Saturday, October 5, 2024
Homeహెల్త్Community gardening: కమ్యూనిటీ గార్డెనింగ్ తో ఆరోగ్యం

Community gardening: కమ్యూనిటీ గార్డెనింగ్ తో ఆరోగ్యం

ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవడం, బాగా వ్యాయామాలు చేయడం, మంచి స్నేహితులను పెంచుకోవడం ఎంతో మంచి అలవాట్లు. అయితే ఇటీవల అమెరికాలో సియు బౌల్డర్ అధ్యయనంలో ఒక ఆసక్తికర విషయం తేలింది. పైన పేర్కొన్న అలవాట్లకు కమ్యూనిటీ గార్డెనింగ్ కూడా తోడయితే ఫలితాలు మరింత బాగుంటాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. కమ్యూనిటీ గార్డెనింగ్ చేస్తూ పీచుపదార్థాలు బాగా తీసుకోవడం, వ్యాయామాలు బాగా చేయడం వల్ల కాన్సర్ రిస్కు తక్కువగా ఉండడమే కాదు, క్రానిక్ జబ్బుల బారిన పడరని ఆ అధ్యయనంలో తేలింది. అంతేకాదు యాంగ్జయిటీ, ఒత్తిడి సమస్యలను కూడా అధికమిస్తారట.

- Advertisement -

లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ లో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురించారు. కమ్యూనిటీ గార్డెనింగ్ వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుందట. గార్డెనింగ్ చేయడం వల్ల మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుందిట. అంతేకాదు గార్డెనింగ్ చేసేవాళ్లు తాజా పళ్లు, కూరగాయలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారట. దీంతో వాళ్లు ఆరోగ్యవంతమైన శరీర బరువును కలిగి ఉంటున్నారుట. ఈ అధ్యయనంలో భాగంగా డెన్వర్ ప్రాంతంలో 41 ఏళ్ల వయసు మించని, గార్డెనింగ్ అలవాటు లేని 291 మందిని తీసుకున్నారు. వీరిలో తక్కువ వేతనం ఉన్నవారు సైతం ఉన్నారు. వీళ్లల్లో సగం మందికి కమ్యూనిటీ గార్డెనింగ్ బాధ్యత అప్పగించారు. మిగతా వారికి ఒక సంవత్సరం తర్వాత గార్డెనింగ్ పని అప్పగించేందుకు నిశ్చయించి వారిని కంట్రోల్ గ్రూపుగా తీసుకున్నారు. గార్డెనింగ్ పని అప్పగించిన వారిచేత విత్తనాలు చల్లడం, మొలకలు వేయడం , ఇతర గార్డెనింగ్ పనులను చేయించారు. నిర్దిష్ట సమయం తర్వాత రెండు గ్రూపుల న్యూట్రిషన్ ప్రమాణాలను సర్వే చేశారు.

రెండు గ్రూపుల్లోని వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా పరీక్షించారు. శరీర కొలతలు తీసుకున్నారు. యాక్టివిటీ మానిటర్స్ పరిశీలించారు. కంట్రోల్ బ్రుందంలో వారికన్నా కూడా గార్డెనింగ్ చేస్తున్న బ్రుందం తమ ఆహారంలో రోజుకు 1.4 గ్రాముల అధికంగా పీచు పదార్థాలు తీసుకుంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. పీచు పదార్థాలు రోగనిరోధక వ్యవస్థపై మంచి ఫలితాలు చూపుతాయి. ఆహారం బాగా జీర్ణమయ్యేట్టు చేయడంలో ప్రభావం చూపుతాయి. కొన్ని రకాల కాన్సర్ల బారిన జీర్ణవ్యవస్థ పడకుండా కాపాడడమే కాదు మధుమేహం వంటి బారిన పడకుండా ఫైబర్ కాపాడుతుంది. వైద్యులు రోజుకు 25 నుంచి 38 గ్రాముల ఫైబర్ తినాలని చెప్తున్నారు. కానీ యువత రోజుకు 16 గ్రాముల కన్నా తక్కువ ఫైబర్ తీసుకుంటున్నారు. ఒక గ్రాము పీచు పదార్థాల పెరుగుదల సైతం ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూబిస్తుందంటున్నారు వైద్యులు. గార్డెనింగ్ గ్రూపులోని వారి ఫిజికల్ యాక్టివిటీ సైతం బాగా పెరిగింది. వారానికి కనీసం 150 నిమిషాల మేర ఫిజికల్ యాక్టివిటీ అవసరమని పబ్లిక్ హెల్త్ ఏజన్సీలు చెప్తున్నాయి.

వారంలో రెండు లేదా మూడు సార్లు కమ్యూనిటీ గార్డెనింగ్ చేయడం వల్ల వారిలో 28 శాతం వరకూ ఫిజికల్ యాక్టివిటీ ఉంటోందిట. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఒత్తిడి, యాంగ్జయిటీ ప్రమాణాలు కూడా బాగా తగ్గాయి. కమ్యూనిటీ గార్డెనింగ్ వల్ల తాము తినే ఆహార పదార్థాలను వారు స్వయంగా పండించుకోవడమే కాదు ఎంతోమంది మనుషులతో మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయని అవి శరీరారోగ్యంపై గొప్ప ఫలితాలను చూపిస్తాయని ఈ స్టడీ చేసిన పరిశోధకులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News