Saturday, November 15, 2025
Homeహెల్త్Bp: బీపీ ఉన్నవారికి గుడ్‌ న్యూస్‌...కొత్త మందు రాబోతుందోచ్‌!

Bp: బీపీ ఉన్నవారికి గుడ్‌ న్యూస్‌…కొత్త మందు రాబోతుందోచ్‌!

Bp-New Medicine:ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అధిక రక్తపోటు సమస్యకు కొత్త ఔషధం ఒక శుభవార్త తీసుకొచ్చింది. సాధారణ మందులు పనిచేయని పరిస్థితుల్లో కూడా బాక్స్‌డ్రోస్టాట్ అనే ఔషధం ప్రభావవంతంగా పని చేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులను తగ్గించగలవన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

- Advertisement -

130 కోట్ల మంది హైపర్‌టెన్షన్‌తో…

ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 130 కోట్ల మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. అందులో సగం మంది రోగులకు సరైన చికిత్స అందకపోవడం లేదా మందులు వాడినా ఫలితం లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ఇలాంటి రోగులలో గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, అకాల మరణం వంటి ముప్పులు అధికంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం..

పరిశోధనలో భాగంగా రోగులకు రోజుకు ఒకసారి 1 మిల్లీగ్రామ్ లేదా 2 మిల్లీగ్రాముల బాక్స్‌డ్రోస్టాట్ మాత్ర ఇవ్వబడింది. 12 వారాల తర్వాత ఈ ఔషధాన్ని వాడిన వారిలో రక్తపోటు గణనీయంగా తగ్గింది. ప్లేసిబో మందు వాడిన వారితో పోలిస్తే, బాక్స్‌డ్రోస్టాట్ వాడినవారిలో సిస్టోలిక్ రక్తపోటు సగటున 9 నుంచి 10 mmHg మేర తక్కువగా నమోదైంది. ఈ స్థాయి తగ్గుదల వల్ల గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి సమస్యల ముప్పు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

10 మందిలో నలుగురికి…

ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో 10 మందిలో నలుగురికి రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంది. మరోవైపు ప్లేసిబో వాడిన వారిలో 10 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే కొంత మార్పు గమనించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తేడా బాక్స్‌డ్రోస్టాట్ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ఉప్పు, నీటి సమతుల్యతను..

రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘ఆల్డోస్టెరాన్’ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి కావడమే. ఇది శరీరంలో ఉప్పు, నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది అధికంగా ఉత్పత్తి కావడం వల్ల రక్తపోటు మందులకు కూడా లొంగకుండా మొండిగా మారుతుంది. బాక్స్‌డ్రోస్టాట్ నేరుగా ఈ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా పని చేస్తుంది. దీంతో రక్తపోటు సమస్య మూలానికి చికిత్స లభించినట్టవుతుంది.

ఈ పరిశోధన ఫలితాలను స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరంలో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ 2025లో అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాలు వైద్య రంగంలో పెద్ద చర్చకు దారితీశాయి.

50 కోట్ల మందికి ఈ ఔషధం…

పరిశోధనలో ప్రధాన బాధ్యత వహించిన ప్రొఫెసర్ బ్రయాన్ విలియమ్స్ ప్రకారం, బాక్స్‌డ్రోస్టాట్ వాడిన రోగులలో రక్తపోటు దాదాపు 10 mmHg తగ్గిన విషయం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ స్థాయి రక్తపోటు తగ్గితే గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం, కిడ్నీ వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందికి ఈ ఔషధం ఉపయోగపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఈ పరిశోధన వివరాలు వైద్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో కూడా ప్రచురించారు. దీని ద్వారా బాక్స్‌డ్రోస్టాట్ పై మరింత శాస్త్రీయ ఆధారాలు లభించాయి.

Also Read: https://teluguprabha.net/health-fitness/nutmeg-health-benefits-and-natural-medicinal-properties-explained/

అధిక రక్తపోటు సమస్యను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. ప్రస్తుతం ఉన్న చికిత్సలతో ఫలితం రాని రోగులకు ఈ కొత్త మందు ఒక ఆశగా మారే అవకాశం ఉంది. అయితే దీని వాణిజ్య వినియోగానికి ముందు మరిన్ని పరిశీలనలు, ఆమోద ప్రక్రియలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad