అరటిపండును ‘నేచర్ బొటాక్స్’ అని బ్యూటీ నిపుణులు అంటుంటారు. ఎందుకంటే అరటిపండు గుజ్జుతో చేసిన మాస్కును ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో బిగువుగా, మ్రుదువుగా అయి చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తారు. అంతేకాదు అరటిపండు దెబ్బతిన్న శిరోజాలను అందంగా, ఆరోగ్యంగా మలుస్తుంది. కళ్ల కింద ఏర్పడ్డ ఉబ్బరింపును తగ్గిస్తుంది. మంచి షాంపుగా పనిచేస్తుంది. మరెన్నో లాభాలను అందిస్తుంది.
అరటిపండు నిండా పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, ఇ, జింక్, అమినో ఆమ్లాలు వంటి ఎన్నో పోషకాలు సమ్రుద్ధిగా ఉన్నాయి. ఈ పండు శరీర ఆరోగ్యానికే కాకుండా శరీర అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. శిరోజాలు, చర్మాలను ఎంతో అందంగా కనిపించేలా చేస్తుంది . ముఖ చర్మం మ్రుదువుగా ఉండాలంటే అరటిపండు ఫేస్ మాస్కు బాగా పనిచేస్తుంది. దీనికి అర టీస్పూను ముడి తేనె, రెండు చుక్కల లవండర్ ఎసెన్షియల్ ఆయిల్(ఆప్షనల్) , బాగా పండిన అరటి పండు సగం ముక్కను తీసుకోవాలి. అరటిపండును మెత్తగా చేసి అందులో తేనె, లవండర్ ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలు వేసి మెత్తగా పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లటినీళ్లతో కడుక్కోవాలి. ఈ మాస్కు కళ్లకు తగలకుండా పెట్టుకోవాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు ముఖానికి ఈ మాస్కు పెట్టుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అరటిపండు వల్ల ఉన్న మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది వెంట్రుకలకు నేచురల్ హెయిర్ కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టు చిక్కుబడకుండా చేయడమే కాకుండా శిరోజాలు సిల్కీగా, చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. అరటిపండు హెయిర్
కండిషనర్ ను ఇంట్లో చేసుకోవచ్చు. దీనికి బాగా పండిన రెండు అరటిపండ్లు తీసుకొని బ్లెండర్ లో వేసి మెత్తగా చేయాలి.
అందులో రెండు టీస్పూన్ల పెరుగు, ఒక టీస్పూను కొబ్బరినూనె, అర టీస్పూను తాజా నిమ్మరసం, అర టీస్పూను తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని తలస్నానం చేసిన వెంట్రుకలకు పట్టించి షవర్ క్యాప్ జుట్టుకు పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును బాగా శుభ్రంచేయాలి. ఇంకో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే అరటిపండును షాంపుగా కూడా వాడొచ్చు. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. దీనివల్ల జుట్టు సిల్కీగా, మ్రదువుగా, ఎంతో శుభ్రంగా తయారవుతుంది. అరటిపండు షాంపును ఇంట్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. బాగా పండిన రెండు అరటిపండ్లు, ఒక టీస్పూను ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూను తేనె, ఐదు చుక్కల రోజ్ ఆయిల్, ఐదు చుక్కల లవండర్ ఆయిల్ రెడీ పెట్టుకోవాలి. అరటిపండును ముక్కలుగా చేసి బ్లెండర్ లో వేసి అందులో ఆలివ్ ఆయిల్ వేసి మెత్తటి రూపుకు వచ్చేంత వరకూ రెండునిమిషాలు గ్రైండ్ చేయాలి. దీన్ని చిన్న గ్లాసు జార్ లో వడగొట్టాలి. ఇందులో మిగతా ఎసెన్షియల్ ఆయుల్స్ వేసి అవన్నీ బాగా కలిసిపోయేలా స్పూనుతో కలపాలి. తలపై నీళ్లు పోసుకుని జుట్టును బాగా కడుక్కొని ఆ తర్వాత ఈ అరటిపండు షాంపును వెంట్రుకలకు పట్టించి వెంట్రుకలు ముడిలా వేసుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అలా పది నిమిషాలు దాన్ని ఉంచుకొని గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మ్రుదువుగా అవుతుంది.
