Saturday, November 23, 2024
Homeహెల్త్Chin care: గడ్డంపై బ్లాక్ హెడ్సా?

Chin care: గడ్డంపై బ్లాక్ హెడ్సా?

మీకు బ్లాక్ హెడ్స్ రావటానికి కారణం తెలుసా?

గడ్డంపై బ్లాక్ హెడ్స్ ఉన్నాయా?

- Advertisement -

గడ్డం మీద ఉండే బ్లాక్ హెడ్స్ పోగొట్టే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. బ్లాక్ హెడ్స్ అంటే మైల్డ్ యాక్నే. గడ్డంపై మూసుకుపోయిన వెంట్రుకల కుదుళ్లు ఇవి రావడానికి ఒక కారణం. ఇవి బంప్స్ లాగ ఏర్పడతాయి. వీటినే బ్లాక్ హెడ్స్ అంటారు. ఈ బ్లాక్ హెడ్స్ ముక్కు, గడ్డం, భుజాలు, చేతుల ఇలా ఎక్కడైనా ఏర్పడవచ్చు. ముఖానికి సంబంధించి చూస్తే ఇవి ఎక్కువగా ముక్కు, గడ్డం, నుదుటి మీద ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడడానికి హార్మోనల్ అసమతుల్యత ఒక కారణం. ముఖ్యంగా యుక్త వయసులో, అలాగే గర్భం దాల్చినపుడు లేదా రుతుక్రమం వంటి వాటివల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. పౌష్టికాహారం తీసుకోకపోయినా బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. మేకప్, కన్సీలర్ల సహాయంతో బ్లాక్ హెడ్స్ కనపడకుండా చేసుకోవచ్చు. గడ్డం మీద ఏర్పడే బ్లాక్ హెడ్స్
పోగొట్టుకోవాలంటే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.

నిత్యం గడ్డంపై చర్మాన్నిఎక్స్ ఫొయిలేషన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మ్రుతకణాలు పోతాయి. దీంతో చర్మరంధ్రాలు మూసుకు పోకుండా ఉంటాయి. అతిగా ఎక్స్ ఫోయిలేషన్ చేస్తే చర్మానికి ఎంతో హాని కలుగుతుంది. అందుకే గడ్డం ప్రదేశంలో సున్నితమైన స్క్రబ్స్ తో ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవాలి. వేడినీళ్ల ఆవిరిని ముఖానికి పట్టుకుంటే కూడా ఎంతో మంచిది. ఆ నీళ్లల్లో టీ ట్రీ ఆయిల్ కొద్దిగా వేసి ఆవిరి పట్టుకుంటే బ్లాక్ హెడ్స్ మీద బాగా పనిచేస్తుంది. కొందరు బ్లాక్ హెడ్స్ ను గోళ్లతో చిదుముతుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి మరింతగా విషమిస్తుంది. ఇవి పోవడానికి బ్లాక్ హెడ్ రిమూవర్ ఉంటాయి. వాటిని వాడొచ్చు.

అంతేకాదు బ్లాక్ హెడ్స్ ను తొలగించే నాణ్యమైన స్ట్రిప్స్ కూడా మార్కెట్ లో దొరుకుతాయి. గడ్డం మీద గీతలు పడకుండా ఉండేలా ఇవి ఉపయోగపడతాయి. బ్లాక్ హెడ్స్ పోగొట్టడంలో సముద్ర ఉప్పు కూడా బాగా పనిచేస్తుంది. గరుకుగా ఉండే సముద్రపు ఉప్పు చర్మాన్ని బాగా ఎక్స్ ఫొయలేట్ చేస్తుంది. అంతేకాదు చర్మ రంధ్రాలను మూసుకుపోకుండా సంరక్షిస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. సముద్రపు ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమంతో గడ్డంపై మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గడ్డం మీద చేరిన మురికి పోతుంది. జిడ్డు చర్మాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు చర్మ రంధ్రాలలో చేరిన మ్రుతకణాలు కూడా పోతాయి. విటమిన్ సి బాగా ఉన్న ఆహార పదార్థాలు కూడా బ్లాక్ హెడ్స్ రాకుండా సంరక్షిస్తాయి. విటమిన్ సి యాంటాక్సిడెంట్. చర్మాన్ని ఇది సంరక్షించడమే కాకుండా యాక్నే, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాదు ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. బాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది.

అందుకే నిమ్మ, సిట్రస్ ఫ్రూట్స్, బొప్పాయి, స్ట్రాబెర్రీ, ఆకుకూరలు వంటివి బాగా తినాలి. విటమిన్ సి సప్లిమెంట్స్ కూడా వాడొచ్చు. ఇవి కొల్లాజెన్ ను బాగా ఉత్పత్తిచేస్తాయి. చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చాలామంది తరచూ కమలాపండు తొక్కల పొడిని ఇళ్లల్లో ఉపయోగిస్తుంటారు. కమలాపండు తొక్కలు చర్మం టోన్ ను సంరక్షిస్తాయి. చర్మరంధ్రాలను పెద్దవి కాకుండా చూస్తాయి. కమలాపండు తొక్కలు ఉపయోగించాలనుకుంటే వాటిని బాగా ఎండబెట్టి పొడి చేయాలి. ఆ పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేసి దాన్ని గడ్డం భాగంలో అప్లై చేయాలి. కమలాపండు తొక్కలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. బ్లాక్ హెడ్స్ ను నివారిస్తాయి. కమలాపండు తొక్కల పొడితో చేసిన పేస్టును చర్మానికి పూసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో గడ్డాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. చర్మంపై ఎక్కువగా నూనె గ్రంధులు స్రవించకుండా ఇది నిరోధించడమే కాకుండా, చర్మంపై మురికి చేరకుండా కూడా అడ్డుకుంటుంది. అలాగే గడ్డపై ఉండే చర్మాన్ని గట్టిగా స్ర్కబ్ చేయకూడదు. అలా చేస్తే చర్మంపై గీతలు పడడమే కాకుండా చర్మం టెక్స్చెర్ దెబ్బతింటుంది . ఫలితంగా చర్మంపై నూనె గ్రంధులు ఎక్కువగా స్రవించే అవకాశం కూడా ఉంది. దీంతో బ్లాక్ హెడ్స్ మరింత తీవ్రరూపం దాలుస్తాయి.

యాక్నేకి అలొవిరా జెల్ బాగా పనిచేస్తుందని మనకు తెలుసు. అలాగే బ్లాక్ హెడ్స్ నివారణలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అందుకే అలొవిరా జెల్ ను నేరుగా గడ్డంకి అప్లై చేసి పది నిమిషాలు అలాగే ఉంచాలి.
తర్వాత గోరువెచ్చటి నీటితో గడ్డాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో పాలు, తేనె మిశ్రమం ఎంతో బాగా పనిచేస్తుంది. ముడితేనె, ముడి పాలు రెండింటినీ కలిపి పేస్టులా చేసి కొన్ని సెకన్లపాటు దాన్ని మైక్రోవేవ్ లో పెట్టి తర్వాత చల్లారనివ్వాలి. ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ని ముంచి దానితో గడ్డం మీద అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. తేనెలో యాంటీబాక్టీరియల్ గుణాలు బాగా ఉన్నాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దానికి ఎక్స్ ఫొయిలేట్ చేసే గుణం కొద్దిగా ఉంది. ముఖంపై పడ్డ ముడతలు తొలగించే చికిత్సలో లాక్టిక్ యాసిడ్ పీలింగ్ ఒక ప్రొసీజర్. క్లే మాస్కు కూడా చర్మాన్ని ఎంతో శుభ్రం చేస్తుంది. చర్మంపై చేరిన మురికిని పోగొడుతుంది. ముల్తానీ మట్ట లేదా బెంటొనైట్ మట్టి ఏదైనా తీసుకుని అందులో కాస్త నీళ్లు కలిపి పేస్టులా చేసి బ్లాక్ హెడ్స్ మీద అప్లై చేయాలి. అది బాగా ఆరిన తర్వాత నీళ్లతో ఆ ప్రదేశాన్ని కడుక్కోవాలి.


ముల్తానీ మట్టి చర్మంపై చేరిన అదనపు మట్టిని, అదనపు నూనెలను లేకుండా శుభ్రం చేసి బ్లాక్ హెడ్స్ రాకుండా నిరోధిస్తుంది. గడ్డం మీద ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ ను పోగొట్టే మరో చిట్కా కూడా ఉంది. ఒక టీస్పూను దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని బాగా కలపాలి. ఒక కాటన్ స్ట్రిప్ తీసుకుని దాన్ని ఆ మిశ్రమంలో ముంచి గడ్డం మీద పెట్టుకొని ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత తీసేయాలి. దాల్చినచెక్కలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. ఇవి బ్లాక్ హెడ్స్ ను ఎంతో శక్తివంతంగా నిరోధిస్తాయి. అలాగే బ్లాక్ హెడ్స్ పోగొట్డంలో నిమ్మ కూడా బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మంపై ఏర్పడ్డ మచ్చలను, ఇతర రకాల గుర్తులను కూడా పోగొడుతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక నిమ్మకాయ తీసుకుని దాని రసం పిండి అందులో కాటన్ బాల్ ముంచి తడిచేసి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట బాగా అద్దాలి. అది బాగా ఆరిన తర్వాత తిరిగి కాటన్ బాల్ ను నిమ్మరసంలో ముంచి బ్లాక్ హెడ్స్ పై సున్నితంగా ఒత్తి నిమ్మరసం అప్లై చేయాలి. ఇలా మూడు లేదా నాలుగుసార్లు చేసి తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడగాలి.

నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి. గడ్డం మీద ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడంలో చక్కెర, జొజోబా ఆయిల్ మిశ్రమం కూడా బాగా పనిచేస్తుంది. ఒక టీస్పూను చొప్పున ఈ రెండింటినీ తీసుకుని పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని గడ్డానికి పట్టించి చేతివేళ్లతో ఆ భాగంలో గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ పోవడమే కాదు, చర్మానికి మాయిశ్చరైజర్ బాగా అందుతుంది. షుగర్ మంచి ఎక్స్ ఫొయిలేటర్. ఇది చర్మ రంధ్రాలలో చేరిన మురికిని పోగొడుతుంది.

ఈ సమస్యను పరిష్కరించే ఇంకొక టిప్పు ఏమిటంటే, నాలుగైదు పుదీనా ఆకులు తీసుకుని సన్నగా తరగాలి. అందులో ఒక టీస్పూన్ వెనిగర్ వేసి పేస్టులా చేయాలి. ఒక కప్పు నీటిలో ఈ పేస్టును కలిపి బాటిల్ లో పోసి భధ్రం చేయాలి. బ్లాక్ హెడ్స్ ఏర్పడిన చోట ఈ నీటిని నిత్యం అప్లై చేస్తుండాలి. యాపిల్ సిడార్ వెనిగర్ కూడా ఈ సమస్యకు బాగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రంచేస్తుంది. స్కిన్ టోన్ ను కాపాడుతుంది. పుదీనా చర్మాన్ని తాజాదనంగా ఉంచుతుంది. ఈ సమస్యకు మరొక ఇంటి చిట్కా కూడా ఉంది. అర టీస్పూన్ ఓట్మీల్స్ మెత్తగా గ్రైండ్ చేసి అందులో ఒక టీస్పూన్ చక్కెర కలపాలి. అందులో ఒక టీస్పూను కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని గడ్డానికి రాస్తే మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో ఇరవై నిమిషాలు రుద్దాలి. అది బాగా ఆరిపోయేవరకూ మరో పదినిమిషాలపాటు అలాగే వదిలేయాలి. తర్వాత నీళ్లతో గడ్డాన్ని బాగా కడుక్కోవాలి.

బ్లాక్ హెడ్స్ తొలగించడంలో ఓట్మీల్, షుగర్ రెండింటి మిశ్రమం మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది. ఎగ్ వైట్ ఫేస్ మాస్కు కూడా బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. గడ్డంపై ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ పోగొట్టడంలో బేకింగ్ సోడా, నీరు కలిపిన పేస్టు ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేసి దాన్ని గడ్డపై రాసి కాసేపు రుద్దినట్టు చేయాలి. తర్వాత పది నిమిషాలు దాన్ని అలాగే వదిలేసి ఆ తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. బేకింగ్ సోడా మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. మూసుకుపోయిన చర్మ రంధ్రాలను బాగా శుభ్రంచేస్తుంది. బేకింగ్ సోడాను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చర్మ నిపుణుల సలహా తీసుకుని దీన్ని వాడితే మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News