కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. డైట్ పరంగా ఆరోగ్య వంతమైన టిప్స్ ను మొదలెట్టండి. అవేమిటంటే…
సీజనల్ గా పండే వాటిని తినాలి. లోకల్ గా పండే కూరగాయలు, పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. పాలకూర, మెంతి, బ్రొకోలీ, క్యాబేజీ వంటి ఆకుకూరలని నిత్యం మీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
ప్రోసెస్డ్ ఫుడ్ ని తినడం మానేయాలి. తాజా ఆహారపదార్థాలు తింటే ఒంటికి ఆరోగ్యం. అంతేకాదు అవి సులభంగా జీర్ణమవుతాయి కూడా. నిలవ ఆహార పదార్థాలు, ఫ్రిజ్ లో ఉంచినవి తినొద్దు. ఇంట్లో చేసిన ఆహారానికి మించిన ఆరోగ్యమైన తిండి వేరేది లేదు. బయట నుంచి ఫుడ్స్ తెప్పించుకుని తినే అలవాటును తగ్గించుకోవాలి.
మనం తీసుకునే ఆహారపదార్థాలను బాగా నమిలి మింగాలి. కానీ ఇటీవల కాలంలో ఆహారాన్ని నమిలి తింటున్నవాళ్లు చాలా తక్కువమంది ఉంటుంన్నారు. ఫుడ్ ను నమలకుండా తినడం వల్ల జర్ణక్రియ సులువుగా కాదు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల వాటిల్లోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ఆహారాన్ని నమలకుండా మింగేయడం వల్ల బరువు పెరుగుతారు కూడా.
కడుపు నిండిందన్న భావం కలిగినపుడు తినడం ఆపేయాలి. అందుకే ఆహారాన్ని తినేటప్పుడు మీ ఆకలి 80 శాతం మేర తగ్గిందనిపిస్తే తినడం ఆపేయాలి. ఇలా చేయడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. శరీరం తేలికగా ఉంటుంది కూడా. యాక్టివ్ గా ఉంటారు. వేగంగా మీ పనులు చేసుకోగలరు. బరువు పెరగరు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
మీరు తీసుకునే డైట్ లో రకరకాల ఆహార ధాన్యాలను అంటే జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగి, వరి వంటి వెరైటీలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా చేయడం వల్ల రకరకాల ధాన్యాల్లోని సూక్ష్మపోషకాలు శరీరానికి అందుతాయి. వెరైటీ ఫుడ్ తింటాం కాబట్టి డైట్ బోరుకొట్టదు.
చాలామందిలో నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. రోజులో వాటర్ తో పాటు పండ్లు, ఆకుకూరల జ్యూసులు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటివి బాగా తాగుతుండాలి.
చక్కెర, ఉప్పు వాడకాలను తగ్గించాలి. టేబుల్ సాల్ట్, వైట్ షుగర్ కి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను వాడాలి. వంటల్లో సగం టేబుల్ సాల్ట్ వాడితే సగం హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ వాడాలి. మీ డైట్ నుంచి టేబుల్ సాల్ట్ ను పూర్తిగా తీసేయడం మంచిది కాదు. అలా చేస్తే శరీరంలో ఐయొడిన్ లోపం తలెత్తే అవకాశం ఉంది. అలాగే వైట్ షుగర్ కు బదులు బెల్లం, తేనె, స్టెవియా వాడొచ్చు.