Saturday, November 15, 2025
Homeహెల్త్Belly fat : పొట్ట చుట్టూ కొవ్వు.. ప్రాణాలకే ముప్పు! తగ్గాలంటే ఈ 5 పనులు...

Belly fat : పొట్ట చుట్టూ కొవ్వు.. ప్రాణాలకే ముప్పు! తగ్గాలంటే ఈ 5 పనులు తప్పనిసరి!

Health risks of belly fat : పెరుగుతున్న పొట్ట కేవలం మీ అందానికే అడ్డంకి అనుకుంటున్నారా..? నచ్చిన బట్టలు వేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారా..? అయితే మీరు అసలు ప్రమాదాన్ని గుర్తించనట్లే. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు (బెల్లీ ఫ్యాట్) కేవలం ఓ సౌందర్య సమస్య కాదు, అది మీ ప్రాణాలతో చెలగాటమాడే ఓ నిశ్శబ్ద హంతకి… టైప్ 2 డయాబెటిస్ నుంచి గుండె జబ్బుల వరకు అనేక ప్రమాదకరమైన రోగాలకు ఇదే మూలం. అసలు పొట్ట దగ్గర కొవ్వు ఎందుకంత ప్రమాదకరం? దానిని సురక్షితంగా, శాస్త్రీయంగా వదిలించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న ఆ ఐదు సూత్రాలేమిటి..? 

- Advertisement -

ఎందుకింత ప్రమాదం  : శరీరంలోని ఇతర భాగాల్లోని కొవ్వు కంటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, బెల్లీ ఫ్యాట్.. ‘సైటోకిన్’ అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలో వాపును కలిగించి అనేక వ్యాధులకు కారణమవుతుంది. 
అంతేకాదు, ఇది ‘ఆంజియోటెన్సిన్’ అనే మరో ప్రోటీన్‌ను పెంచి, రక్త నాళాలు మూసుకుపోయేలా చేసి, రక్తపోటుకు (BP) కారణమవుతుంది.

దిల్లీ ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివ్ కుమార్ చౌదరి మాటల్లో చెప్పాలంటే, “పొట్ట కింద కొవ్వు కణాలు విచ్ఛిన్నమైనప్పుడు, వాటి నుంచి విషపూరిత పదార్థాలు విడుదలవుతాయి. ఇవి గుండె ధమనులలో మార్పులకు కారణమై గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే, శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచి, మధుమేహానికి దారితీస్తాయి.”

పరిష్కార మార్గాలు – ఈ 5 పాటించండి: బెల్లీ ఫ్యాట్ పెరగడానికి జన్యువులు, హార్మోన్లు, వయసు వంటి కారణాలున్నా, మన జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సులభంగా నియంత్రించవచ్చు. భోజనానికి, నిద్రకు మధ్య విరామం: ఇది అత్యంత ముఖ్యమైన నియమం. రాత్రి నిద్రపోయే కనీసం 3 గంటల ముందు భోజనం ముగించాలి. పగలు తీసుకున్న ఆహారం రోజువారీ పనులకు శక్తిగా మారుతుంది. కానీ రాత్రి తిన్న వెంటనే పడుకుంటే, ఆ కేలరీలు ఖర్చుకాక కొవ్వుగా మారి పొట్ట చుట్టూ పేరుకుపోతాయి.

సమతుల ఆహారం (ఫైబర్, ప్రోటీన్): మీ ఆహారంలో పీచుపదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇది కడుపు నిండుగా ఉన్న అనుభూతినిచ్చి, త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. అలాగే, ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్లు, పప్పులు, పాలు, పెరుగు, చేపలు, చికెన్ వంటివి తీసుకోండి. ప్రోటీన్ ఆకలిని పెంచే ‘గ్రెలిన్’ హార్మోన్‌ను నియంత్రించి, జీవక్రియను వేగవంతం చేస్తుంది.

ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరం: వైట్ బ్రెడ్, చిప్స్, బేకరీ పదార్థాల వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఫైబర్ దాదాపు ఉండదు. ఇవి త్వరగా జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచుతాయి. ఇది ఆకలిని పెంచడమే కాకుండా, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. వీటికి బదులుగా పండ్లు, నట్స్, రోస్టెడ్ స్నాక్స్ తినండి.

సరిపడా నిద్ర: నిద్రలేమి ఆకలి హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం, నిద్ర సరిగ్గా లేకపోతే ఆకలిని పెంచే ‘గ్రెలిన్’ హార్మోన్ పెరుగుతుంది. ఒత్తిడి వల్ల విడుదలయ్యే ‘కార్టిసాల్’ హార్మోన్ కూడా బెల్లీ ఫ్యాట్‌కు కారణమవుతుంది. కాబట్టి రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం.

శారీరక శ్రమ: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కేలరీలు ఖర్చయి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. చురుకైన నడక, పరుగు, సైక్లింగ్, ఈత లేదా యోగా వంటివి దినచర్యలో భాగం చేసుకోండి. ఇది కొవ్వును తగ్గించడమే కాకుండా, కండరాలను బలపరిచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad