భోజనం తర్వాత తమలపాకులతో చేసిన కిళ్లీ వేసుకోవడం చాలామందికి అలవాటు. అందులోనూ విందుల్లో పిండివంటలతో ఆహారాన్ని తిన్నప్పుడు అది సులభంగా జీర్ణం కావడం కోసం చాలామంది తమలపాకు తాంబూలం వేసుకుంటారు. కానీ ఈ తమలపాకుల్లో చర్మ బ్యూటీని పెంచే ఎన్నో సీక్రెట్లు దాగున్నాయని మీకు తెలుసా? వాటిని గురించి తెలుసుకుందాం.
తమలపాకుల పేస్టును ముఖానికి రాసుకుంటే చర్మం మ్రుదువుగా తయారవుతుంది. యాక్నే సమస్యను కూడా తమలపాకులు తగ్గిస్తాయి. అంతేకాదు కళ్లకింద ఏర్పడ్డ నల్లటి వలయాలతో పాటు, ముఖం మీద ఏర్పడ్డ అన్నిరకాల నల్ల మచ్చలను కూడా తమలపాకులు పోగొడతాయి. ఇవే కాకకుండా తమలపాకుల వల్ల మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి.తాజా తమలపాకుల నుంచి వచ్చేసువాసన, అవి ఇచ్చే కూలింగ్ ఎఫెక్టు చర్మానికి అందించే అందం ఎంతో.అంతేకాదు ఇవి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి కూడా. ఎన్నో చర్మ సమస్యల నివారణకు తమలపాకులు నేచురల్ రెమెడీగా పనిచేస్తాయి. చర్మం మీద ఉండే నల్లని మచ్చలను పోగొట్టి స్కిన్ని మెరిసేలా చేస్తాయి.
వీటిల్లోని యాంటీబాక్టీరియల్ సుగుణాలు బ్రైటనింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. నిద్రలేవగానే కళ్ల కింద భాగం ఉబ్బరించినట్టు ఉంటే దానిపై తమలపాకు ఫేస్ ప్యాక్ రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. తమలపాకుల్లో ఎన్నో మెడిసినల్ గుణాలు కూడా ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించే సుగుణాలు తమలపాకుల్లో బాగా ఉన్నాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు దద్దుర్లు, ఎర్రటి మచ్చలతో బాధపడుతుంటారు. ఇంకొందరికి స్కిన్ ఎలర్జీ ఉంటుంది. ఈ సమస్యల నివారణలో తమలపాకులు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. అలాంటి ఎలర్జీ, దద్దుర్లు వచ్చిన ప్రదేశంలో తమలపాకు పేస్టును రాసి రుద్దితే ఆ బాధ తగ్గి సాంత్వన పొందుతారు. తమలపాకు పేస్టు చర్మంపై ఏర్పడ్డ ర్యాష్, ఇన్ఫెక్షన్లను తగ్గించి చర్మాన్ని పరిరక్షిస్తుంది. చర్మంపై తలెత్తే దురదను కూడా తగ్గిస్తుంది. చర్మంపై దురదకు, ఇన్ఫెక్షనుకు కారణమైన బాక్టీరియాను తమలపాకులోని యాంటీబాక్టీరియల్ గుణం పోగొట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. యాక్నే నియంత్రణకు కూడా తమలపాకు పేస్టును వాడతారు.
వారానికి రెండుసార్లు తమలపాకు పేస్టును ముఖానికి రాసుకోవడం వల్ల యాక్నే సమస్య తగ్గుతుంది. తమలపాకులను మెత్తగా పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే చాలు. ఈ పేస్టులో మీ చర్మానికి సరిపడే పెరుగు ,ముల్తానీ మట్టీ లాంటి పదార్థాలను వేటినైనా చేర్చి ఆ పేస్టును చర్మానికి రాసుకోవాలి.ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మెరుపును సంతరించుకుంటుంది. తమలపాకులను ఎండబెట్టి పొడిలా చేసి దాన్ని ఒక జార్ పోసుకుని భద్రపరచుకొని ఆ పొడిని కావలసినపుడు వాడుకోవచ్చు. వేపాకు స్నానం లాగ తమలపాకుల స్నానం కూడా చేయొచ్చు. స్నానం చేసే నీటిలో కొన్ని తమలపాకులను వేసి 15 లేదా 20 నిమిషాలు అలాగే ఉంచి ఆతర్వాత ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మంపై దురద, దద్దుర్లు, ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి ఈ తమలపాకుల స్నానం బాగా పనిచేస్తుంది. తమలపాకుల స్నానం చర్మానికి ఎంతో సాంత్వననిస్తుంది.
తమలపాకులతో ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. కొన్ని నీళ్లల్లో తమలపాకులు వేసి వాటిని బాగా ఉడికించాలి. ఆ నీళ్లు ఆకుపచ్చ రంగులో వచ్చిన వెంటనే వడగొట్టాలి. ఈ నీటిని మీరు ముఖం కడుక్కున్న ప్రతిసారీ ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై చేరిన బాక్టీరియాను పోగొట్టి చర్మం క్లీన్సర్ గా పనిచేస్తుంది. చర్మ సమస్యల నుంచి మిమ్మల్ని శాశ్వతంగా కాపాడుతుంది. అదీ సంగతి. మరి తమలపాకులతో మీ చర్మం అందాన్ని మరింత పెంచుకుంటారు కదూ… ఇక ఆలస్యం ఎందుకు…మరి?