Friday, September 20, 2024
Homeహెల్త్Coffee to weight loss: బరువును తగ్గించే కాఫీలు..

Coffee to weight loss: బరువును తగ్గించే కాఫీలు..

మనందరికీ కాఫీ తాగకుండా రోజు మొదలవదు. కాఫీ ఇచ్చే ఎనర్జీ అలాంటిది. కానీ కాఫీ తాగితే బరువు కూడా తగ్గుతామని తెలుసా? కాఫీ మీద చేసిన కొన్ని అధ్యయనాల్లో సైతం ఈ విషయాన్ని పరిశోధకులు పేర్కొన్నారు. మరి బరువును తగ్గించే అలాంటి కాఫీల్లో గ్రీన్ కాఫీ ఒకటి. అలాంటి కాఫీని వెయిట్ లాస్ డైట్లో తప్పకుండా చేర్చాల్సిందే.

- Advertisement -

గ్రీన్ కాఫీ విషయానికి వస్తే ఇందులో గ్రీన్ కాఫీ పౌడర్ , అల్లం, పుదీనా ఆకులు, చియా గింజలు వీటన్నింటినీ కలిపి జింజర్ మింట్ గ్రీన్ కాఫీ తయారుచేయొచ్చు. గ్రీన్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. రోజూ మనం తాగే సాధారణ కాఫీలో కన్నా గ్రీన్ కాఫీలో యాంటాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కారణం సాధారణ కాఫీలో వాడే కాఫీ గింజల్ని రోస్ట్ చేస్తే గ్రీన్ కాఫీలో గింజలను రోస్ట్ చేయరు. అందువల్ల ఈ కాఫీలో యాంటాక్సిడెంట్ల శాతం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్ కూడా.

బ్లాక్ కాఫీ కూడా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. డికాఫినేటెడ్ గింజలతో చేసిన బ్లాక్ కాఫీలో కాలరీలు ఉండవు. బ్లాక్ కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. క్లోరోజెనిక్ యాసిడ్ యాంటాక్సిడెంట్ లా పనిచేస్తుంది. ఇది అధికరక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో బ్లడ్ షుగర్ ప్రమాణాలను నియంత్రిస్తుంది. బరువు తగ్గిస్తుంది. ఎనర్జీ ప్రమాణాలను పెంచుతుంది. శరీరంలోని ఫ్యాట్ ను కరిగిస్తుంది. శరీరంలోని ఎక్స్ ట్రా వాటర్ బయటకు పంపేయడం ద్వారా అధిక నీటివల్ల ఉన్న బరువును కూడా బ్లాక్ కాఫీ తగ్గిస్తుంది.

ఇంకొకటి లెమన్ కాఫీ. దీన్ని ఉదయమే తాగితే చాలా మంచిది. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుచేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ వల్ల శరీర బరువు తగ్గుతుంది. కాఫీ తాగితే జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. కాఫీలో వాడే రకరకాల మసాలా దినుసుల వల్ల కూడా బరువు తగ్గుతాం.

బరువును తగ్గించే కాఫీ రెసిపీలు కొన్ని:

హెర్బల్ గ్రీన్ కాఫీ రెసిపీ:

కావలసిన పదార్థాలు: గ్రీన్ కాఫీ శాచెట్-1, లవంగం-1,దాల్చిన చెక్క- అరంగుళం, ఏలక్కాయ-1 (దంచి), తులసి ఆకులు-5, పసుపు-అర టీస్పూను, నిమ్మకాయ-అరచెక్క, మిరియాలు-రెండు.

తయారీ: రెండు కప్పుల నీళ్లు తీసుకుని బౌల్ లో పోసి అందులో లవంగం, ఏలక్కాయ, దాల్చినచెక్క, మిరియాలు, పసుపు, తులసి ఆకులు వేసి ఒక కప్పుకు వచ్చేదాకా ఆ నీటిని బాగా ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి కప్పులో పోసి నిమ్మరసాన్ని అందులో వేసి బాగా కలపాలి. తర్వాత గ్రీన్ కాఫీ శాచెట్ ను అందులో ముంచి కాసేపు అలాగే ఉంచి తీసేయాలి. హెర్బల్ గ్రీన్ కాఫీ రెడీ.

బ్లాక్ కాఫీ: ఒక కప్పు వేడినీళ్లల్లో కాఫీపొడి ఒక్కటే వేసి కలిపితే చాలు. బ్లాక్ కాఫీ రెడీ.

లెమన్ కాఫీ:

ఒక కప్పులో అరటీస్పూను కాఫీ పొడి వేసి మరిగించిన నీళ్లను అందులో పోయాలి. అందులో పావు వంతు నిమ్మరసం పిండి దాన్ని స్పూనుతో బాగా కలిపి వేడి వేడిగా లెమన్ కాఫీ తాగితే ఎంతో బాగుంటుంది.

మసలా కాఫీ:

కావలసినవి: ఎక్స్ ప్రెసో షాట్-40 ఎంఎల్, బ్రౌన్ షుగర్- ఒకటి లేదా రెండు టీస్పూన్లు, కోకో పౌడర్-4 టీస్పూన్లు, దాల్చినచెక్క పొడి-పావు టీస్పూను, జాపత్రి పొడి- పావు టీస్పూను, కయెన్నే మిరియాలపొడి- అర టీస్పూను, వెనిల్లా సిరప్-టీస్పూను, లోఫ్యాట్ మిల్క్:120 ఎంఎల్.

తయారీ: కోకో పౌడర్,సుగర్ పౌడర్, దాల్చినచెక్కపొడి, జాపత్రిపొడి,మిరియాలపొడి అన్నింటినీ ఒక బౌల్లో వేయాలి. అందులో ఎక్స్ ప్రెసో షాట్ ను పోసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. దానిలో వెనిల్లా సిరప్ ను కలపాలి. ఈ మిశ్రమంలో వేడిగా ఉన్న లోఫ్యాట్ మిల్కును పోయాలి. వేడిగా ఉన్న దాన్ని ఒక కప్పులో పోసి పైన కాస్త క్రీము, మసాలా పొడి చల్లితే చాలు మసాలా కాఫీ రెడీ.

పిస్తాచియో కాఫీ :

కావలసినవి: ఎక్స్ ప్రెసో షాట్-40 ఎంఎల్, బ్రౌన్ షుగర్ – పావు టీస్పూను, పిస్తాపప్పులు(పొడిచేసినవి) –ఒక టీస్పూను, ఏలకుల పొడి-ఒక టీస్పూను, లోఫ్యాట్ మిల్క్ ఫోమ్.

తయారీ: పిస్తా పొడి, చక్కెర, ఏలకుల పొడి ఒక బౌల్ లో వేసి అందులో వేడిగా ఉన్న ఎక్స్ ప్రెసో షాట్ ను పోసి బాగా కలపాలి. దానిపై లోఫ్యాట్ మిల్క్ ఫోమ్ వేయాలి. దానిపై పిస్తా పప్పులు, చిటికెడు యాలకుల పొడిని చల్లాలి. వేడి వేడిగా ఈ హెల్దీ కాఫీ తాగితే వచ్చే ఎనర్జీయే వేరు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News