Periods vs Cinnamon: స్త్రీలు ప్రతి నెల ఎదుర్కొనే బహిష్టు కాలం శారీరకంగా, మానసికంగా చాలా చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా కడుపులో నొప్పి, వికారం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు సాధారణం. ఇవి ఒక రకమైన ఒత్తిడిగా మారి రోజువారీ పనులకు అంతరాయం కలిగిస్తాయి. అయితే, ఈ సమస్యల నుండి కొంత ఉపశమనం పొందేందుకు సహాయపడే సహజపదార్థాల్లో దాల్చినచెక్క ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.
దాల్చినచెక్క..ఔషధ గని..
దాల్చినచెక్క ఒక సుగంధద్రవ్యం మాత్రమే కాదు, శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఓ ఔషధ మొక్క. ఇందులో ఉండే యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బహిష్టు సమయంలో గర్భాశయం కండరాలు వద్ద బాగా నొప్పి ఏర్పడుతుంది. దాల్చినచెక్కలో ఉండే సహజసిద్ధ పదార్థాలు గర్భాశయ కండరాలను రిలాక్స్ చేయడంతో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.
ఒక వైద్య అధ్యయనం ప్రకారం, దాల్చినచెక్క తీసుకున్న స్త్రీల్లో బహిష్టు నొప్పులు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. అందుకే బహిష్టు సమయాల్లో గోరువెచ్చటి నీళ్లలో కొంచెం దాల్చినచెక్క పొడి కలిపి త్రాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
నొప్పులను క్రమబద్ధీకరించడంలో
ఇంకా ఒక ప్రధాన సమస్య అంటే అధిక రక్తస్రావం. కొంతమంది స్త్రీలలో ఇది తీవ్రమైన స్థాయికి చేరుతుంది. దాల్చినచెక్క ఈ సమస్యలో కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇది రక్తనాళాలను కుదింపు చేయడం ద్వారా రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది. అదే సమయంలో శరీరంలో ఉత్పత్తయ్యే కొన్ని రసాయనాల్ని నియంత్రించడం ద్వారా బహిష్టు నొప్పులను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో
గర్భాశయ సంబంధిత సమస్యలతో పాటు బహిష్టు సమయంలో వచ్చే వికారం, కడుపు ఉబ్బరం, తలనొప్పి లాంటి లక్షణాలపై కూడా దాల్చినచెక్క ప్రభావం చూపుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. దాల్చినచెక్కలో ఉండే సినామల్డేహైడ్, కుమరిన్ లాంటి పదార్థాలు పేగుల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చటి దాల్చినచెక్క టీ తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
పిసియోఎస్ అనే హార్మోన్ సంబంధిత సమస్యతో బాధపడే స్త్రీలకు దాల్చినచెక్క మరింతగా మేలుచేసే మూలిక అని చెప్పుకొవచ్చు. ఇది శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహకరిస్తుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను స్థిరంగా ఉంచడంలో దాల్చినచెక్క పాత్ర కీలకం. హార్మోన్లు సక్రమంగా పనిచేస్తే, బహిష్టు సమయం కూడా క్రమబద్ధంగా కొనసాగుతుంది.
Also Read:https://teluguprabha.net/health-fitness/these-are-the-benefits-of-eating-beet-root/
ఈ సమయంలో చాలామంది మహిళలు అలసటతో ఉండటం సాధారణం. పని మీద ఏ ఆసక్తీ లేకుండా, శరీరంగా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. దీనికి ఒక కారణం రక్తంలో చక్కెర స్థాయిలో మార్పులు రావడం. దాల్చినచెక్క రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. దీని వల్ల శరీరానికి తక్షణ ఉత్సాహం లభిస్తుంది.
దాల్చినచెక్కను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శక్తి నిల్వలు పెరుగుతాయి. ఉదాహరణకు, ఓట్స్‌లో, కాఫీలో లేదా తేలికపాటి స్నాక్స్‌లో ఈ పదార్థాన్ని జోడిస్తే రుచితో పాటు శక్తి కూడా లభిస్తుంది. బహిష్టు సమయంలో వచ్చే ఎనర్జీ డిప్‌కి ఇది సహజ పరిష్కారం అవుతుంది.
నాడీ వ్యవస్థను ఉల్లాసంగా..
దీనితో పాటు పిఎంఎస్ అంటే బహిష్టు ప్రారంభానికి ముందు కొన్ని రోజుల పాటు వచ్చే మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, డిప్రెషన్ లాంటి లక్షణాలను కూడా దాల్చినచెక్క తగ్గించగలదని పరిశోధనల్లో తేలింది. ఇది నాడీ వ్యవస్థను ఉల్లాసంగా ఉంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఇవన్నీ చూసినపుడు దాల్చినచెక్క ఒక సాధారణ పదార్థంలా కాక, ఆరోగ్యాన్ని కాపాడే ఓ సహజ మూలికగా మారుతుంది. దీనిని సరైన మోతాదులో, నిత్య జీవనశైలిలో చేర్చుకుంటే, బహిష్టు సమయంలో వచ్చే చాలా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రత్యేకించి, టాబ్లెట్లను దూరంగా ఉంచాలనుకునే వారికి ఇది సురక్షిత ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
బహిష్టు సమస్యలను తేలికపరచే సహజ మార్గాల్లో దాల్చినచెక్కకున్న స్థానం ఎంతో ప్రాధాన్యమైనది. దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే, మహిళల ఆరోగ్యానికి ఇది పెద్ద మద్దతుగా నిలుస్తుంది.


