Natural ways to increase child height : పిల్లలు ఆరోగ్యంగా, ఎత్తుగా ఎదగాలని ప్రతీ తల్లిదండ్రుల ఆశ. కానీ, తోటివారితో పోలిస్తే తమ పిల్లల ఎదుగుదల నెమ్మదిగా ఉందని, పొట్టిగా కనిపిస్తున్నారని చాలామంది ఆందోళన చెందుతుంటారు. దీనికి కేవలం తల్లిదండ్రుల జన్యువులే కారణమనుకుంటే పొరపాటే! సరైన పోషకాహారం, వ్యాయామం లేకపోవడం కూడా పిల్లల ఎత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి మందుల ప్రమేయం లేకుండా, సహజ పద్ధతుల్లో పిల్లల ఎదుగుదలను ప్రోత్సహించే ఆ వ్యాయామాలేంటి..? ఎలాంటి ఆహారం అందించాలి..?
వ్యాయామమే.. తొలి మంత్రం : శారీరక శ్రమ, సరైన వ్యాయామాలు పిల్లల ఎముకలను, కండరాలను బలోపేతం చేసి, ఎదుగుదలకు దోహదం చేస్తాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) పరిశోధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక వ్యాయామాలు గ్రోత్ హార్మోన్లను ప్రేరేపిస్తాయి.
సాగదీయడమే.. తొలి అడుగు! (స్ట్రెచింగ్): వెన్నెముక సాగితేనే ఎత్తు పెరుగుతారు. ఇందుకోసం నిటారుగా నిల్చొని కిందికి వంగి కాలివేళ్లను తాకడం, కాళ్లు చాపి కూర్చొని చేతులతో పాదాలను అందుకోవడం వంటి స్ట్రెచింగ్ వ్యాయామాలు వెన్నెముకకు ఫ్లెక్సిబిలిటీని అందించి, ఎదుగుదలను సులభతరం చేస్తాయి.
వేలాడితే.. వెన్నెముకకు మేలు! (బార్ హ్యాంగింగ్): పులప్స్, చిన్-అప్స్ చేయడం, లేదా కనీసం బార్‌ను పట్టుకుని వేలాడటం వల్ల గురుత్వాకర్షణ ప్రభావంతో వెన్నెముక సాగుతుంది. ఇది ఎత్తు పెరగడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. భుజాలు, వీపు కండరాలు కూడా దృఢంగా మారతాయి.
యోగాతో యోగం : సూర్య నమస్కారాలు, చక్రాసనం వంటి యోగాసనాలు సంపూర్ణ శరీరానికి వ్యాయామాన్ని అందిస్తాయి. సూర్య నమస్కారాలు శరీరంలోని ప్రతీ కండరాన్ని ఉత్తేజపరిస్తే, చక్రాసనం వెన్నెముకకు మంచి బలాన్ని, సాగే గుణాన్ని ఇస్తుంది.
ఆటపాటలతో.. ఎత్తుకు పైఎత్తు! (స్కిప్పింగ్, స్విమ్మింగ్): సరదాగా ఆడే స్కిప్పింగ్ (తాడాట) గుండె ఆరోగ్యానికి మంచిది. ఎగిరే క్రమంలో వెన్నెముక, కాళ్ల కండరాలు ఉత్తేజితమై ఎత్తు పెరిగేందుకు దోహదపడతాయి. అలాగే ఈత కొట్టేటప్పుడు శరీరాన్ని ముందుకు సాగదీయడం వల్ల వెన్నెముకకు చక్కటి వ్యాయామం లభిస్తుంది.
ఆహారం, నిద్ర.. అసలు రహస్యం : వ్యాయామంతో పాటు ఈ రెండు విషయాల్లోనూ శ్రద్ధ వహిస్తేనే సంపూర్ణ ఎదుగుదల సాధ్యమవుతుంది.
నిద్రలోనే పెరుగుదల: మన శరీరంలో పెరుగుదలను ప్రేరేపించే HGH (హ్యూమన్ గ్రోత్ హార్మోన్) పిల్లలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే విడుదలవుతుందని NIH పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి, పిల్లలు రోజూ తగినంత సమయం ప్రశాంతంగా నిద్రపోయేలా చూడటం చాలా ముఖ్యం.
పోషకాల పవర్: ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉన్న ఆహారం పిల్లల ఎదుగుదలకు అత్యవసరం. వారి రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు, గుడ్లు, పాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
విటమిన్-డి కీలకం: ఎముకల పటుత్వానికి, ఎదుగుదలకు విటమిన్-డి చాలా అవసరం. ఇందుకోసం పిల్లలను రోజూ కాసేపు ఉదయం ఎండలో ఆడనివ్వాలి. ఆహారంలో చేపలు, పుట్టగొడుగులు, గుడ్లు చేర్చాలి. చిన్నతనం నుంచే ఈ అలవాట్లను పిల్లల జీవితంలో భాగం చేయడం ద్వారా వారిని ఆరోగ్యంగా, ఎత్తుగా పెరిగేలా ప్రోత్సహించవచ్చు. కొత్తగా వ్యాయామాలు మొదలుపెట్టేటప్పుడు నిపుణుల పర్యవేక్షణ ఉండటం శ్రేయస్కరం.


