మన శరీరం మొత్తం పనితీరును నియంత్రించే కేంద్రం మెదడు. ఇది తలలో ఉన్నా, దాని ప్రభావం పాదాల వరకూ ఉంటుంది. మన ఆలోచనలు, కదలికలు, భావోద్వేగాలు అన్నీ మెదడు సంకేతాలతోనే పనిచేస్తాయి. అలాంటి కీలకమైన భాగంలో చిన్నపాటి సమస్య వచ్చిందంటే శరీర వ్యవస్థ అంతా గందరగోళంగా మారుతుంది. ముఖ్యంగా మెదడులో వాపు రావడం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. వైద్య భాషలో దీన్ని సెరిబ్రల్ ఎడెమా అంటారు. ఇది గాయాల కారణంగా, వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల, కొన్నిసార్లు ఇతర మెదడు వ్యాధుల ఫలితంగా కూడా వస్తుంది. దీనిని తొందరగా గుర్తించి, చికిత్స ప్రారంభించకపోతే అది ప్రాణాలకు ముప్పుగా మారుతుంది.
ఈ సమస్యను ముందే గుర్తించాలంటే శరీరం పంపే సంకేతాలను మనం పట్టించుకోవాలి. ఉదాహరణకు కారణం లేకుండానే తలనొప్పి పదేపదే రావడం, ప్రతి రోజు తీవ్రత పెరుగుతూ ఉండటం… ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక. కొన్నిసార్లు వాంతులు, తల తిరగడం, వళ్లు విసరడం వంటి లక్షణాలు కలిపి వస్తే మరింత జాగ్రత్త అవసరం. మరోవైపు చూపులో మార్పులు కూడా కనిపించొచ్చు. బ్లర్‌గా కనిపించడం, కళ్ల ముందు చీకటి పడ్డట్టు అనిపించడం, కదిలినప్పుడు దృష్టి దెబ్బతిన్నట్టు అనిపించడం.. ఇవి మెదడులో వాపు చూపు కేంద్రాలపై ఒత్తిడి చూపుతోందని సూచిస్తాయి.
చేతులు కాళ్లల్లో బలహీనత కలగడం, ఒకవైపు ముఖం తిమ్మిరి కొట్టినట్టు అనిపించడం, నడకలో అస్థిరత అనుభవించడంలాంటి మార్పులు మెదడు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నట్టు సంకేతాలు. ఇవన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే జ్ఞాపకశక్తిలో లోపం, మాటల్లో తడబాటు, అస్పష్టమైన ప్రవర్తన కూడా అలాంటి పరిణామాలే. కొన్నిసార్లు మూర్ఛ వస్తుండటం వంటి తీవ్రమైన లక్షణాలు కూడా కనిపించొచ్చు. దీనితో పాటు మెడను తిప్పలేకపోవడం, నొప్పిగా ఉండటం, గట్టిగా బిగుసుకున్నట్టుగా అనిపించడం కూడా మెదడులో ఏర్పడే వాపు లేదా నాడీ సంబంధిత ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంది.
ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రక్తపోటు నియంత్రణలో ఉన్నవారిలోనూ అకస్మాత్తుగా బిపి పెరగడం వంటి మార్పులు ఈ సమస్యకు సంకేతంగా కనిపిస్తాయి. మెదడు నియంత్రించే నాడీ వ్యవస్థలు వాపుతో ప్రభావితమవుతుండటం వల్లనే ఈ మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ కలిపి చూస్తే, మన శరీరం ముందే హెచ్చరిస్తోంది. మన పని ఆ హెచ్చరికలను పట్టించుకోవడమే.
ఈ పరిస్థితులను నిర్లక్ష్యం చేస్తే… అది ప్రాణాలకు విలువైన సమయాన్ని కోల్పోవడమే అవుతుంది. కాబట్టి శరీరం ఇస్తున్న ప్రతి చిన్న సంకేతాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్యాన్ని చులకనగా తీసుకోవడం వల్ల జరిగే నష్టం మానవ జీవితానికి గుణపాఠం అయిపోతుంది. ముఖ్యంగా మెదడుతో సంబంధం ఉన్న సమస్యల్లో ఒక్క క్షణం ఆలస్యం కూడదు. ఏమాత్రం అనుమానం వచ్చినా, వెంటనే నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. (గమనిక: ఈ కథనంలో ఇవ్వబడిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా కాదు. ఆరోగ్య సంబంధిత ఏవైనా లక్షణాలు కనిపించినపుడు, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.)