Saturday, November 15, 2025
Homeహెల్త్Junk Food: జంక్‌ ఫుడ్‌తో పెను ప్రమాదం..నివేదికలో కీలక విషయాలు వెల్లడి..

Junk Food: జంక్‌ ఫుడ్‌తో పెను ప్రమాదం..నివేదికలో కీలక విషయాలు వెల్లడి..

Danger Of Junk Food: ఆధునిక జీవనశైలిలో, జంక్ ఫుడ్ ఒక సాధారణ అలవాటుగా మారింది. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి ఆహార పదార్థాలు పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దీంతో పిల్లలు పండ్లు, కూరగాయలతో కూడిన పోషకాహారాన్ని ఆమడ దూరం పెట్టేస్తున్నారు. జంక్ ఫుడ్ పిల్లల్లో దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. జంక్ ఫుడ్‌లో అధిక క్యాలరీలు, కొవ్వులు, చక్కెరలు ఉంటాయి. ఇవి పిల్లలు వేగంగా బరువు పెరగడానికి కారణం అవుతాయి. చిన్న వయసులోనే ఊబకాయం రావడం వల్ల భవిష్యత్తులో గుండె సమస్యలు, మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని యునిసెఫ్‌ హెచ్చరిస్తోంది. అయితే, యునిసెఫ్‌ గత ఇరవయ్యేళ్ళుగా పిల్లలు ఎలా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారో వివరిస్తూ..ఓ నివేదికను కూడా విడుదల చేసింది. ‘ఫీడింగ్‌ ప్రాఫిట్‌: హౌ ఫుడ్‌ ఎన్విరాన్‌మెంట్స్‌ ఆర్‌ ఫెయిలింగ్‌ చిల్డ్రన్‌’ అనే ఈ నివేదిక.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు ఎంతటి ప్రమాదం అంచున ఉన్నారో తెలియజేస్తోంది.

- Advertisement -

దాదాపు 190 కి పైగా దేశాల నుండి సేకరించిన డేటా ఆధారంగా యునిసెఫ్ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం..బాల్యం, కౌమారదశలో అంటే ఐదు నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో ఊబకాయం సమస్య మూడు రెట్లు పెరిగింది. ఇది అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు దారితీస్తుంది. నివేదిక ప్రకారం..సగటు కుటుంబాలు విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా, తృణధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తుల కంటే ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఎక్కువ ఖర్చు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే, బిస్కెట్లు, చిప్స్, జ్యూస్‌లు, కూల్డ్ డ్రింక్స్ వినియోగం అంచనాలకు మించి పెరిగింది. కావున ప్రభుత్వాలు ఆహార చట్టాలను కఠినతరం చేయాలని నివేదిక పేర్కొంది.

also read:Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి..? దీని లక్షణాలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పిల్లలు, యువకులు అధిక మోతాదులో చక్కెర, ఉప్పు, తిగా శుద్ధి చేసిన పిండి, అనారోగ్యకరమైన కొవ్వులతో తయారు చేయబడిన అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను తినడానికి ఇష్టపడుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన భోజనం కంటే జంక్ ఫుడ్ తినడం సులభం అనే భావన అందరిలో పెరుగుతోంది. జంక్ ఫుడ్ ఉత్పత్తి, మార్కెటింగ్ పై ఆంక్షలు విధించడం, అధిక పన్ను విధానాలను అమలు చేయడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని యునిసెఫ్ అభిప్రాయపడింది.

జంక్ ఫుడ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే అన్ని చోట్ల అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ‘ఫిట్ ఇండియా’, ‘ఈట్ రైట్ ఇండియా’ పేరుతో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ లో చక్కెర, కొవ్వు పరిమాణాన్ని సూచించే బోర్డులను పాఠశాలల్లో యాజమాన్యాలు ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad