Burnout syndrome in IT employees : లక్షల్లో జీతాలు.. విలాసవంతమైన జీవితం! ఐటీ ఉద్యోగుల గురించి బయటకు కనిపించే చిత్రం ఇది. కానీ, ఆ ఏసీ గదుల్లో, కంప్యూటర్ స్క్రీన్ల వెనుక అంతులేని పని ఒత్తిడి, ఆందోళనలతో నలిగిపోతున్న ఎన్నో జీవితాలు ఉన్నాయి. ఈ తీవ్రమైన ఒత్తిడి, వారిని ‘బర్నవుట్ సిండ్రోమ్’ అనే నిశ్శబ్ద మహమ్మారి బారిన పడేస్తోంది. ప్రతి 10 మంది ఐటీ ఉద్యోగుల్లో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసలు ఏమిటీ బర్నవుట్ సిండ్రోమ్..? దీని లక్షణాలేంటి..? ఈ ఊబి నుంచి బయటపడటం ఎలా..?
ఏమిటీ ‘బర్నవుట్ సిండ్రోమ్’ : ఇది కేవలం అలసట కాదు, అంతకు మించిన తీవ్రమైన మానసిక, శారీరక నిస్సత్తువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సుదీర్ఘకాలం పాటు తీవ్రమైన పని ఒత్తిడికి గురవడం వల్ల కలిగే సిండ్రోమ్ ఇది. దీనివల్ల శారీరకంగా, మానసికంగా పూర్తిగా శక్తిహీనులవుతారు.
ఈ లక్షణాలు మీలో ఉన్నాయా : కింది లక్షణాలు మీలో కనిపిస్తే, మీరు బర్నవుట్ బారిన పడినట్లే. వెంటనే అప్రమత్తం కావాలి.
శారీరకంగా: నిరంతర నీరసం, తీవ్రమైన తలనొప్పులు, నిద్రలేమి, శారీరకంగా బలహీనంగా అనిపించడం.
మానసికంగా: చేసే పనిపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, చిన్న విషయాలకే చిరాకు, కోపం, నిరుత్సాహం, నిరంతరం ఆందోళన.
సామాజికంగా: బంధువులు, స్నేహితులకు దూరంగా, ఒంటరిగా గడపాలని కోరుకోవడం.
కారణాల వలయంలో.. ఈ సిండ్రోమ్‌కు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. అధిక పని గంటలు, పని-వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యం లేకపోవడం. ఉద్యోగ భద్రతపై ఆందోళన, టార్గెట్ల ఒత్తిడి. నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఒత్తిడి. అధిక జీవన వ్యయం వల్ల కలిగే ఆర్థిక అనిశ్చితి.
బయటపడటం ఎలా నిపుణుల సూచనలు : ఈ ఊబి నుంచి బయటపడటానికి జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలని నిపుణులు సూచిస్తున్నారు.
“ఉద్యోగంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం, సిగరెట్లను ఆశ్రయిస్తే, అవి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండి, ఆకుకూరలు, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, డి ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజూ 5-6 లీటర్ల నీరు తాగాలి.”
– ప్రొఫెసర్ డా.విశాల్ ఆకుల, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ
వ్యాయామం, యోగా: రోజూ కనీసం అరగంట వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి.
సరైన నిద్ర: రోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవడాన్ని అలవాటు చేసుకోవాలి.
విరామం : ఏకధాటిగా పనిచేయకుండా, మధ్యమధ్యలో చిన్న విరామాలు తీసుకుని, నడవడం మంచిది.
కుటుంబంతో సమయం: సెలవు రోజుల్లో ఫోన్‌ను పక్కనపెట్టి, కుటుంబ సభ్యులతో, స్నేహిలతో ఆనందంగా గడపాలి.
దేశంలోని 43% కార్పొరేట్ సంస్థలు, తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం ‘వెల్‌నెస్ సెంటర్లు’ ఏర్పాటు చేస్తున్నాయంటే, ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డబ్బు సంపాదన ముఖ్యమే, కానీ దాని కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


