Beauty Parlor Stroke Syndrome : అందంగా మెరిసిపోవాలని, సేద తీరడానికి బ్యూటీ పార్లర్‌కు వెళ్తాం. కానీ, అక్కడి ఓ సాధారణ ప్రక్రియ మనల్ని పక్షవాతం బారిన పడేస్తుందంటే నమ్మగలమా? వింతగా, అతిశయోక్తిగా అనిపిస్తున్నా ఇది నిజం. వైద్య ప్రపంచంలో ఇప్పుడు “బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్” (BPSS) అనే పదం తీవ్ర కలకలం రేపుతోంది. హాయిగా హెయిర్ వాష్ చేయించుకుందామని వెళ్లినవారు, తలతిరగడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. అసలేంటీ బ్యూటీ పార్లర్ స్ట్రోక్..? ఒక మామూలు హెయిర్ వాష్ మెదడుపై ఎలా ప్రభావం చూపుతుంది..? ఎలాంటి లక్షణాలను గమనించాలి? ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి..?
అసలేంటి ఈ ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ : ఇది చాలా అరుదైనప్పటికీ, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్య. బ్యూటీ పార్లర్లలో హెయిర్ వాష్ చేసేటప్పుడు, తలను వెనక్కి వంచి షాంపూ బేసిన్‌పై ఉంచుతారు. ఇలా తలను అతిగా వెనక్కి వంచినప్పుడు, మెడ భాగంలో ఉండే వెన్నుపూస ధమని (Vertebral Artery) మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఈ ధమని మెదడుకు రక్తాన్ని సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఒత్తిడి కారణంగా ఈ రక్తనాళం నొక్కుకుపోవడం లేదా కొన్నిసార్లు దాని లోపలి గోడలు చిరగడం (Arterial Dissection) జరగవచ్చు. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి, రక్తం గడ్డకట్టి, అది స్ట్రోక్ (పక్షవాతం)కి దారితీస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఒక అధ్యయనంలో తేల్చిందేమిటంటే, మెడను విపరీతంగా వెనక్కి తిప్పడం వల్ల వెర్టెబ్రోబాసిలార్ ఇన్సఫిషియెన్సీ (VBI) సమస్య ఏర్పడి ఈ సిండ్రోమ్ వస్తుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి : ఈ సిండ్రోమ్ బారిన పడినప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు.
తీవ్రమైన తలనొప్పి: సుమారు 92 శాతం కేసులలో ఇదే మొదటి లక్షణంగా ఉంటుంది.
తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం. మాట్లాడటంలో ఇబ్బంది, మాట తడబడటం.
దృష్టి మందగించడం లేదా ఒక వస్తువు రెండుగా కనిపించడం. శరీరంలో ఒకవైపు తిమ్మిర్లు రావడం (పరెస్థెసియాస్).మెడ ప్రాంతంలో వాపు లేదా నొప్పి. తీవ్రమైన సందర్భాల్లో పక్షవాతం, స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి సంభవించవచ్చు.
ఎవరికి ప్రమాదం ఎక్కువ : “రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ‘అథెరోస్ల్కెరోసిస్’ సమస్య ఉన్నవారికి బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అలాగే, పొగతాగే అలవాటు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి” అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి : కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో ఈ తీవ్రమైన ప్రమాదాన్ని నివారించవచ్చు. హెయిర్ వాష్ సమయంలో మెడ కింద సరైన సపోర్ట్ (మెత్తని టవల్ లేదా కుషన్) ఉండేలా చూసుకోవాలి. మెడను మరీ ఎక్కువగా వెనక్కి వంచకుండా, సౌకర్యవంతమైన భంగిమలో ఉండేలా చూసుకోవాలి. ఏమాత్రం అసౌకర్యంగా, నొప్పిగా అనిపించినా వెంటనే ప్రక్రియను ఆపమని సిబ్బందికి చెప్పాలి. రక్తపోటు, మెడనొప్పి వంటి సమస్యలు ఉంటే ఆ విషయాన్ని ముందుగానే బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు తెలియజేయాలి.
వీలైతే, ముందుకు వంగి హెయిర్ వాష్ చేసే పద్ధతిని ఎంచుకోవడం సురక్షితం.
చికిత్స – నిర్ధారణ : లక్షణాలు కనిపిస్తే, తక్షణమే వైద్యులను సంప్రదించాలి. బ్రెయిన్ సీటీ/ఎంఆర్ఐ స్కాన్, ఎంఆర్ యాంజియోగ్రఫీ, డాప్లర్ పరీక్షల ద్వారా రక్తనాళాల పరిస్థితిని అంచనా వేసి వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. సాధారణ స్ట్రోక్‌లకు అందించే చికిత్సనే దీనికీ అందిస్తారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా పరిగణించరాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, కచ్చితంగా వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం శ్రేయస్కరం.


