Homeహెల్త్Children : పౌష్టికాహార లోపం.. పసిబిడ్డల తెలివికి శాపం: తొలి రెండేళ్లలోనే మేధస్సుకు పక్కా పునాది

Children : పౌష్టికాహార లోపం.. పసిబిడ్డల తెలివికి శాపం: తొలి రెండేళ్లలోనే మేధస్సుకు పక్కా పునాది

Child nutrition and brain development : పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతగానో తపిస్తుంటారు. మంచి బడులు, ఆధునిక సదుపాయాలు సమకూర్చడంపై పెట్టే శ్రద్ధ.. వారి పళ్లెంలో పెట్టే ఆహారంపై పెడుతున్నారా? పసిప్రాయంలో పోషకాహార లోపం ఏర్పడితే అది కేవలం శరీర ఎదుగుదలనే కాదు.. మెదడు చురుకుదనాన్ని, ఐక్యూ (IQ) స్థాయిలను శాశ్వతంగా కుంగదీస్తుందని మీకు తెలుసా? తొలి రెండేళ్లలో జరిగే చిన్నపాటి నిర్లక్ష్యం బిడ్డ తెలివితేటలపై జీవితాంతం ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతుంది? అసలు ఏ వయసులో ఎలాంటి పోషణ ఇవ్వాలి? వైద్య నిపుణులు వెల్లడిస్తున్న వాస్తవాలివే..

- Advertisement -

తొలి రెండేళ్లే అత్యంత కీలకం: మానవ మెదడు వికాసంలో ఏకంగా 80 శాతం ఎదుగుదల మొదటి రెండేళ్ల ప్రాయంలోనే పూర్తవుతుంది. మిగతా జీవితమంతా జరిగేది కేవలం 20 శాతం మాత్రమే. శిశువు పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే అమృతంలా అందించాలి. ఏడో నెల నుంచి రెండేళ్ల వరకు తల్లిపాలతో పాటు నాణ్యమైన అనుబంధ పోషకాహారాన్ని (Complementary Food) అలవాటు చేయాలి. ఇందులో జాప్యం జరిగితే పిల్లల ఐక్యూ ఏకంగా 7 నుంచి 10 పాయింట్లు పడిపోతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సూక్ష్మపోషకాల కొరత.. మేధోపతనం: శైశవ దశలో సూక్ష్మపోషకాలు అందకపోతే ఐదేళ్ల తర్వాత ఆ లోపం స్పష్టంగా బయటపడుతుంది.

అయోడిన్ లోపం: దీనివల్ల ఐక్యూ 10 నుంచి 15 పాయింట్లు తగ్గుతుంది.
ఐరన్ లోపం: జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మందగించి 2 నుంచి 6 ఐక్యూ పాయింట్లు పతనమవుతాయి.
విటమిన్ బి-12 లోపం: నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభావం చూపి 2 నుంచి 7 పాయింట్ల మేర తెలివితేటలు తగ్గుతాయి.

తగ్గుతున్నా.. ఇంకా శ్రద్ధ అవసరం: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాల ప్రకారం ఏపీలో వయసుకు తగిన ఎత్తు లేని పిల్లల సంఖ్య 31.2 శాతం నుంచి 9.04 శాతానికి, బరువు లేని వారి సంఖ్య 16.1 శాతం నుంచి 2.98 శాతానికి తగ్గడం ఊరటనిచ్చే అంశం. అంగన్‌వాడీ సేవల వినియోగంతో పాటు ప్రతి ఇంటా తల్లిదండ్రులు సమతుల్య ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News