Friday, September 20, 2024
Homeహెల్త్Clean knife: వంటింటి చాకును ఈజీగా క్లీన్ చేయండి

Clean knife: వంటింటి చాకును ఈజీగా క్లీన్ చేయండి

వంటింట్లో వాడే వస్తువుల్లో కూరలు, వంటపదార్థాలు కట్ చేసే చాకులు చాలా ముఖ్యమైనవి. ఇవి ఎంత పదునుగా ఉంటే అంత బాగా పనిచేస్తాయి. అంతేకాదు వంటింట్లో ఉపయోగించే చాకులు తుప్పుపట్టకుండా కూడా చూసుకోవాలి. చాకులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. చాకును శుభ్రంగా ఉంచాలంటే డిష్ వాష్ సోప్ కు కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు జోడించి దాంతో వాటిని శుభ్రం చేయొచ్చు.చాకులను శుభ్రం చేసే బెస్ట్ క్లీన్సింగ్ ఏజెంట్ ఇది. వంటింట్లో వాడే చాకులు తుప్పు పడుతుంటాయి కూడా. చాకుకు పట్టిన తుప్పు పోవాలంటే బేకింగ్ సోడా పేస్టు బాగా పనిచేస్తుంది. లేదా తుప్పు పట్టిన చాకుపై నిమ్మరసం పిండి రుద్దితే కూడా చాకుపై ఏర్పడ్డ తుప్పు పోతుంది. పలుచగా చేసిన వెనిగర్ తో కూడా చాకును తోమితే దానికి పట్టిన తుప్పు పోతుంది. చాకులు దీర్ఘకాలం ఉపయోగపడాలంటే వాటిని తరచు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే అవి ఎంతో షార్పుగా పనిచేస్తాయి.
చాకులు బాగా పనిచేయడం అనేది వాటిని మనం ఉపయోగించే తీరు మీద కూడా ఆధారపడి ఉంటుంది. చెక్కలాంటి సర్ఫేస్ పై కూరగాయలను, గట్టి పదార్థాలను ఉంచి చాకుపై రెండు వేళ్లను బలంగా ఒత్తిపెట్టి అప్పుడు కట్ చేయాలి. చాకుతో పని అయిన వెంటనే మెత్తటి స్పాంజి తీసుకుని గోరువెచ్చటి నీళ్లలో దాన్ని ముంచి చాకును మెల్లగా తుడిస్తే చాకుకు అంటిన ఆహార పదార్థాలు పోతాయి. అయితే ఈ పని దురుసుగా కాకుండా మెల్లగా చేయాలి. స్పీడుగా చేస్తే వేళ్లు కట్ అయ్యే ప్రమాదం ఉంది. చాకుకు అంటిన కొన్ని పదార్థాల జిడ్డు ఒకపట్టాన పోదు. అలాంటప్పుడు సబ్బునీళ్లల్లో ఆ చాకును కాసేపు నాననిస్తే చాకుకు అంటిన ఆ గ్రీజు పోతుంది. తర్వాత ఆ చాకును నీళ్ల ధార కింద పెట్టి కడిగితే అది శుభ్రంగా ఉంటుంది. చాకులు మెరిసేలా ఉండాలంటే మరికొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. చాకుతో పని అయిన వెంటనే దాన్ని శుభ్రం చేయాలి. ఆలస్యం చేస్తే చాకుపై ఏర్పడ్డ పదార్థాల మరకలు ఒక పట్టాన పోవు. చాకుకు అంటిన ఫుడ్ పార్టికల్స్ ఎక్కువసేపు ఉంటే కూడా చాకు తుప్పుపట్టే అవకాశం ఉంది. చాకులను డిష్ వాషర్ లో వేయకుండా చేతులతో కడిగితేనే శుభ్రంగా ఉంటాయి. డిష్ వాషర్ లో గిన్నెలతో పాటు చాకులను వేయకూడదు. ఎందుకంటే గిన్నెల క్లీనింగ్ కోసం డిష్ వాషర్ లో వాడే గాఢమైన క్లీనింగ్ లిక్విడ్ వల్ల చాకు తుప్పుపడుతుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల చాకు మెరుపును కోల్పోతుంది కూడా. పైగా డిష్ వాషర్ లో గిన్నెలతో పాటు చాకును శుభ్రంచేయాలని చూస్తే ఆ గిన్నెలు చాకుకు తగిలి చాకుకు ఉండే షార్పునెస్ తగ్గే అవకాశం ఉంది. చాకులు బాగా తుప్పుపట్టినట్టు ఉంటే బేకింగ్ సోడాలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసి చాకుపై తుప్పుపట్టిన ప్రదేశాల్లో రాసి తోమాలి. ఆ తర్వాత దాన్ని నీళ్లతో కడగాలి. ఇలా చేస్తే చాకు మెరవడమే కాకుండా దానికి పట్టిన తుప్పు కూడా పోతుంది. చాకును శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో వాటిని సరిగా భద్రం పరచడం కూడా అంతే ముఖ్యం. చాకును భద్రం చేసేటప్పుడు అది బాగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. చాకులను ప్రత్యేకంగా ఒక ర్యాక్ లో ఉంచాలి. లేదా చెక్క డబ్బాలో భద్రపరచాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News