Health effects of bathing after meals : స్నానం.. కేవలం శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియ కాదు, అది మనసును, తనువును ఉత్తేజపరిచే ఓ ఔషధం. కానీ, ఆ ఔషధం అమృతంలా పనిచేయాలంటే, దానికి కొన్ని నియమాలున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా స్నానం చేస్తే, లాభాల కంటే నష్టాలే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరమని స్పష్టం చేస్తున్నారు. అసలు స్నానానికి, భోజనానికి ఉన్న సంబంధమేంటి…? చన్నీళ్లు, వేడినీళ్లలో ఏది మనకు మేలు చేస్తుంది…?
భోజనం తర్వాత స్నానం.. ఎందుకంత ప్రమాదకరం : “ఏ స్నానమైనా సరే, ఖాళీ కడుపుతోనే చేయాలి. భోజనం చేస్తే కనీసం గంట, రెండు గంటల విరామం తప్పనిసరి,” అని ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ హరికృష్ణ స్పష్టం చేస్తున్నారు. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. భోజనం చేసిన తర్వాత, మన శరీరంలోని రక్త ప్రసరణ అధికంగా జీర్ణవ్యవస్థ వైపు మళ్లుతుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
ఆ సమయంలో స్నానం చేస్తే, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, రక్త ప్రసరణ చర్మం వైపు మళ్లుతుంది. దీనివల్ల, జీర్ణవ్యవస్థకు రక్త సరఫరా తగ్గి, అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
చన్నీళ్లా వేడినీళ్లా? ఏది మేలు : ఈ విషయంలో చాలామందికి సందేహాలుంటాయి. రెండింటి వల్ల వేర్వేరు ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఉత్తేజం: చన్నీటి స్నానం శరీరాన్ని, మెదడును తక్షణమే ఉత్తేజపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఒత్తిడికి చెక్: ఒత్తిడిని తగ్గించే హార్మోన్లను ప్రేరేపించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
వేడినీటితో అలసట దూరం.
‘నేచురల్ పెయిన్ కిల్లర్’: వేడినీటి స్నానం బిగుసుకున్న కండరాలను సడలించి, నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మెడ, నడుమునొప్పి, సయాటికా వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
ప్రశాంతత: నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, మంచి నిద్రకు దోహదపడుతుంది.
స్నానంలోనూ.. రకాలున్నాయి : ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
అభ్యంగన స్నానం: నువ్వుల నూనె వంటి తైలాలతో శరీరాన్ని మర్దనా చేసుకుని, ఆ తర్వాత సున్నిపిండితో స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమై, చర్మ, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మట్టి స్నానం (మడ్ బాత్): శుద్ధి చేసిన మట్టిని ఒంటికి రాసుకుని, ఎండలో కాసేపు ఉండటం వల్ల, శరీరంలోని విష పదార్థాలు, మృతకణాలు తొలగిపోతాయి.
తొట్టి స్నానం (హిప్ బాత్): టబ్‌లో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, మలబద్ధకం, మొలలు వంటి సమస్యలు తగ్గుతాయి.
ముఖ్య గమనిక: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఎలాంటి స్నాన పద్ధతిని పాటించాలన్నా ముందుగా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.


