Sunday, November 16, 2025
Homeహెల్త్Reheating food : ఆహారాన్ని పదే పదే వేడి చేస్తున్నారా? మీ వంటింట్లోనే 'విషం' తయారవుతోంది...

Reheating food : ఆహారాన్ని పదే పదే వేడి చేస్తున్నారా? మీ వంటింట్లోనే ‘విషం’ తయారవుతోంది జాగ్రత్త!

Health risks of reheating food : బయటి తిండి తింటే ఫుడ్ పాయిజన్ అవుతుందని భయపడతాం. కానీ, మన ఇంట్లో, మన చేతులతో వండిన ఆహారమే మనకు అనారోగ్యం తెచ్చిపెడితే…? ఉరుకుల పరుగుల జీవితంలో, చాలా ఇళ్లల్లో రెండు, మూడు రోజులకు సరిపడా వండుకుని ఫ్రిజ్‌లో పెట్టడం, అవసరమైనప్పుడు వేడి చేసుకుని తినడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఈ అలవాటే మన ఆరోగ్యానికి ముప్పు తెస్తోందని, కొన్ని రకాల ఆహార పదార్థాలను పదే పదే వేడి చేయడం విషంతో సమానమని పోషకాహార నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అసలు ఏయే పదార్థాలను వేడి చేయకూడదు..? ఆహారాన్ని నిల్వ చేయడంలో మనం తెలియక చేస్తున్న పొరపాట్లేంటి..?

- Advertisement -

ఎందుకింత ప్రమాదకరం : వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు, దానిలో హానికరమైన బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. దానిని ఫ్రిజ్‌లో పెట్టి, మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా మరింత పెరిగి, విష పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

“వండిన ఆహారాన్ని రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టాలి. తప్పనిసరైతే ఒక్కసారి మాత్రమే వేడి చేసుకోవాలి. పదే పదే వేడిచేస్తే, ముప్పు పొంచి ఉన్నట్లే. అవసరమైనంత వరకే తీసి వేడి చేసుకోవడం ఉత్తమం.”
– సుష్మ, పోషకాహార నిపుణురాలు

ఈ పదార్థాలను తిరిగి వేడి చేయవద్దు : కొన్ని ఆహార పదార్థాలను తిరిగి వేడి చేయడం వల్ల వాటిలోని పోషకాలు నశించడమే కాకుండా, అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది.

పాలకూర: ఇందులో ఉండే నైట్రేట్లు, తిరిగి వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారకాలైన నైట్రోసమైన్‌లుగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.

అన్నం: చల్లారిన అన్నాన్ని తిరిగి వేడి చేస్తే, అందులోని ‘బాసిల్లస్ సెరియస్’ అనే బ్యాక్టీరియా విష పదార్థాలను ఉత్పత్తి చేసి, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది.

బంగాళాదుంపలు: వండిన బంగాళాదుంపలను గది ఉష్ణోగ్రతలో ఉంచితే ‘క్లోస్ట్రీడియం బోటులినం’ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. తిరిగి వేడి చేసినా ఇది నశించదు.

పుట్టగొడుగులు: ప్రోటీన్లు అధికంగా ఉండే పుట్టగొడుగులను తిరిగి వేడి చేస్తే, వాటిలోని ప్రోటీన్ల స్వరూపం మారిపోయి, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులకు దారితీయవచ్చు.

కోడిగుడ్లు, మాంసం: వీటిని పదే పదే వేడి చేయడం వల్ల వాటిలోని ప్రోటీన్లు గట్టిపడి, జీర్ణం కావడం కష్టమవుతుంది. సరిగా నిల్వ చేయకపోతే ‘సాల్మొనెల్లా’ వంటి బ్యాక్టీరియా పెరిగి, అనారోగ్యానికి కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాన్ని తినాలంటే, కనీసం 74 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, వీలైనంత వరకు ఎప్పటికప్పుడు తాజాగా వండుకుని తినడమే శ్రేయస్కరం. సమయం లేనప్పుడు, సరైన పద్ధతిలో ఆహారాన్ని నిల్వ చేసి, ఒక్కసారి మాత్రమే వేడి చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad