Sunday, November 16, 2025
Homeహెల్త్Boiled vs Raw Egg: గుడ్డు పచ్చిగా తింటే 'బలమా'? ఉడికిస్తే 'సులభమా'? నిపుణుల మాట...

Boiled vs Raw Egg: గుడ్డు పచ్చిగా తింటే ‘బలమా’? ఉడికిస్తే ‘సులభమా’? నిపుణుల మాట ఇదే!

Health benefits of boiled vs raw eggs: ప్రోటీన్ల గనిగా, పోషకాల పుట్టగా పేరొందిన గుడ్డు, మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే, ఈ గుడ్డును ఎలా తింటే ఎక్కువ ప్రయోజనం..? కొందరు పచ్చి గుడ్డు తాగితేనే నిజమైన బలమంటే, మరికొందరు ఉడికించి తింటేనే సులభంగా జీర్ణమవుతుందని వాదిస్తారు. అసలు ఈ వాదనల్లో నిజమెంత..? గుడ్డు పచ్చిగా తినడం ఆరోగ్యానికి మంచిదేనా? పిల్లలకు గుడ్డు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ, నిపుణుల అభిప్రాయాలు, శాస్త్రీయ అధ్యయనాల లోతుల్లోకి ఓసారి తొంగిచూద్దాం.

- Advertisement -

గుడ్డు ఏ రూపంలో తీసుకున్నా మంచిదే అయినప్పటికీ, దానిని తినే పద్ధతిని బట్టి ఆరోగ్య ప్రయోజనాలు, భద్రత ఆధారపడి ఉంటాయి.

పచ్చి గుడ్డు – లాభమా? నష్టమా?

అపోహ: పచ్చి గుడ్డు తాగితే ఎక్కువ బలం వస్తుందని, ముఖ్యంగా కండరాల పటుత్వానికి మంచిదని చాలామంది నమ్ముతారు.

నిజం: ఈ నమ్మకంలో పూర్తి నిజం లేదు. పచ్చి గుడ్లలో ‘సాల్మోనెల్లా’ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసి, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, జ్వరానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టిన్ అధ్యయనం ప్రకారం, ఈ ప్రమాదం కారణంగానే వైద్యులు పాశ్చరైజ్ చేసిన లేదా ఉడికించిన గుడ్లను తినమని సిఫార్సు చేస్తారు.

పోషకాల లభ్యత: పచ్చి గుడ్డుతో పోలిస్తే, ఉడికించిన గుడ్డులోని ప్రోటీన్‌ను మన శరీరం దాదాపు రెట్టింపు వేగంగా, తేలికగా గ్రహిస్తుంది. పచ్చి గుడ్డులోని కొన్ని ఎంజైమ్‌లు ప్రోటీన్ జీర్ణక్రియను అడ్డుకుంటాయి.

ఉడికించిన గుడ్డు – ఉత్తమ మార్గం: గుడ్డును ఉడికించడం వల్ల అందులోని ‘సాల్మోనెల్లా’ వంటి హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. అంతేకాకుండా, ప్రోటీన్లు మన శరీరానికి తేలికగా అందుబాటులోకి వస్తాయి. ఉదయం పూట ఉడికించిన గుడ్డు తినడం వల్ల రోజంతా అలసట లేకుండా చురుకుగా ఉంటారు.

పిల్లల విషయంలో జాగ్రత్త :
అలర్జీలు: సుమారు 2 శాతం మంది పిల్లల్లో గుడ్డు అలర్జీ కనిపించవచ్చని మేయో క్లినిక్ (Mayoclinic) అధ్యయనం చెబుతోంది. చర్మంపై దద్దుర్లు, ముక్కు దిబ్బడ, వాంతులు, ఆస్తమా వంటి లక్షణాలు కనిపిస్తే, అది అలర్జీకి సంకేతం కావచ్చు.

ఎప్పుడు మొదలుపెట్టాలి : పిల్లల్లో రోగనిరోధక శక్తి కాస్త పరిపక్వం చెందిన తర్వాత, అంటే దాదాపు ఏడాది వయసులో గుడ్డును ఆహారంలో చేర్చడం వల్ల అలర్జీ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మొదట పచ్చసొనతో ప్రారంభించి, ఆ తర్వాత తెల్లసొనను అలవాటు చేయడం మంచిది.

ఎలా తింటే మేలు : గుడ్డును ఉడికించి తినడమే అత్యంత శ్రేయస్కరం. ఉడికించిన గుడ్డులో కేవలం 70 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అదే రుచి కోసం నూనెతో ఆమ్లెట్ వేసుకుంటే ఆ విలువ 200 క్యాలరీలకు, బ్రెడ్‌తో కలిపితే ఏకంగా 350 క్యాలరీలకు చేరుకుంటుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు ఉడికించిన గుడ్డు తినడమే ఉత్తమం. పోషకాహార నిపుణులు గుడ్డును “ప్రకృతి ప్రసాదించిన మల్టీ విటమిన్ టాబ్లెట్”గా అభివర్ణిస్తున్నారంటే దాని విలువను అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad