Avoid These Foods With Chia Seeds: చియా గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలామంది వీటిని తమ డైట్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఎందుకంటే చియా గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు, మెరుగైన జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, ఈ గింజలను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ద్వారా వాటి పోషకాలు తగ్గడం, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో చియా విత్తనాలతో కలిపి తీసుకోకూడని కొన్ని ఆహారాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
క్రీమ్‌తో కూడిన పాల ఉత్పత్తులు: హెవీ క్రీమ్ లేదా కండెన్స్‌డ్ మిల్క్ వంటి భారీ పాల ఉత్పత్తులు చియా గింజలతో తినకూడదు. ఎందుకంటే ఇవి కడుపు నొప్పి, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తాయి. భారీ పాల ఉత్పత్తులు చియాలోని ఫైబర్‌ను జీర్ణం చేయడం కష్టతరం చేస్తాయి.
అధిక చక్కెర ఆహారాలు: స్వీట్ పుడ్డింగ్‌లు లేదా స్మూతీలకు చియాను జోడించడం సర్వసాధారణం. కానీ చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహారాలతో చియా గింజలను కలిపి అస్సలు తీసుకోకూడదు. అవి రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా హెచ్చుతగ్గులకు కారణమవుతాయి.
అధిక ఫైబర్ ఆహారాలు: చియాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఓట్స్, బ్రోకలీ లేదా బీన్స్ వంటి అధిక ఫైబర్ ఆహారాలతో దీనిని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్యాక్ చేసిన పండ్ల రసాలు: ఇవి అధిక మొత్తంలో చక్కెర, ఆమ్లతను కలిగి ఉంటాయి.కాబట్టి వీటిని చియా విత్తనాలతో తీసుకుంటే జీర్ణక్రియను దెబ్బతీస్తాయి.
ఐరన్ సప్లిమెంట్లు: చియా విత్తనాలలో అధిక ఫైబర్, కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఇది ఐరన్ శోషణను తగ్గిస్తుంది, సప్లిమెంట్ల పూర్తి ప్రయోజనాలను నిరోధిస్తుంది.
కూల్ డ్రింక్స్ లేదా ఐస్ క్రీం: చియా విత్తనాల శీతలీకరణ స్వభావం చల్లని ఆహారాలతో కలిపి శరీరంలో అధిక చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.
కెఫిన్ (కాఫీ, ఎనర్జీ డ్రింక్స్): చియా నీటిని గ్రహిస్తుంది. అయితే కెఫిన్ డిహైడ్రేట్ చేస్తుంది. కావున వీటితో చియా గింజలు తింటే డిహైడ్రేట్, తలనొప్పి లేదా బలహీనతకు దారితీస్తుంది.
ఆక్సలేట్లు (పాలకూర, దుంపలు): ఎక్కువ ఆక్సలేట్లు కలిగిన పచ్చి కూరగాయలతో చియా విత్తనాలు తినకూడదు. ఇవి చియాలో కాల్షియం శోషణను నిరోధిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


