Facial signs of high blood sugar : మధుమేహం… నేటి ఆధునిక ప్రపంచంలో ఇది ఒక మహమ్మారి. నిశ్శబ్దంగా మన శరీరంలోకి ప్రవేశించి, నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఇది జీవితకాలం వెంటాడే ఒక దీర్ఘకాలిక వ్యాధి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పడమే ఈ అనారోగ్యానికి మూలం. సరైన సమయంలో గుర్తించకపోతే ఇది మూత్రపిండాలు, కళ్లు, గుండె వంటి కీలక అవయవాలను దెబ్బతీస్తుంది. అయితే, మన శరీరం వ్యాధి ముదరకముందే అనేక సంకేతాలను పంపిస్తుంది. ఆశ్చర్యకరంగా, మీ ముఖమే మీ ఆరోగ్యానికి అద్దం పడుతుంది. అద్దంలో చూసుకున్నప్పుడు మీ ముఖంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా…? అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అవేంటో తెలుసుకుందాం పదండి.
మధుమేహం అంటే క్లోమం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడం లేదా శరీరం ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయి. మీ ముఖంలో కనిపించే ఈ ఐదు మార్పులు దానికి సంకేతాలు కావచ్చు.
ఎర్రగా, ఉబ్బినట్లు ఉండే ముఖం: రక్తంలో చక్కెర పెరగడం వల్ల శరీరంలో వాపు (inflammation) వస్తుంది. దీని ప్రభావం ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం ఎర్రగా మారడం, ముఖ్యంగా కళ్లు మరియు బుగ్గల చుట్టూ ఉబ్బినట్లు కనిపించడం ఒక ముఖ్య లక్షణం. అధిక గ్లూకోజ్ స్థాయిలను తట్టుకోవడానికి శరీరం నీటిని ఎక్కువగా నిలుపుకోవడం వలనే ఈ వాపు వస్తుంది.
శ్వాసలో పండ్ల వాసన: రక్తంలో చక్కెర స్థాయిలు మరీ ఎక్కువైనప్పుడు, శరీరం శక్తి కోసం కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలో “కీటోన్‌లు” అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ కీటోన్‌ల వల్ల శ్వాస అసిటోన్ లేదా పండ్ల వాసన వస్తుంది. ఇది “డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (DKA)” అనే తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం. తక్షణమే వైద్య సహాయం అవసరమని దీని అర్థం.
పొడిబారి, పొరలుగా ఊడే చర్మం: అధిక రక్త చక్కెర మీ చర్మం తేమను నిలుపుకునే సహజ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మం పొడిబారి, దురద పెట్టడం, పొరలుగా ఊడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖం మీద ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా, శరీరం నిర్జలీకరణకు గురికావడం వల్ల చెమట, నూనె గ్రంథుల ఉత్పత్తి తగ్గి, చర్మం మరింత పొడిబారుతుంది.
చర్మంపై నల్లటి మచ్చలు: మెడ చుట్టూ, చంకల్లో, కొన్నిసార్లు ముఖం మీద నల్లగా, వెల్వెట్ లాంటి మృదువైన మచ్చలు కనిపిస్తున్నాయా..? దీనిని వైద్య పరిభాషలో “అకాంతోసిస్ నైగ్రికన్స్” అంటారు. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు (insulin resistance) బలమైన సంకేతం. అధిక రక్త చక్కెర స్థాయిల వల్లే ఈ ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది.
పాలిపోయిన లేదా పసుపు పచ్చ చర్మం: నిరంతరంగా రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, అధిక చక్కెర స్థాయిలు కాలేయంపై భారం మోపి, వ్యర్థాలను సరిగ్గా బయటకు పంపే దాని సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల చర్మం, ముఖ్యంగా ముఖం పాలిపోయినట్లు లేదా పసుపు రంగులోకి మారవచ్చు.


