Breast Cancer Prevention Tips : ‘క్యాన్సర్’ అనే పదం వింటేనే గుండె గుభిల్లుమంటుంది. అందునా ప్రపంచవ్యాప్తంగా మహిళలను అత్యధికంగా వేధిస్తున్న మహమ్మారి ‘రొమ్ము క్యాన్సర్’. ఈ వ్యాధి మహిళలకే కాక అరుదుగా పురుషులకూ సోకుతుండటం ఆందోళనకరం. అయితే జన్యువులు, కుటుంబ చరిత్ర మన చేతుల్లో లేకపోయినా.. మన రోజువారీ అలవాట్లను మార్చుకుంటే ఈ మహమ్మారి ముప్పును దాదాపు 30 శాతం వరకు సమర్థంగా తిప్పికొట్టవచ్చని ‘బ్రెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్’ (BCRF) స్పష్టం చేస్తోంది. అక్టోబర్ ‘రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం’ సందర్భంగా ప్రాణాలను కాపాడే ఆ జీవనశైలి మంత్రాలేమిటో పరిశీలిద్దాం!
బరువుపై నిఘా: మెనోపాజ్ దాటిన మహిళల్లో కొవ్వు కణజాలం ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసి క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. 50 ఏళ్లు దాటిన మహిళలు కనీసం 4 నుంచి 5 కిలోల బరువు తగ్గినా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 25-30% వరకు తగ్గుతుంది.
ఆకుకూరలు, పండ్లతో రక్షణ: బేకరీ ఉత్పత్తులు, రెడ్ మీట్‌ను పక్కనపెట్టి బ్రోకలీ, క్యాబేజీ, పాలకూర లాంటి ఆకుకూరలు, ఫైబర్ అధికంగా ఉండే ముడి ధాన్యాలు తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
వ్యసనాలకు స్వస్తి: ఆల్కహాల్ కణాల డీఎన్‌ఏ (DNA)ను దెబ్బతీసే ప్రమాదకర కార్సినోజెన్. ధూమపానం సైతం రొమ్ము కణజాలంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వీటిని తక్షణమే మానివేయడం శ్రేయస్కరం.
శరీరానికి కదలిక – కంటినిండా నిద్ర: రోజుకు కనీసం 30 నిమిషాల వేగవంతమైన నడక లేదా వ్యాయామం హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. క్రమం తప్పని నిద్ర శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
తల్లిపాలు అమృతం: శిశువుకు పాలివ్వడం వల్ల మహిళ జీవితకాల ఈస్ట్రోజెన్ ఎక్స్‌పోజర్ తగ్గి క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
కుటుంబంలో ‘BRCA1, BRCA2’ జన్యు మార్పుల చరిత్ర ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోవాలి. ‘నివారణే చికిత్స కంటే మిన్న’ అనే నానుడిని గుర్తుంచుకుని, ఆరోగ్యకరమైన అలవాట్లను జీవన విధానంగా మార్చుకుంటే రొమ్ము క్యాన్సర్‌ను ఆదిలోనే కట్టడి చేయవచ్చు.

