Sunday, July 7, 2024
Homeహెల్త్Hair Care: చలికాలంలో శిరోజాల సంరక్షణ ఇలా..!

Hair Care: చలికాలంలో శిరోజాల సంరక్షణ ఇలా..!

- Advertisement -

Hair Care: చలికాలంలో చర్మ సమస్యలను బాగా ఎదుర్కొంటుంటాం. ముఖ్యంగా చర్మానికి మాయిశ్చరైజర్లు రాసుకోవడం, చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల చర్మం సున్నితంగా , కాంతివంతంగా తయారవుతుంది. అలాగే చలికాలంలో మనం ఎదుర్కొనే మరో సమస్య శిరోజాల సంరక్షణ. చలికాలంలో వెంట్రుకల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్ లో చల్లనీళ్లతో తలస్నానం చేస్తే మంచిదా కాదా… వెంట్రుకల సంరక్షణకు వేడి నీళ్లతో స్నానం చేయాలా లాంటి ఎన్నో సందేహాలు చాలామందిని వేధిస్తుంటాయి. చలికాలంలో జుట్టు బాగా చిట్లి పోతుంటుంది. వెంట్రుకలు మ్రుదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా ఉంటాయి. అవి చిట్లిపోవడమే కాకుండా చుండ్రు సమస్య కూడా చలికాలంలో వేధిస్తుంది. చలిని తట్టుకోవడానికి ఈ సీజన్ లో చాలామంది వేడినీళ్ల స్నానం చేస్తుంటారు. తలరుద్దుకునేటప్పుడు కూడా వేడి నీళ్లను ఉపయోగిస్తారు. తరచూ వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల తలలో చుండ్రు సమస్య తలెత్తుతుంది. మాడు పొడారిపోతుంది. మాడుపై తరచూ దురద వస్తుంటుంది. వేడి నీళ్లు వెంట్రుకల్లో ఉండే హైడ్రోజన్ పై ప్రభావం చూపుతుంది. దీంతో మాడు పొడారినట్టయిపోతుంది. అంతేకాదు జుట్టు కుదుళ్లు కూడా బాగా బలహీనపడతాయి. వెంట్రుకలు రేగినట్టు, బిరుసుగా అయి జడ వేసుకోవడం సైతం కష్టమవుతుంది. అందుకే చలికాలంలో చాలామంది హెయిర్ టెక్స్చెర్ దెబ్బతింటుంది.

వెంట్రుకలను వేడినీళ్లతో శుభ్రం చేసుకోవడం వల్ల వెంట్రుకలు చిట్లిపోవడం, చుండ్రు వంటి వాటితో పాటు మాడులో ఉండే సహజసిద్ధమైన ఆయిల్ గుణాలు ఆవిరయిపోతాయి. వెంట్రుకల్లో సూక్ష్మమైన రంధ్రాలు ఏర్పడతాయి. బాగా చల్లగా ఉండే నీరు కూడా శిరోజాల సంరక్షణను దెబ్బతీస్తుంది. సాధారణంగా చల్లటి నీళ్లు జుట్టులోని నేచురల్ ఆయిల్స్ ను పరిరక్షిస్తుంది. వెంట్రుకలను సులభంగా పాయలుగా తీసికొని జడవేసుకోవచ్చు. శిరోజాలు ఎంతో కాంతివంతంగా కూడా ఉంటాయి. జుట్టులోని తేమను చల్లటి నీళ్లు పరిరక్షిస్తాయి. మాడు మ్రుదువుగా ఉండడంతో పాటు మెరుస్తుంటుంది. చల్లటి నీటి వల్ల వెంట్రుకల మొదళ్లు సురక్షితంగా ఉంటాయి. దీంతో వెంట్రుకల టెక్స్చ్ ర్ నున్నగా, కాంతివంతంగా ఉంటుంది. కానీ చలికాలంలో వెంట్రుకలకు చల్లటి నీటిని వాడడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ తేమ వల్ల జుట్టు ఒత్తుకుపోయి పలచగా కనిపిస్తుంది. వెంట్రుకల్లో ఎలాంటి మెరుపు లేకుండా ఉంటాయి.

మరి పరిష్కారం ఏమిటి?
సింపుల్ డిస్టిల్డ్ వాటర్ తో మొదట జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి. క్షార జలాల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అవి మాడుపై చేరే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇవి జుట్టుకు హానికలిగిస్తాయి. వారానికి రెండు లేదా మూడుసార్లు జుట్టును నీటితో శుభ్రం చేసుకోవాలి. తలకు షాంపు ఎప్పుడు పెట్టుకోవాలి అనే సందేహం కూడా చాలామందిలో తలెత్తుతుంది. జుట్టు జిడ్డుగా, మట్టి చేరినట్టు అనిపించినప్పుడు షాంపుతో వెంట్రుకలను శుభ్రంచేసుకోవాలి. ఇందుకు తేలికపాటి షాంపును ఉపయోగిస్తే మంచిది. వేగాన్ లేదా ఆర్గానిక్ షాంపు వాడితే మంచిది. కండిషనర్ కూడా తేలికపాటిది ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి షాంపు శిరోజాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా వెంట్రుకల్లో తేమను పరిరక్షిస్తాయి. శీతాకాలంలో తలెత్తే పలు సమస్యల నుంచి శిరోజాలను సంరక్షిస్తాయి. క్షారజలాల్లోని కాల్షియం, మెగ్నీషియం ఖనిజాలు నీటిలోని పిహెచ్ ప్రమాణాలను పెంచుతాయి. జుట్టులోని పిహెచ్ ప్రమాణం కన్నా నీటిలోని పిహెచ్ ప్రమాణాలు ఎక్కువవుతాయి. ఫలితంగా జుట్టులోని పిహెచ్ ప్రమాణాల్లో తేడా రావడం వల్ల శిరోజాలు కాంతివిహీనంగా ఉంటాయి. వెంట్రుకలు చిక్కుపడుతుండడమే కాకుండా జట్టు బిరుసెక్కినట్టు, పొడారిపోయినట్టు ఉంటుంది.

