Health problems resolved by shankha mudraకొంతమంది దగ్గు, ఉబ్బసం, తదితర శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా వైద్యులు సిఫారసు చేసిన మందులు వాడినా కొందరిలో ఉపశమనం కలగదు. అలాంటి వారి శ్వాస వ్యవస్థను మెరుగుపరిచేందుకు అద్భుతమైన మార్గం ఉంది. దీని ద్వారా రోజుకు 10 నిమిషాలు కేటాయించి సరైన ఫలితం పొందవచ్చు. యోగ విద్యలో చెప్పిన శంఖ ముద్ర ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరచి, సమస్యను దూరం చేస్తుంది. చేతులు, వేళ్లు, శరీర ప్రత్యేక ఆకృతులు, స్థానాలను సూచించేదే యోగ విద్యలోని ముద్ర. అలాంటి ముద్రలో శంఖ ముద్ర ఒకటి. శంఖం ధ్వనిని ఎంత పవిత్రంగా భావిస్తారో, ఈ ముద్ర కూడా శరీరంలో శబ్ధతత్వాన్ని శుద్ధి చేస్తుంది.
శంఖ ముద్ర వేసే విధానం: వెన్నెముక నిటారుగా ఉంచి, పద్మాసనం, సుఖాసనం లేదా మీకు సౌకర్యంగా ఉండేలా ధ్యానం ఆసనంలో నిటారుగా కూర్చోవాలి. రెండు చేతులనూ ఛాతీ ముందుకు లేదా నాభికి దగ్గరగా తీసుకురావాలి. కుడిచేతి నాలుగు వేళ్లతో ఎడమచేతి బొటనవేలిని మూసేయాలి. కుడిచేతి బొటనవేలును తీసుకుని ఎడమచేతి మధ్య వేలి కొన భాగానికి ఆనించాలి. ముద్రను శరీరానికి తాకకుండా ఛాతీ ముందు లేదా కంఠం వద్ద ఉంచాలి. కళ్లు మూసుకుని, ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ, కంఠంలో ఉండే థైరాయిడ్ గ్రంథిపై “ఓం” కంఠ ధ్వనిపై ధ్యాస ఉంచాలి.
ప్రయోజనాలు: శంఖ ముద్ర ప్రధానంగా శ్వాస వ్యవస్థపై పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఇది అలర్జీలు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. స్వర పేటిక శుద్ధి అయి గొంతు బొంగురు పోవటం తగ్గుతుంది.


