Sunday, November 24, 2024
Homeహెల్త్Aloe vera magic on hair: కలబందతో అందమైన జుట్టు

Aloe vera magic on hair: కలబందతో అందమైన జుట్టు

ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, మీకు ఎలాంటి రియాక్షన్ రాలేదంటే రెగ్యులర్ గా అలోవెరా వాడచ్చు

అలొవిరాతో అందమైన శిరోజాలు
అలొవిరా శిరోజాలకు ఎంతో మంచిది. మాడు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. జుట్టు రాలకుండా కాపాడుతుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధారణ వెంట్రుకలు, జిడ్డు వెంట్రుకలు ఉన్నవారు దీన్ని తలకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు రాసుకోవచ్చు. పొడిబారిన వెంట్రుకలు ఉన్న వారు దీన్ని వారానికి రెండు లేదా మూడుసార్లు పెట్టుకోవచ్చు. అయితే కొందరికి అలొవిరా రాసుకోవడం వల్ల పడక మాడులో దురద తలెత్తుతుంది. అలాగే దాన్ని అప్లై చేసుకున్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. దద్దుర్లు వంటివి కూడా వస్తాయి. అందుకే దీన్ని రాసుకోబోయేముందు ప్యాచ్ టెస్టు చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఎలర్జిటిక్ రియాక్షన్లుకు, దుష్ప్రభావాలకు గురికారు.

- Advertisement -

ముఖ్యంగా అలొవిరాలో 75 రకాల ఉత్తేజిత పదార్థాలు ఉన్నాయి. వాటిల్లో అత్యవసర ప్రొటీన్లతో పాటు అమినో యాసిడ్స్, సలిసిలిక్ యాసిడ్, ప్రొటియోలిటిక్ ఎంజైములు, యాంటాక్సిడెంట్లు, ఖనిజాలు,
విటమిన్లు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా, చిక్కగా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు మీ మాడును ఇది ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. మాడుపై వచ్చే దురదను తగ్గిస్తుంది. మాడుపై
తలెత్తే పలు ఇతర సమస్యలకు అంటే చుండ్రు, మాడు ఇరిటేషన్, ఎగ్జిమా వంటి వాటి నుంచి సైతం ఉపశమనాన్ని ఇస్తుంది. మాడుపై చేరిన అధిక మ్రుతకణాలను పోగొట్టడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అలొవిరా జిడ్డు శిరోజాలను లోతుకంటా శుభ్రం చేస్తుంది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు బాగా ఉన్నాయి. జుట్టును ఇది ఎంతో శుభ్రంగా ఉంచుతుంది. వెంట్రుకలను పట్టులా మెరిసేలా చేస్తుంది. వెంట్రుకలను పటిష్టంగా చేయడంతో పాటు దెబ్బతిన్న జుట్టును పటిష్టంగా ఉండేలా చేస్తుంది.

అలొవిరాలో యాంటాక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్ ఎ, బి, సి, ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని యాంటాక్సిడెంట్లు జుట్టును ఫ్రీరాడికల్స్ నుంచి పరిరక్షిస్తాయి. దెబ్బతిన్న జుట్టును బాగుచేయడంలో కూడా ఇవి సహకరిస్తాయి. దీనిలోని హైడ్రేటింగ్ గుణాలు మంచి కండిషనింగ్ ఏజెంటుగా పనిచేస్తాయి. జుట్టును దృఢంగా ఉంచుతాయి. శిరోజాల పెరుగుదలకు కూడా అలొవిరా ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు పలచబడకుండా సంరక్షిస్తుంది. రక్తప్రసరణను వేగవంతం చేయడం ద్వారా కుదుళ్ల నుంచి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. అలొవిరాలో మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా బాగా ఉన్నాయి. ఇవి వెంట్రుకలను చిట్లకుండా కాపాడతాయి. జుట్టుకు రక్షణ కల్పిస్తాయి.


