Wednesday, December 18, 2024
Homeహెల్త్Cervical cancer: పురుషుల‌కూ స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ టీకా..!

Cervical cancer: పురుషుల‌కూ స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ టీకా..!

గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార క్యాన్స‌ర్ (Cervical cancer) నివార‌ణ‌కు ఎప్ప‌టినుంచో వ్యాక్సిన్ ఉంది. అయితే ఇన్నాళ్లుగా దాన్ని కేవ‌లం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ఇస్తున్నారు. కానీ, అస‌లు ఈ క్యాన్స‌ర్‌ను స‌మ‌ర్థంగా నివారించాలంటే ఈ వ్యాక్సిన్‌ను మ‌హిళ‌ల‌తో పాటు పురుషుల‌కు కూడా ఇవ్వాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. పైగా అది ఇవ్వ‌డం వ‌ల్ల పురుషుల‌కు వేర్వేరు ర‌కాల క్యాన్స‌ర్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంద‌ట‌.

- Advertisement -

గర్భాశయ ముఖ‌ద్వార క్యాన్సర్ అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేస్తోంది. మ‌హిళ‌ల‌కు అత్యంత ఎక్కువ‌గా వ‌చ్చే క్యాన్స‌ర్ ర‌కాల‌లో ఇది ముందువ‌రుస‌లో ఉంటుంది. ఇది ప్రధానంగా కొన్ని రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వల్ల వ‌స్తుంది. సాధార‌ణంగా లైంగిక చ‌ర్య వ‌ల్ల ఈ ఇన్ఫెక్ష‌న్ సంభ‌విస్తుంది. ఈ వ్యాధి వ్యాప్తిలో పురుషులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవగాహన, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చాలా అవ‌స‌రం. పురుషులు, మ‌హిళ‌లు ఇద్ద‌రికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాల్సిన అవ‌స‌రాన్ని గుర్తిస్తే.. ఒక‌ర‌కంగా మొత్తం సమాజంపై దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు.

గర్భాశయ ముఖ‌ద్వార క్యాన్సర్ భారతదేశంలో మహిళల్లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. ఇది ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. గర్భాశయ ముఖ‌ద్వార క్యాన్సర్‌కు ప్రాథ‌మిక కారణం… హెచ్‌పీవీ వైర‌స్ సోక‌డం. అందులోనూ ప్ర‌ధానంగా హెచ్‌పీవీ 16, హెచ్‌పీవీ 18 అనే ర‌కాలు మ‌రింత ప్ర‌మాద‌క‌రం. ఇవి లైంగిక కార్య‌క‌లాపాల ద్వారానే వ‌స్తాయి. వీటివ‌ల్ల గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార ప్రాంతంలో కణాలు అసాధారణంగా పెరుగుతాయి. చికిత్స చేయకపోతే, ఇది గర్భాశయ ముఖ‌ద్వార క్యాన్సర్‌కు దారితీస్తుంది.

గర్భాశయ ముఖ‌ద్వార క్యాన్సర్ ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో అసాధారణ యోని రక్తస్రావం, కటి నొప్పి లేదా లైంగిక సంపర్కం సమయంలో నొప్పి ఉండవచ్చు. ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు పాప్ స్మియ‌ర్ ప‌రీక్ష చేయించుకుంటే.. క్యాన్స‌ర్ రాక ముందు కూడా గుర్తించ‌వ‌చ్చు. క‌ణాలు అసాధార‌ణంగా పెర‌గ‌డం మొద‌లైన త‌ర్వాత కొంత‌కాలానికి క్యాన్స‌ర్ వ‌స్తుంది. ఈలోపే దాన్ని అరిక‌డితే.. క్యాన్స‌ర్ రాక‌ముందే దాన్ని అడ్డుకోవ‌చ్చు. ఒక‌వేళ వ‌చ్చి, ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్నా వెంట‌నే చికిత్స చేయొచ్చు.

గర్భాశయ ముఖ‌ద్వార క్యాన్సర్‌కు దారితీసే హెచ్‌పీవీ నుంచి.. ఇంకా ఇతర రకాల క్యాన్సర్ల నుంచి పురుషులు, మహిళలను రక్షించడానికి అంద‌రికీ టీకాలు ఇవ్వాలి. మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రయోజనాల గురించి అంద‌రికీ తెలుసు. కానీ, పురుషులకూ వ్యాక్సిన్ ముఖ్య‌మ‌న్న‌ది తెలుసుకోవ‌డ‌మే ప్ర‌ధానం. పురుషులు హెచ్‌పీవీ వాహకాలు కావచ్చు. అలాంటివారు మ‌హిళ‌ల‌ను లైంగికంగా క‌లిసిన‌ప్పుడు వారికి గర్భాశయ ముఖ‌ద్వార క్యాన్సర్ రావ‌చ్చు. అందువ‌ల్ల పురుషులు, మ‌హిళ‌లు ఇద్ద‌రికీ వ్యాక్సిన్ వేయడం ద్వారా స‌మాజంలో గర్భాశయ ముఖ‌ద్వార క్యాన్సర్ భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. దాంతోపాటు.. టీకా తీసుకున్న పురుషులకు ఆసన, పురుషాంగం క్యాన్సర్ లాంటివాటి నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఈ టీకాను సాధార‌ణంగా 9 నుంచి 14 ఏళ్ల‌లోపు వ‌యసులో ఇప్పించాలి. ఆ త‌ర్వాత ఇప్పించినా దానివ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయడం, హెచ్‌పీవీ వ్యాక్సిన్ మహిళలకు మాత్రమే కాకుండా… అబ్బాయిలు, పురుషులకూ ఇప్పించ‌డం చాలా కీల‌కం.

నోబెల్ గ్ర‌హీత మాట కూడా అదే..

సర్వైకల్ క్యాన్స‌ర్ నిరోధక వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో మహా ప్రయత్నం జరగాలని నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ హరాల్డ్ జూర్ హాసెన్ పిలుపునిచ్చారు. సర్వైకల్ క్యాన్స‌ర్‌కు హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV) కారణమని గుర్తించినది ఈయ‌నే. హాసెన్ పరిశోధనల ఆసరాగానే వ్యాధి నిరోధక వ్యాక్సిన్ అభివృద్ధి చెందింది. సర్వైకల్ క్యాన్స‌ర్‌తో పాటు కొన్ని ఇతర రకాల క్యాన్స‌ర్‌ల నివారణకు మల్టీవాలెంట్ (వేర్వేరు వైరస్‌ల‌ను ఒకే టీకాతో నియంత్రించేవి) వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. సర్వైకల్ క్యాన్స‌ర్‌ నిరోధక వ్యాక్సిన్‌ను 15-30 ఏళ్ల మధ్య వయసు వారందరికీ.. అంటే మ‌హిళ‌ల‌తో పాటు పురుషుల‌కు కూడా వేస్తే ఫలితాలు బాగుంటాయన్నారు. ఈ వయసు పురుషులకు లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉండటం వల్ల వీరి ద్వారా హెచ్‌పీవీ ఎక్కువమంది మహిళలకు వ్యాపించే అవకాశముండటం దీనికి కారణమని ఆయ‌న వివరించారు. అందువల్ల ఈ వయసు పురుషులకు ఈ వ్యాక్సిన్ ఇస్తే హెచ్‌పీవీ వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News