిగేసుకుంటే మంచి ఫలితం
కనిపిస్తుంది.

 రసాయనాలతో నిండి ఉన్న క్రీములను చర్మానికి రాసుకుంటే చర్మంపై నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. చర్మంపై ఏర్పడ్డ ఇలాంటి నల్లటి వలయాలతో పాటు, కళ్ల కింద ఏర్పడ్డ సంచులను కూడా బాదం నూనె తగ్గిస్తుంది. ఇలాంటప్పుడు నిద్రపోవడానికి ముందు బాదం నూనెను ముఖానికి రాసుకోవాలి. ఇలా రెండు వారాలు రాసుకుంటే స్కిన్ పై మంచి ఫలితం కనపడుతుంది.
 పగిలిన పెదాలపై బాదం నూనె రాస్తే చర్మం ఎంతో మ్రుదువుగా తయారవుతుంది. తేనె, బాదం నూనె మిశ్రమాన్ని పెదాలపై రాసుకున్నా పగుళ్లు పోయి చర్మం నునుపుగా తయారవుతుంది.
 బాదం నూనె యాంటి ఏజింగ్ ఆయిల్ కూడా. మేకప్ ను తొలగించడంలో సైతం బాదం నూనె ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. యాక్నే సమస్యను తగ్గిస్తుంది. చర్మంపై ఏర్పడ్డ మచ్చలను పోగొడుతుంది.
 నిత్యం ముఖానికి బాదం ఆయిల్ రాసుకుంటే పెరిగిన వయసు తెలియకుండా ఎంతో యంగ్ గా కనిపిస్తారు. అంతేకాదు చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. రెండు స్పూన్ల బాదం నూనెలో విటమిన్ ఇ రెండు చుక్కలు కలిపి ఆ మిశ్రమాన్ని కాస్త గోరవెచ్చగా చేసి దానితో చర్మాన్నిమసాజ్ చేసుకోవాలి.


 బాదంనూనె, ఆముదం నూనె, ఆలివ్ నూనెలను సమపాళ్లల్లో తీసుకుని మూడింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని వెంట్రుకలను మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు అంచులు చిట్లవు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు కొన్ని వారాలపాటు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
 తలలో చుండ్రును బాదం నూనె నివారిస్తుంది. బాదం నూనె, ఆలివ్ నూనెలను కలిపి ఆ మిశ్రమాన్ని మాడుపై రాసుకొని 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలోని చుండ్రు పోతుంది.
 శుభ్రంగా ఉన్న మస్కారా స్టిక్ ను బాదం నూనెలో ముంచి కంటి రెప్పలకు మస్కారా ఎలా అప్లై చేస్తారో అలాగే ఈ నూనెను కూడా అప్లై చేయాలి. ఇలా రోజూ చేస్తే కనురెప్పలు పెద్దవిగా అయి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనపడతారు.

 బాదం నూనె జిడ్డుగా ఉండదు. ఎంతో తేలికగా కూడా ఉంటుంది. దీన్ని పాదాలకు, చేతులకు రాసుకుంటే చాలు చర్మం మ్రుదువుగా అవుతుంది. బాదం నూనెలో జింకు ఉండడం వల్ల కాళ్ల పగుళ్లతో పాటు పాదాలు, చేతులపై ఉండే చర్మం డ్రైగా ఉండడం తగ్గుతుంది.
 బాదం నూనె స్ట్రెచ్ మార్కులను పోగొడుతుంది. స్నానం చేసిన తర్వాత స్ట్రెచ్ మార్కులు ఉన్న చోట బాదం నూనె రాసి ఐదు నిమిషాలు వేలి కొసలతో గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా రోజులో రెండుసార్లు చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News