Ashwagandha offers several potential benefits: నేటి ఆధునిక యుగంలో ఆరోగ్యంపై ప్రజలల్లో పెరుగుతున్న అవగాహన కారణంగా ఇటీవల ఔషధ మూలికలకు ప్రాధాన్యత పెరిగింది. ఇంగ్లీషు మెడిసిన్ కంటే ఆయుర్వేధం వైపు ఎక్కువ మంది చేస్తున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగం నయమవ్వాలంటే అది ఆయుర్వేదంతోనే సాధ్యమని గ్రహిస్తున్నారు. అందుకే, మూలికా మొక్కలకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సంప్రదాయ పంటల నుంచి రైతులు క్రమంగా అశ్వగంధ వంటి మూలికా పంటల సాగు వైపు మళ్తున్నారు. జూషధాలు, మూలికల్లో ఎక్కువగా ఉపయోగించే అశ్వగంధ మొక్క సాగు చేసేందుకు తక్కువ నీరు, తక్కువ ఖర్చు అవసరం కావడంతో దీన్ని పెంచేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అశ్వగంధ మొక్క లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టే సామర్థ్యం కలిగి ఉండటం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధ మొక్క ద్వారా తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో లక్షలాది లాభాలు ఎలా వస్తాయనే విషయాలను పరిశీలిద్దాం.
అశ్వగంధ సాగుకు అనువైన ప్రాంతాలు..
అశ్వగంధను ఇండియన్ జిన్సెంగ్ లేదా వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు. ఇది శరీరాన్ని బలపరుస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఔషధ కంపెనీలు, హెల్త్ సప్లిమెంట్ బ్రాండ్‌లు, విదేశీ మార్కెట్‌లో దీనికి అధిక డిమాండ్ ఉంది. భారతదేశంలో మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అశ్వగంధను విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఉండే వేడి, పొడి వాతావరణం దీని సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతులకు అవగాహన లేకపోవడం, వాతావరణం అనుకూలించకపోవడంతో దీని వైపు చూడటం లేదు.
అశ్వగంధ మొక్క ఎలా పెరుగుతుంది?
అశ్వగంధ ఇసుక లేదా తేలికపాటి ఎర్రటి లోమ్ నేలల్లో ఈ అశ్వగంధ మొక్క బాగా పెరుగుతుంది. అశ్వగంధ మొక్క పెరిగేందుకు నీరు నిలవకుండా చూసుకోవాలి. వర్షాలు ప్రారంభమయ్యే ముందు భూమిని 2-3 సార్లు దున్నాలి. జూన్-జూలై నెలలు విత్తనాలు, నర్సరీ తయారీకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. అయితే, నాణ్యమైన విత్తనాలు ఎంచుకుని నర్సరీలో వేసిన 35-40 రోజుల్లో ప్రధాన పొలంలోకి నాటాలి. వరుసల మధ్య 20-25 సెం.మీ, మొక్కల మధ్య 8-10 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక హెక్టారుకు సుమారు 5 కిలోల విత్తనాలు సరిపోతాయి. అయితే, దీనికి తక్కువ నీరు సరిపోతుంది. ప్రతి 8-10 రోజులకు ఒకసారి తేలికపాటి నీటిపారుదల ఇవ్వాలి. ఆకులు ఎండిపోయి, పండ్లు ఎర్రగా మారినప్పుడు.. అంటే 160-180 రోజులలో పంట కోతకు సిద్ధమవుతుంది. కోత తర్వాత.. వేర్లను జాగ్రత్తగా పెకలించి, శుభ్రపరిచి, ఎండబెట్టి విక్రయించాలి. అశ్వగంధ వేర్లకే మార్కెట్‌లో అధిక విలువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


