మలబద్దకం సమస్య చాలామంది ఎదుర్కొంటుంటారు. నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దీని బారిన పడుతుంటారు. ఈ సమస్య నుంచి సహజంగా బయటపడటానికి ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని డ్రింకులు ఉన్నాయి. పళ్లు, నీళ్లు బాగా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. యాపిల్స్ ఈ సమస్య పరిష్కారానికి బాగా ఉపయోగపడతాయి.
రెండు యాపిల్స్ తీసుకుని వాటిలో గింజలు తీసేసి ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి. యాపిల్ ముక్కలతో పాటు అర టీ స్పూను సోంపు పొడి, అర కప్పు నీళ్లు పోసి మిక్సీలో వేసి జ్యూసులా చేసి తాగితే జీర్ణవ్యవస్థకు ఎంతో మంచిది. ద్రాక్షరసం కూడా ఈ సమస్యపై బాగా పనిచేతుంది. కొన్ని ఆకుపచ్చ లేదా నల్ల ద్రాక్ష పళ్లు తీసుకుని వాటితోపాటు అరంగుళం అల్లం ముక్క, అరకప్పు నీళ్లు, చిటికెడు నల్ల ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి జ్యూసులా చేసి తాగితే మలబద్దకం తగ్గుతుంది. ఒక కప్పు గోరువెచ్చటి నీళ్లల్లో అరచెక్క నిమ్మరసంతో పాటు ఒక టీస్పూను తేనె, అర టీస్పూను జీలకర్రపొడి వేసి కలిపి తాగాలి. ఈ డ్రింకు కూడా మలబద్దకం సమస్యను పరిష్కరిస్తుంది. మరో డ్రింకు కమలాపండు జ్యూసు. రెండు కమలాపళ్లను తీసుకుని జ్యూసర్ తో వాటి రసం తీయాలి. అందులో ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి ఫ్రెష్ గా తాగితే కూడా మలబద్దకం తగ్గుతుంది. పియర్స్ పళ్లని బాగా కడిగి అందులోని గుజ్జు తీసి అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి బ్లెండర్ లో వేసి జ్యూసులా చేసి తాగితే కూడా మలబద్దకం సమస్యపై బాగా పనిచేస్తుంది. ఐదారు ప్రూన్ పళ్లు, అర టీస్పూను తేనె, అరటీస్పూను జీలకర్ర
పొడి వేసి బ్లెండర్ లో వేసి జ్యూసులా చేసుకుని తాగాలి. ఇది కూడా మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.
చెర్రీ జ్యూసు కూడా జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేట్టు చేస్తుంది. ఒక కప్పు బెర్రీ పళ్లను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి అందులో గింజలను తీసేసి ఆ గుజ్జుకు రెండు టీస్పూన్ల నిమ్మరసం, అర కప్పు నీళ్లు, ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్ జోడించి బ్లెండర్ లో వేసి జ్యూసులా చేసి తాగితే మలబద్దకం తగ్గుతుంది. ఉదయమే ఖాళీ కడుపుతో ఈ డ్రింకులను ఒక కప్పు తాగితే మంచి ఫలితం కనిపిస్తుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. వీటితో పాటు మలబద్దకం తగ్గడానికి అదనంగా కొన్ని టిప్స్ ను కూడా నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో వ్యాయామాలు చేయడం ఒకటి. వారంరోజులూ నిత్యం నడవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. రోజూ పళ్లు, నీళ్లు బాగా తాగుతుంటే కూడా ఈ సమస్య తగ్గుతుంది. మోషన్ వస్తుంటే తాత్సారం చేయకుండా వెంటనే వాష్ రూమ్ కు వెళ్లి అనుమానం తీర్చుకోవాలి. అన్ ప్రాసెస్డ్ వీట్ బ్రాన్ ను సెరీల్, స్మూదీలు, ఇతర ఆహారపదార్థాల్లో చల్లి తింటే కూడా మంచిది.