అరటిపండు షాంపు వెంట్రులకు షాంపుగా, కండిషనర్ గా అంటే టు ఇన్ వన్ గా ఉపయోగపడుతుంది. అంతేకాదు అరటిపండులో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. ఇది చర్మంపై ఏర్పడిన యాక్నే ఎరుపుదనాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులోని జింకు, లాక్టిన్ లు యాక్నే బాక్టీరియాపై శక్తివంతంగా పనిచేస్తుంది. పండిన అరటిపండు తీసుకుని మెత్తగా చేసి అందులో కాస్త తేనె కలిపి పేస్టులా చేయాలి. ఆ
మిశ్రమాన్ని యాక్నే ఉన్న ప్రదేశాలపై రాసి ఏడు నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే చర్మంపై మంచి ప్రభావం కనిపిస్తుంది. లేదా అరటితొక్కను యాక్నే ఉన్నచోట గట్టిగా ఒత్తి కాసేపు అలాగే ఉంచినా యాక్నేసమస్యపై మంచి ప్రభావం కనిపిస్తుంది. వెంట్రుకలకు కావలసిన హైడ్రేషన్ కూడా అరటిపండు అందిస్తుంది. జుట్టు చివర్లు చిట్లకుండా సంరక్షిస్తుంది. జుట్టు కొసలు దెబ్బతినకుండా ద్రుఢంగా ఉంచే అరటిపండు, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్కు ఉంది. దీన్ని ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఇందుకు బాగా పండిన ఒక అరటిపండు, ఒక టేబుల్ స్పూను పచ్చిపాలు, రెండు టీస్పూన్లు ఆలివ్ ఆయిల్ , నాలుగు చుక్కల లవండర్ ఎసెన్షియల్ ఆయిల్ అన్నింటినీ కలిపి బ్లెండర్ లో వేసి పేస్టులా చేయాలి. దీన్ని
ఒక బౌల్ లో వడగొట్టాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారినట్టు ఉన్న జుట్టు కుదుళ్ల నుంచి కొసళ్ల వరకూ బాగా రాయాలి. తర్వాత జుట్టు గట్టిగా ముడివేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అరగంట తర్వాత నేచురల్ సల్ఫేట్ ఫ్రీ షాంపుతో తలస్నానం చేయాలి. ఆ తర్వాత జుట్టుపై లీవ్ ఇన్ కండిషనర్ గా రోజ్ వాటర్ గ్లిజరిన్
హెయిర్ స్ప్రేని అప్లై చేయాలి. అంతేకాదు అరటిపండు ముఖంపై యాక్నేను, మచ్చలను కూడా పూర్తిగా పోగొడుతుంది.
అరటిపండు హెయిర్ మాస్కు శిరోజాల పెరుగుదలకు తోడ్పడుతుంది. మాడుకు కావలసినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ హెయిర్ గ్రోత్ మాస్కు తయారీ చాలా సింపుల్. ఒక పండిన అరటిపండు, ఒక టేబుల్ స్పూను కొబ్బరినూనె, ఒక టేబుల్ స్పూను ముడితేనె కలిపి బ్లెండర్ లో వేసి పేస్టులా చేయాలి. దీన్ని పొడిజుట్టుకు పట్టించి జుట్టు ముడివేసుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అరగంట అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో వెంట్రుకలను బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత సల్ఫేట్ లేని షాంపుతో తలరుద్దుకోవాలి. ఇలా వారానికి ఒకమాటు చొప్పున మూడు నెలలు తలకు అప్లై చేసుకోవాలి. తర్వాత జుట్టు బాగా ఒత్తుగా పెరగడం గమనించగలరు. అరటిపండులోని హైడ్రేటింగ్ గుణాల వల్ల పొడిబారిన జుట్టుపై కూడా అరటిపండు ఎంతో బాగా పనిచేస్తింది. ఇందుకు బనానా కోకోనట్ మిల్క్ ట్రీట్మెంట్ ఉంది. రెండుపండిన అరటిపండ్లు, అరకప్పు కొబ్బరిపాలు, ఒక టేబుల్ స్పూను కొబ్బరినూనె, ఒక టీస్పూను తేనె లను రెడీ పెట్టుకోవాలి. వీటన్నింటినీ కలిపి బ్లెండర్ లో వేసి మెత్తగా చేయాలి. వెంట్రులను పాయలు పాయలుగా తీసి దీన్ని బాగా పట్టించాలి. తర్వాత జుట్టు ముడివేసుకుని ప్లాస్టిక్ క్యాప్ పెట్టుకోవాలి. అలా అరగంటపాటు దాన్ని ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో తలను శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వెంట్రుకలపై లీవ్ ఇన్ కండిషనర్ అప్లై చేయాలి. అరటిపండు చర్మానికి కావాలసిన హైడ్రేషన్ అందించడమే కాకుండా చర్మంపై ఎక్కువ నూనె చేరే సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ సమస్యకు ఆయిల్ కంట్రోల్ బనానా మాస్కు ఉంది. దీన్ని తయారు చేయడం ఎంతో సింపుల్. బాగా పండిన ఒక అరటిపండు తీసుకుని ముక్కలు చేయాలి. అందులో ఒక
టీస్పూను తాజా నిమ్మరసాన్ని కలిపి బ్లెండర్లో వేసి మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని కళ్లకు తగలకుండా ముఖానికి పట్టించాలి. కాసేపైన తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. చల్లగా ఉన్న గ్రీన్ టీ ని టోనర్ గా వాడాలి. ఇది తేలికపాటి తేమను అందించే వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అరటిపండు కళ్లకింద ఏర్పడ్డ వాపును కూడా తగ్గిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కళ్లపై అరటిపండు తొక్కలను పెట్టి ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత అరటిపండు తొక్కలను కళ్ల మీద నుంచి తీసేసి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే మీ చర్మం తాజాగా ఉండడంతోపాటు కళ్ల కింద వాపు కూడా తగ్గుతుంది.