Black Raisins Benefits:ఎండుద్రాక్షలు మనకు బాగా పరిచయమైన డ్రైఫ్రూట్స్‌లో ఒకటి. ఇవి తియ్యగా ఉండటమే కాకుండా శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. చాలామంది వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఈ విధంగా తినడం వలన మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కానీ మార్కెట్‌లో దొరికే ఎండుద్రాక్షలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. నల్ల ఎండుద్రాక్షలు, పసుపు రంగు ఎండుద్రాక్షలు. ఈ రెండు రకాలలో ఏవి ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయో అనేది చాలామందికి తెలియదు. ఆ తేడా, వాటి పోషకాలు, ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల ఎండుద్రాక్షలు..
నల్ల ఎండుద్రాక్షలు సహజ రీతిలో ఎండబెట్టబడతాయి. వీటిలో ఎలాంటి ప్రిజర్వేటివ్ పదార్థాలు ఉపయోగించరు. అందుకే వీటిలో సహజమైన పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రిస్తాయి. ఫలితంగా గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అదేవిధంగా, నల్ల ఎండుద్రాక్షలో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడుతున్నవారికి ఇవి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. రెగ్యులర్‌గా తింటే హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది, శరీర బలహీనత తగ్గుతుంది.
పసుపు రంగు ఎండుద్రాక్షలు…
పసుపు రంగు ఎండుద్రాక్షలు సాధారణంగా ఆకుపచ్చ ద్రాక్షలను సల్ఫర్ డయాక్సైడ్ ఉపయోగించి ఎండబెడతారు. దీని వలన వీటి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది, రుచి కూడా మృదువుగా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయిలు కొంత తగ్గుతాయి. సల్ఫర్ సంయోగాలకు సెన్సిటివ్‌గా ఉండే వారు పసుపు ఎండుద్రాక్షలను ఎక్కువగా తినడం మంచిది కాదు. కానీ ఇవి వంటల్లో, బేకింగ్‌లో, మఫిన్స్ లేదా స్వీట్స్ తయారీలో చక్కని ఫ్లేవర్ కోసం ఉపయోగించవచ్చు.
పోషకాహార నిపుణులు ప్రకారం, ఆకుపచ్చ ద్రాక్షలతో తయారైన పసుపు ఎండుద్రాక్షలు థైరాయిడ్ ఉన్నవారికి మంచి ఫలితాలు ఇస్తాయి. రాత్రి ఈ ద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే థైరాయిడ్ స్థాయిలు సమతుల్యం అవుతాయని చెబుతున్నారు. అయితే, మోతాదును అధిగమించకుండా కొద్దిగా మాత్రమే తినాలి. రోజుకు ఆరు నుంచి ఎనిమిది ఎండుద్రాక్షలు సరిపోతాయి.
రక్తహీనతను..
నల్ల ఎండుద్రాక్షలు రక్తహీనతను తగ్గించడమే కాకుండా చర్మానికి కూడా చక్కని ప్రభావాన్ని చూపుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలో ముడతలను తగ్గిస్తాయి, ప్రకాశాన్ని పెంచుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే నల్ల ఎండుద్రాక్షలను సహజమైన యాంటీ ఏజింగ్ ఫుడ్‌గా కూడా భావిస్తారు.
బరువు తగ్గడానికి…
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి కూడా ఎండుద్రాక్షలు సహాయపడతాయి. వీటిలోని ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల కడుపు ఎక్కువసేపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీని వలన అనవసరమైన ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది. ముఖ్యంగా నల్ల ఎండుద్రాక్షలు షుగర్ క్రేవింగ్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఫలితంగా బరువు తగ్గడంలో వీటి పాత్ర ఉంటుంది. అయితే, వీటిలో నేచురల్ షుగర్ ఎక్కువగా ఉండటం వలన మితంగా తినడం చాలా ముఖ్యం. రోజుకు కొద్దిపాటి పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
పొటాషియం, విటమిన్ బీ6…
పసుపు ఎండుద్రాక్షలు కూడా కొన్ని ప్రత్యేకమైన లాభాలు కలిగి ఉంటాయి. వీటిలో పొటాషియం, విటమిన్ బీ6 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థకు బలం చేకూరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కానీ సల్ఫర్ డయాక్సైడ్ వల్ల కొంతమందికి అలెర్జీ సమస్యలు రావచ్చు. అందువల్ల సున్నితమైన చర్మం లేదా శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు నల్ల ఎండుద్రాక్షలను ఎంచుకోవడం మంచిది.
మొత్తంగా చూస్తే రెండు రకాల ఎండుద్రాక్షలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. కానీ వాటి ఎండబెట్టే విధానం, ఉపయోగించే రసాయనాలు, పోషక విలువలు కొంత మారుతాయి. సహజంగా ఎండిన నల్ల ఎండుద్రాక్షల్లో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉండటం వలన అవి ఆరోగ్యానికి కొంచెం ఎక్కువ ఉపయోగకరమని చెప్పవచ్చు. మరోవైపు, పసుపు ఎండుద్రాక్షలు రుచికి, వంటకాల్లో ఉపయోగానికి బాగుంటాయి.