ఎక్కువ ఖనిజాల కారణంగా మాడు ఎండినట్టు అవుతుంది. దీంతో ఆ భాగంలో చర్మం చిన్న చిన్న పెళుసులుగా వస్తుంది. తలరుద్దుకునేటప్పుడు మురికి పదార్థాలు అన్నీ పూర్తిగా బయటకు రాకుండా వెంట్రుకల్లో మిగిలిపోయే అవకాశం ఉంది. అవి పెద్ద మొత్తంలో మాడుపై చేరతాయి. దీంతో మాడు, వెంట్రుకలు సుదీర్ఘకాలం పాటు దెబ్బతింటాయి. అందుకే తలస్నానం చేయడానికి ముందు లేదా తర్వాత వెంట్రుకల్లో, మాడు భాగంలో మాయిశ్చరైజర్ ఉండేలా జాగ్రత్తపడాలి. జుట్టును ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే సందేహం కూడా చాలామందికి వస్తుంటుంది. వెంట్రుకలు బాగా జిడ్డుగా ఉన్నప్పుడు , తలలో దురద వస్తున్నప్పుడు వెంట్రుకలను వాష్ చేసుకోవాలి. వెజిటబుల్ ఆయిల్స్, సిలికాన్, సింథటిక్ ఫ్రాగ్రెన్స్ ఉన్న కండిషనర్లు మంచివి. వీగాన్, ఆర్గానిక్ షాంపులతో పాటు సల్ఫేట్స్, డైస్, పెరాబియన్స్ లేని, పండ్లు, పలురకాల మొక్కల వేళ్ల నుంచి తీసిన పదార్థాలు ఉన్న షాంపులను వాడితే మంచిది. అలాంటి, షాంపు, కండిషనర్ల మిశ్రమాన్ని జుట్టుకు పెడితే వెంట్రుకలు శుభ్రంగా ఉంటాయి. తేమను కోల్పోవు. కుదుళ్ల నుంచీ వెంట్రుకలకు మంచి పోషకాలు అందుతాయి. ఈ సీజన్ లో జుట్టుకు పట్టించే డైస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చెట్ల నుంచి తయారుచేసిన రంగులను వాడాలి. మొక్కల నుంచి తయారు చేసిన నూనెలు కూడా మంచివి. ఇలాంటి నేచురల్ డైస్ ను జుట్టుకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు దెబ్బతినవు. జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ ఇవి పరిరక్షిస్తాయి. డైస్ లో అమోనియా, భారీ ఖనిజాలు, పిపిడి, ఆక్సిజనేటెడ్ వాటర్ వంటివి లేకుండా చూసుకోవాలి. అలాగే షాంపుతో తలంటు పోసుకునేటప్పుడు బాగా వేడిగా ఉండే నీళ్లను లేదా చల్లటి నీళ్లను ఉపయోగించవద్దు. గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే జుట్టుకు పట్టి ఉన్న జిడ్డుతో పాటు, మురికి కూడా పోతుంది. మాడు శుభ్రంగా ఉంటుంది. తలకు పట్టించిన షాంపును, కండిషనర్ని చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకల్లోని తేమ పోదు. తలంటు పోసుకున్న తర్వాత వెంట్రుకలను ఆరబెట్టుకోవడానికి డ్రై గాడ్జెట్టులు ఉపయోగించకుండా తువ్వాలును జుట్టుకు చుట్టపెట్టుకోవాలి. ఇలా చేస్తే తలకు పట్టిన ఎక్కువ నీటిని టవల్ పీల్చేసుకుని జట్టును పొడిగా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల శిరోజాలు మెరుస్తుంటాయి. జుట్టు సంరక్షణకు ఉపయోగపడే మరో విషయం కూడా చెప్పాలి. వారానికి లేదా పదిహేను రోజులకు ఒకసారి హెన్నా మాస్కును తలకు పట్టించుకుంటే మంచిది. హెర్బల్స్ కలిపి హెన్నా మాస్కును పెట్టకుంటే అది జుట్టుకు కావలసినన్ని పోషకాలను అందిస్తుంది. మార్కెట్లో ముందుగానే హెన్నా కలిపిన క్రీములు
దొరుకుతున్నాయి. వీటిని తలకు రాసుకోవడం కూడా ఎంతో సులువు. వీటిల్లో అమోనియా, దాని ఉప ఉత్పత్తులు ఎథలోనమినా వంటివి ఉండవు. ఈ విషయాలు గమనించుకుని చలికాలంలో శిరోజాలను సంరక్షించుకుంటే అవి నిగ నిగ లాడుతుంటాయి. జుట్టు ఎంతో అందంగా కూడా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News