అలొవిరాను నార్మల్, జిడ్డు శిరోజాలు ఉన్నవారు నేరుగా వెంట్రుకలకు అప్లై చేసుకోవచ్చు. అయితే దీనిలో మైల్డ్ యాస్ట్రింజెంట్ గుణాలు ఉండడం వల్ల జుట్ట కొద్దిగా పొడిబారుతుంది. అందుకని అలొవిరా జెల్ కు కొద్దిగా నేచురల్ ఆయిల్స్ లేదా గ్లిజరిన్ ని చేర్చి రాసుకోవచ్చు. ముఖ్యంగా మీది పొడిజుట్టు అయినా, జుట్టు
చిట్లిపోయే స్వభావం ఉన్నా దీన్ని తప్పనిసరిగా వాడాలి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే అలొవిరాతో
తయారుచేసే హోమ్ రెమిడీలు కూడా చాలా ఉన్నాయి. ఇవి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడమేకాకుండా శిరోజాలకు కావలసినంత హైడ్రేషన్ ని అందిస్తుంది. అలొవిరా హోం రెమిడీలలో అలొవిరా, ఆముదం నూనె కలిపిన మాస్కు ఒకటి. ఇది వెంట్రుకలపై బాగా పనిచేస్తుంది. ఆముదం జుట్టును పెరిగేలా చేస్తుంది. అంతేకాదు వెంట్రుకలను వొత్తుగా పెరిగేలా చేస్తుంది కూడా. ఈ మాస్కు వెంట్రకులకు కావలసినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఒక టీస్పూను అలొవిరా జెల్, ఒక టీస్పూన్ ఆముదం నూనె, ఒక టీ స్పూను తెనె(ఛాయిస్)తీసుకోవాలి. మొదట ఆముదం నూనెను గోరువెచ్చగా చేసి ఒక గిన్నెలో పోసి అందులో మిగతా పదార్థాలన్నింటినీ వేసి మెత్తగా పేస్టులా చేయాలి. ఆ పేస్టును మాడుకు, వెంట్రుకలకు పట్టించి అరగంట సేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత షాంపుతో తలరుద్దుకోవాలి. ఈ మాస్కును వారానికి ఒకసారి రాసుకుంటే చాలు. చుండ్రును తగ్గించడానికి అలొవిరా హెయిర్ మాస్కు బాగా పనిచేస్తుంది. అలొవిరా, యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి మాస్కులా చేసుకుని తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.


ఇందుకు నాలుగు టేబుల్ స్పూన్ల అలొవిరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్, రెండు లేదా మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ అవసరం. ఈ మూడింటినీ ఒక బౌల్ వేసి బాగా కలిపి మాస్కులా తయారుచేసుకుని దాన్ని మాడుకు కాటన్ బాల్ తో అప్లై చేసుకోవాలి. తర్వాత 20 నిమిషాలు దాన్ని అలాగే వదిలేయాలి. ఈ మాస్కును వారానికి ఒకసారి చొప్పున ఒక నెలరోజులు తలకు రాసుకోవాలి. ఆ తర్వాత వారం విడిచి వారం చొప్పున నెలరోజులు తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు చూస్తారు. అలొవిరా, పెరుగు కలిపిన మాస్కు కూడా చుండ్రును బాగా తగ్గిస్తుంది. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల అలొవరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని రెండింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని
మాడుకు , వెంట్రుకలకు అప్లై చేసుకుని అరగంట పాటు అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి. ఈ మాస్కును వారానికి ఒకసారి తలకు పెట్టుకోవచ్చు.

జుట్టుపై మంచి ఫలితాలు కనిపించాలంటే అలొవిరాను వారానికి ఒకసారి తలకు అప్లై చేసుకోవాలి. అయితే ఇది మీ హెయిర్ తీరుతెన్నుల బట్టి ఆధారపడి ఉంటుంది. నార్మల్ లేదా ఆయిలీ హెయిర్ ఉన్నవారు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు అలొవిరాను తలకు రాసుకోవచ్చు. పొడిజుట్టు ఉన్నవారు దీన్ని వారానికి రెండు లేదా మూడుసార్లు అప్లై చేసుకోవాలి. అయితే ఎంతమంచి పదార్థమైనా పరిమితి దాటితే
దుష్ప్రభావాలు తలెత్తుతాయని మరవొద్దు. అలొవిరా కూడా ఇందుకు మినహాయింపు కాదు. అలొవిరా పడని వాళ్లు దీనికి దూరంగా ఉండాలి. లేకపోతే మాడుపై దురద, మండుతున్నట్టు అనిపించడం, దద్దుర్లు వంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు పడని వారు కూడా దీనికి దూరంగా ఉండాలి. ముందే చెప్పినట్టు దీన్ని రాసుకునేముందు చర్మంపై ప్యాచ్ టెస్టు చేసుకోవడం చాలా మంచిది.
సో…వెంట్రుకల అందాన్నిపెంచే అలొవిరాను వైద్యుల సలహా తీసుకుని వాడండి. మంచి ఫలితాలు పొందండి. పొడవైన, ఆరోగ్యవంతమైన, నల్లని నిగ నిగలాడే శిరోజాలతో అందరినీ మెప్పించండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News