Sunday, November 16, 2025
Homeహెల్త్Health: మనం తినే ఈ ఒక్క ఐటమే..లివర్‌ ని బండకేసి బాదేది!

Health: మనం తినే ఈ ఒక్క ఐటమే..లివర్‌ ని బండకేసి బాదేది!

Corn Syrup Risk to Liver: మన శరీరంలో ఏ అవయవం చేసే పని అది చేస్తుంది.కానీ వీటన్నింటిలో కంటే కాలేయం పనితీరు ఇంకా ప్రత్యేకం..ఇది రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలో ఉన్న హానికరమైన విషాలను తొలగిస్తుందనే విషయం తెలిసిందే. అదనంగా, ఆహారంలోని పోషకాలను జీర్ణం చేయడంలో సహాయపడుతూ, అవసరమైన శక్తిని నిల్వ చేస్తుంది. కానీ నేటి జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, మద్యం వంటి అలవాట్ల వల్ల కాలేయం మీద తీవ్రమైన ప్రభావం పడుతున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు.

- Advertisement -

వైద్యులు చెబుతున్న దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు రెండు మిలియన్ల మంది కాలేయ సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రపంచంలో ప్రతి ఇరవై ఐదుగురిలో ఒకరు కాలేయ సమస్యల వల్ల చనిపోతున్నట్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.

Also Read:https://teluguprabha.net/devotional-news/rare-hamsa-mahapurusha-yoga-forming-this-diwali-after-100-years/

ఫ్యాటీ లివర్, సిర్రోసిస్..

2023 గణాంకాలు చెబుతున్నట్లు అమెరికాలోనే దాదాపు 4.5 మిలియన్ల మందికి కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారతదేశంలో కూడా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అమెరికన్ వైద్యుడు లివర్ ఆరోగ్యంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ కొత్త హెచ్చరికలు జారీ చేశాడు. ఆయన చెప్పిన వివరాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

ఆ వైద్యుడు చెబుతున్నట్టు ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తున్న కాలేయ వ్యాధుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా NAFLD ప్రధానంగా నిలుస్తోంది. ఈ వ్యాధి మద్యం వల్ల కాదు, తప్పు ఆహారపు అలవాట్లు, కదలికలు తక్కువగా ఉండే జీవనశైలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

కాలేయంలో కొవ్వు..

అమెరికన్ లివర్ ఫౌండేషన్ తెలిపిన గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. ఇది మొదట చిన్నగా మొదలైనా, కాలేయంలో కొవ్వు పేరుకుపోయి దానిని సరిగా పనిచేయనీయదు. ఈ పరిస్థితి కొనసాగితే, చివరికి కాలేయ వైఫల్యం లేదా క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితులు రావచ్చు.

నూనె లేదా మాంసం వల్ల కాకుండా..

చాలా కాలంగా ప్రజలు నెయ్యి, వెన్న, లేదా మాంసం వంటి పదార్థాలు కాలేయానికి హానికరమని నమ్ముతుంటారు. కానీ అమెరికన్ ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అడ్రియన్ స్నైడర్ వేరే అంశాన్ని గుర్తించారు. ఇటీవల ఆయన విడుదల చేసిన వీడియోలో, లివర్‌కు పెద్ద ముప్పు నూనె లేదా మాంసం వల్ల కాకుండా అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వల్ల వస్తుందని చెప్పారు.

శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, కేకులు…

అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అంటే ఏమిటి అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. ఇది చక్కెరను రసాయన పద్ధతిలో మార్చి తయారు చేసే కృత్రిమ తీపి పదార్థం. దీనిని ఎక్కువగా శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, రెడీమేడ్ సాస్‌లు, ఫ్లేవర్డ్ పెరుగు, జ్యూస్‌లలో ఉపయోగిస్తారు. ఈ పదార్థం శరీరంలోకి వెళ్లినప్పుడు గ్లూకోజ్ కంటే వేగంగా కొవ్వుగా మారుతుంది. దీంతో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి దాని పనితీరు దెబ్బతింటుంది.

ఫ్రక్టోజ్ సహజంగా పండ్లు, కూరగాయలలో ఉండే చక్కెర. కానీ HFCS లాంటి కృత్రిమ ఫ్రక్టోజ్ ఆరోగ్యానికి హానికరం. సహజ ఫ్రక్టోజ్‌ను తగిన పరిమాణంలో తీసుకుంటే శరీరానికి ఉపయోగపడుతుంది. కానీ ప్యాక్ చేసిన ఆహారాల్లో ఉండే ఫ్రక్టోజ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఉపయోగకరమైన బ్యాక్టీరియాను తగ్గించి, లివర్‌లో కొవ్వు నిల్వను పెంచుతుంది. దీనివల్ల కాలేయంలో వాపు, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయి. క్రమంగా ఇవి సిర్రోసిస్ లేదా కాలేయ క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/five-zodiac-signs-to-get-royal-luck-after-october-16/

డాక్టర్ స్నైడర్ మాటల్లో చెప్పాలంటే, నిత్య జీవితంలో మనం తినే చిన్న పదార్థాలే పెద్ద ప్రమాదాన్ని తెస్తాయి. ఉదాహరణకు తీపి పానీయాలు, రెడీమేడ్ జ్యూస్‌లు, బిస్కెట్లు, కేకులు, సాస్‌లు ఇవన్నీ HFCS ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిని తరచూ తినడం వలన కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని ప్రభావం సంవత్సరాల తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది.

ఆయన సూచనల ప్రకారం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. మొదటగా శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్ చేసిన తీపి పదార్థాలు పూర్తిగా తగ్గించాలి. బదులుగా తాజా పండ్లు, కూరగాయలు తినడం, ఇంట్లో తయారు చేసిన ఆహారం తినడం మంచిదని చెప్పారు. నీటిని ఎక్కువగా త్రాగడం, రోజూ కొంత వ్యాయామం చేయడం, పొగ త్రాగడం, మద్యం పూర్తిగా మానేయడం కూడా అవసరమని ఆయన సూచించారు.

ఆరోగ్య నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారు చెబుతున్నట్టు, ఆధునిక జీవనశైలిలో ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాల మీద ఆధారపడుతున్నారు. ఈ అలవాటు కాలేయానికి పెద్ద నష్టం కలిగిస్తోంది. ప్రత్యేకించి పిల్లలు, యువత ఎక్కువగా చక్కెర పానీయాలను తాగుతున్నారు. దీని ప్రభావం చిన్న వయస్సులోనే లివర్ మీద పడుతోంది.

ఆహారం, క్రమమైన వ్యాయామం..

అమెరికా, భారత్‌లతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో కాలేయ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. వైద్యులు చెప్పినట్లు, దీన్ని అరికట్టడానికి ప్రజల్లో అవగాహన చాలా అవసరం. శరీరానికి ఉపయోగకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, తగిన నిద్ర – ఇవి కాలేయాన్ని రక్షించే మూడు ప్రధాన చావి చెవులు అని చెబుతున్నారు.

కాలేయం దెబ్బతింటే దాని ప్రభావం క్రమంగా శరీరంలోని ప్రతి అవయవంపై పడుతుంది. అలసట, ఆకలి తగ్గడం, చర్మం పసుపు రంగులో మారడం, వాంతులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad