ఇవి తింటే పొత్తికడుపు ఫ్యాట్ తగ్గుతుంది
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుని ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల గుండెజబ్బులు, మధుమేహం వంటి వాటి బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ఆరోగ్యానికి ముప్పు కలిగించే పొట్ట చుట్టూ చేరిన కొవ్వును తగ్గించే ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. వీటిని తింటే పొత్తికడుపు చుట్టూతా ఉన్న కొవ్వు కరుగుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.
పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో పళ్ళు బాగా పనిచేస్తాయి. వీటిల్లో విటమిన్లు,ఖనిజాలు, డయటరీ ఫైబర్, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయటరీ ఫైబర్ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీవక్రియ బాగా జరుగుతుంది. రక్తపోటు సమస్య కూడా ఉండదు. అందుకే కమలాలు, నిమ్మ, కివి, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ బాగా తినాలంటున్నారు. వీటిల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడమే కాకుండా యాంటీ మైక్రోబియల్ గుణాలు వీటిల్లో బాగా ఉంటాయి. పొత్తికడుపు చుట్టూ చేరిన కొవ్వును తగ్గించే పళ్లల్లో యాపిల్స్, పుచ్చకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు కూడా ఉన్నాయి. అయితే పళ్లల్లో ఖనిజాలు, విటమిన్లు బాగా ఉన్నా కూడా సహజమైన చక్కెర కూడా కొంత ఉంటుంది కాబట్టి వాటిని అతిగా తినకూడదని కూడా వైద్యులు చెప్తున్నారు.
పప్పులు కూడా బాగా తినాలి. వీటిల్లో మాంసక్రుతులు బాగా ఉంటాయి. వీటిల్లో కాలరీలు, కొవ్వు తక్కువ. పప్పుల్లోని లీన్ ప్రొటీన్ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా జీవక్రియ వేగంగా జరిగేట్టు తోడ్పడతాయి. శరీరం పనితీరు సైతం ఎంతో బాగా ఉంటుంది. మసాలాలు వేసిన , బాగా వేగించిన పప్పు కన్నా ఉడకబెట్టిన పప్పు చాలా ఆరోగ్యమని పోషకాహారనిపుణలు చెప్తున్నారు. చేప తినడం వల్ల కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. చేపలో పలు ప్రొటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ప్రొటీన్లు కండరాలను బలోపతేం చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని వాపును తగ్గిస్తాయి. మెటబాలిజం రేటును పెంచుతాయి. వాపు ఎంత తక్కువగా ఉంటే ఒత్తిడి, వాపుల వల్ల తలెత్తే బరువు అంత తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి.
బాదం కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. కొన్ని బాదం పప్పులు తింటే చాలు కడుపునిండినట్టు ఉంటుంది. ఆకలి తొందరగా వేయదు. బాదంలో హెల్తీ ఫ్యాట్లు, ప్రొటీన్లు బాగా ఉంటాయి. శాకాహారులకు కావలసిన పోషకాలను బాదం అందిస్తుంది. దీంతో శరీరంలోని బ్యాడ్ కొవ్వు కరుగుతుంది. బాదం గింజల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరం జీవక్రియ పెరగడంతో పాటు శక్తిసామర్థ్యాలు సైతం బాగా పెరుగుతాయి. బీన్స్, చిక్కుళ్లల్లో కూడా ప్రొటీన్లు, పీచుపదార్థాలు, విటమిన్లు,
ఖనిజాలు బాగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల ఆకలి అనిపించదు. చిరుతిళ్లపై చూపు పోదు. అతిగా తినే అలవాటును అధిగమించవచ్చు. శాకాహారులకు, వేగాన్స్ కు కావలసినన్ని ప్రొటీన్లను ఇవి అందిస్తాయి కూడా. ఇవి శరీరానికి కావలసిన సూక్ష్మపోషకపదార్థాలను సైతం అందిస్తాయి. పాలకూర, ఇతర ఆకుకూరలు, కూరగాయలు కూడా పొత్తికడుపు చుట్టూ చేరిన కొవ్వను కరిగిస్తాయి. అందుకే వీటిని నిత్యం మీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి. పాలకూర, ముల్లంగి ఆకు, కారట్, బ్రొకోలీ వంటి వాటిల్లో విటిమిన్లు, ఖనిజాలు, యాంటాక్సిడెంట్లు, డయటరీ ఫైబర్ అత్యధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆకలి తీరుతుంది. కడుపు నిండుగా ఉంటుంది. జీవక్రియ బాగా జరగడానికి కూడా ఇవి తోడ్పడతాయి.
పాల ఉత్పత్త్తుల్లో కూడా పలు పోషకాలు ఉంటాయి. వీటిని తింటే చాలాసేపటి వరకూ ఆకలి వేయదు. బరువు తగ్గడంలో కూడా డైరీ ఉత్పత్తులు సహాయపడతాయి. అయితే వీటి వినియోగం పరిమితిని దాటకూడదు. అలాగే ఓట్మీల్ లో కూడా పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. జీర్ణక్రియకు కూడా ఇవి ఎంతగానో సహకరిస్తాయి. ఓట్మీల్ లో సొల్యుబుల్ ఫైబర్ కార్మొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించడమే కాదు వ్యాయామాలు చేసుకోవడానికి కావలసినంత శారీరక శక్తిని అందిస్తాయి. అందుకే ఓట్మీల్ ను నట్ బట్టర్ తో గానీ లేదా కొన్ని నట్స్ ను ఓట్మీల్ లో వేసుకుని కానీ తింటే ప్రొటీన్లు శరీరానికి బాగా అందుతాయి. ఓట్మీల్ కొనుక్కునేటప్పుడు ఫ్లేవర్ లేని దాన్ని కొనుక్కుంటే ఉత్తమం. ఎందుకంటే ఫ్లేవర్డు ఓట్మీల్ లో కొంత షుగర్ తో పాటు రసాయనాలు కూడా ఉంటాయి.
స్మూదీలకు లేదా మీరు చేసే బ్రేక్ ఫాస్టులో పీనట్ బటర్ వాడితే మంచిది. ఇందులో బోలెడు ప్రొటీన్లు,విటమిన్ ఇ, ఐరన్, పొటాషియం, జింకు, యాంటాక్సిడెంట్లు, డైటరీ ఫైబర్, పోలీఫెనల్స్ ఉంటాయి. ఉడకబెట్టిన, లేదా నానబెట్టిన గుప్పెడు పల్లీ కాయలను స్కాక్ లా తింటే ఆకలి తగ్గుతుంది. దీంతో అతిగా తినరు. ఫలితంగా బరువు పెరగరు. పల్లీ కాయలనుఎక్కువగా తినకూడదు. ఎందుకంటే
వీటిల్లో కాలరీలు అధికంగా ఉంటాయి. ఎక్స్ ట్రావర్జిన్ ఆయిల్ తో వంటకాలు చేసుకుంటే బరువు పెరగరు. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ ను ఇది తగ్గిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ ను శరీరంలో పెంచుతుంది. వెయిట్ లాస్ కు ఇది మంచిది. అలాగే ఈ ఆయిల్ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. వంట వండుకోవడానికిగాని, సీజనింగ్ చేయడానికి గానీ ఈ ఆయిల్ ను ఉపయోగించవచ్చు. చిరుధాన్యాలు తింటే మంచిది. మిల్లెట్స్, క్వినో, బ్రౌన్ రైస్ వంటివి కూడా వెయిట్ లాస్ కు సహాయపడతాయి. వీటిల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ బాగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆకలి కూడా తొందరగా వేయదు. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. మలబద్ధకం బారిన పడకుండా నిరోధిస్తుంది. వీటివల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తొందరగా కరుగుతుంది. ప్రొటీన్ పౌడర్స్ కూడా మంచిది. వీటివల్ల కండరాలు బలంగా ఉంటాయి. జీవక్రియ పెరుగుతుంది. చియాగింజలను స్మూదీలు, సలాడ్లు, బ్రేక్ ఫాస్ట్ బౌల్స్ లో వాడడం కనిపిస్తోంది. వీటిల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్లు
అధికం. రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ లో పది గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. చియా సీడ్స్ గ్లూటన్ ఫ్రీ కూడా. పైగా వీటిని తింటే కడుపు బాగా నిండినట్టు ఉంటుంది. వీటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా బాగా ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ కూడా. వీటిల్లో యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
పొత్తికడుపు దగ్గర కొవ్వు పేరుకుపోవడం అన్నది శరీరంలో విటమిన్ డి లోపాన్ని తెలియజేస్తుందని కొందరు పోషకాహార నిపుణులు అంటున్నరు. అందుకే విటమిన్ డి సమ్రుద్ధిగా ఉండే పుట్టగొడుగులు ఇందుకు మంచి ప్రత్యామ్నాయం అని పోషకాహారనిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో కాలరీలు తక్కువ. పోషకాలు, నీటి శాతం పుట్టగొడుగుల్లో సమ్రుద్ధిగా ఉంటాయి. ఇవి బాగా రుచిగా కూడా ఉంటాయి. పుట్టగొడుగులతో సూప్ ను సులువుగా చేసుకోవచ్చు. వీటిని సలాడ్లల్లో, శాండ్ విచ్ లలో కూడా వేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల కాలరీలు పెరగవు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ వల్ల శరీరంలో గుడ్ కొలస్ట్రాల్ పెరుగుతుంది. వంటకు ఎడిబిల్ గ్రేడ్ కోకోనట్ ఆయిల్ వాడాలి.
బుల్లెట్ కాఫీని ఉదయం తాగితే మంచిది. ఇది మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. భోజనానికి ముందు సూప్ తాగితే అందే కాలరీలు పరిమితంగానే ఉంటాయని పోషకాహారనిపుణులు చెప్తున్నారు. ఇది పొత్తికడుపు చుట్టూ ఫ్యాట్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అందుకే వెజిటబుల్స్, చికెన్ లేదా మష్రూమ్ సూప్స్ ఇంట్లో తయారుచేసుకుని తాగితే మరీ మంచిదంటున్నారు నిపుణులు. అప్పుడే సూప్ ఫ్రయోజనాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయంటున్నారు. గుడ్లు కూడా బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కారణం వీటిల్లో అధికంగా ప్రొటీన్లు ఉంటాయి. అంతేకాదు నీరు, ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్లు కూడా వీటిల్లో ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించడమే కాదు కండలు పెరిగేలా చేస్తాయి. బ్రోకోలీ మనల్ని లావు కాకుండా, కాన్సర్ బారిన పడకుండా రక్షిస్తాయిట. అంతేకాదు దీనివల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని పోషకాహారనిపుణులు అంటున్నారు. బ్రొకోలీని తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. బ్రోకోలీలోని ఫైటోన్యూట్రియంట్స్ శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను బయటకు పంపేస్తాయి. అతేకాదు వాపు తగ్గిస్తాయి. పైగా కాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. మొత్తం శరీరారోగ్యాన్ని సైతం ఎంతగానో మెరుగుపరుస్తాయి. అందుకే కడిగిన లేదా గ్రిల్డ్ బ్రొకోలీని సలాడ్స్, సూప్స్ ద్వారా తింటే బరువు తగ్గుతారని పోషకాహారనిపుణులు చెప్తున్నారు.
వాల్ నట్స్, పిస్తా, పైన్ నట్స్ వంటివి బరువు తగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్లు, ప్రొటీన్లు బాగా ఉన్నాయి. అవి తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. జంక్ ఫుడ్ తినాలనే ఆలోచన రాదు. నిత్యం నట్స్ ను తినడం వల్ల భారీకాయం బారిన పడకకుండా ఇవి నిరోధిస్తాయి. పెరుగులో గుడ్ బాక్టీరియా పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియ బాగా జరిగేలా సహకరిస్తుంది. ప్రొబయొటిక్స్ వాడే స్త్రీలు నట్స్ తినని వారి కంటే లావు తగ్గడం గమనించారు. డైట్ లో పెరుగును వాడొచ్చు. స్మూదీల్లోను, సలాడ్ డ్రెస్సింగ్ లలో కూడా దీన్ని బాగా వాడొచ్చు.
పొత్తికడుపు దగ్గర కొవ్వుకు కారణాలు ఇవే..
పొట్ట చుట్టూ కొవ్వు చేరుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. శరీరంలో ఫ్యాట్ పంపిణీ చేయడంలో హార్మోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. హార్మోనల్ అసమతౌల్యత కారణంగా ఆకలి బాగా పెరగడం, జీర్ణశక్తి తగ్గడం, ఒత్తిడి ప్రమాణాలు బాగా పెరగడం, పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం వంశపారంపర్యంగా ఉంటే ఆ రిస్కు బారిన ఆ కుటుంబ సంబంధీకులు పడతారు. వీరిలో పొత్తికడుపుచుట్టూ ఫ్యాట్ బాగా పేరుకుపోయి ఉంటుంది. ఒత్తిడి వల్ల కూడా పొత్తికడుపు చుట్టూ ఫ్యాట్ చేరుతుంది. ఆహారం ఎక్కువ తినడం వల్ల, కోర్టిసోల్ ప్రమాణాలు పెరగడం వల్ల కూడా పొత్తి కడుపు దగ్గర కొవ్వు పేరుకుని ఉంటుంది. నిద్రలేమి వల్ల కూడా శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు బాగా
పెరుగుతాయి. దీంతో శరీర బరువు బాగా పెరుగుతారు. చక్కెర పదార్థాలు, కూల్ డ్రింకులు తాగడం వల్ల కూడా పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. వీటిల్లో అధిక శాతంలో చక్కెర, యాడిటివ్స్ తో పాటు ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫీషియల్ కలర్స్ వినియోగం బాగా ఉండడమే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
ఆల్కహాల్ వల్ల కూడా పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. తాగిన ఆల్కహాల్ శరీరంలో చక్కెరగా విడిపోయి ఫ్యాట్ గా మారుతుంది. ఆల్కహాల్ లోని అధిక షుగర్ ఇన్ఫ్లమేషన్ కు, ఇన్ఫ్లమేషన్ తో కూడిన పొత్తికడుపు ఒబెసిటికి కారణమవుతుంది. శరీరంలోని ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కూడా పొత్తికడుపు దగ్గర ఫ్యాట్స్ చేరతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలస్ట్రాల్. వీటివల్ల మెటబాలిజం కూడా బాగా తగ్గిపోతుంది. వ్యాయామాలు, వాకింగ్ వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా పొత్తికడుపు చుట్టూ ఫ్యాట్లు బాగా చేరతాయి. ఇలాంటి జీవనశైలి వల్ల ఊబకాయలు అవుతారు. డెస్క్ జాబ్స్, సిట్ కమ్స్, బద్ధకం వంటివి ఊబకాయం బారిన పడేట్టు చేస్తాయి. ఊబకాయం సంబంధిత జబ్బుల బారిన సైతం పడతాం.
తగినంత పోషకాహారం తీసుకోకపోయినా కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. దీనివల్ల పొత్తికడుపు దగ్గర చేరిన కొవ్వుకరగడం కూడా అంత సులభంగా సాధ్యం కాదు.ప్రొటీన్లు శరీరానికి అందకపోవడం వల్ల ఒత్తిడి, వాపుల బారిన పడతారు. శరీరంలో టాక్సిసిటీ బాగా పెరుగుతుంది. మెటబాలిజం బాగా పడిపోతుంది. మెనోపాజ్ లోకి ప్రవేశించిన వాళ్లల్లో కూడా హార్మోనల్ మార్పులు బాగా ఉంటాయి. కోర్టిసాల్ లేదా స్ట్రెస్ హార్మోన్లు అధిక శాతం పెరగడం వల్ల చాలామంది స్త్రీలలో పొత్తికడుపు దగ్గర అధిక పరిమాణంలో కొవ్వు పేరుకుపోవడం ఈ దశలో బాగా చూస్తాం. అలాగే పీచుపదార్థాలు తక్కువగా ఉన్న
ఆహారం తినడం వల్ల కూడా అంటే అన్నం, మైదా, తొక్కతీసిన పళ్లు తినడం వంటి వాటివల్ల కూడా పొత్తికడుపు దగ్గర కొవ్వు బాగా పేరుకుంటుంది. డైటరీ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపునిండినట్టు ఉంటుంది. ఆకలి వేయదు. పెద్దప్రేగులో కదలికలు బాగా జరుగుతాయి. జీర్ణక్రియ బాగా జరగుతుంది. దీంతో పొత్తికడుపు దగ్గర ఎక్కువగా కొవ్వు పేరుకుపోదు. అందుకే పొత్తికడుపు దగ్గర కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసులు, సోడా, ఎనర్జీ డ్రింకులు వంటివాటి జోలికి వెళ్లకూడదంటున్నారు పోషకాహార నిపుణులు.
అలాగే మీరు తీసుకునే ప్రతి మీల్ లేదా స్నాక్ లో పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా ఉండే డైట్ తీసుకోవాలి. పీచుపార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను బాగా తీసుకోవాలి. నిత్యం వ్యాయామాలు చేయడం ద్వారా కూడా పొత్తికడుపు దగ్గర ఫ్యాట్ ను తగ్గించవచ్చు. అందుకే
నిత్యం వ్యాయామాలు చేయాలి. మీల్స్ ప్లానింగ్ అవసరం. తక్కువ పరిమాణంలో రోజులో ఎక్కువ సార్లు ఆహారం తినడం వల్ల ఒంటికి బాగా వంటబడుతుందని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారన్నవి కూడా చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు అంటున్నారు.