చిన్న పిల్లల దగ్గర నుంచి.. పెద్దవారి వరకూ అందరికీ చిప్స్ అంటే చాలా ఇష్టం. ఇవి ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంటుంది. అయితే ఈ చిప్స్ ప్యాకెట్లు చూడడానికి ఎంతో పెద్దవిగా కనిపిస్తాయి. కానీ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం లోపల గాలే ఎక్కువగా ఉంటుంది… చిప్స్ మాత్రం కొన్నే ఉంటాయి. నిజానికి చిప్స్ ప్యాకెట్ లో కంపెనీ వారు గాలి నింపరు.. అందులో ఓ రకమైన గ్యాస్ నింపుతారంట. అసలు చిప్స్ ప్యాకెట్ లో ఏ గ్యాస్ నింపుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చిప్స్ ప్యాకెట్ లో నైట్రోజన్ గ్యాస్ ఉంటుందని చాలా మందికి తెలియదు. దీని కారణంగానే ప్యాకెట్ లోపల ఉండే చిప్స్ క్రంచీగా ఉంటాయి. అంతేకాదు చిప్స్ రోజులపాటు నిల్వ ఉంటాయి. వాటిని నార్మల్గా ప్యాక్ చేస్తే బ్యాక్టీరియా వ్యాపించి అవి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపుతారు. దీనివల్ల ప్యాకెట్లోకి బ్యాక్టీరియా లాంటి కుళ్లబెట్టే క్రిములు చొరబడకుండా ఉండటంతోపాటు వినియోగదారుడికి ప్యాకెట్ పెద్ద సైజులో కనిపిస్తుండడంతో.. వీటిని తయారు చేసే కంపెనీలు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి.
నైట్రోజన్ అనేది ఒక జడవాయువు. అందువల్ల ఈ వాయువు ఉన్నచోట బ్యాక్టీరియా సంబంధిత జీవులు ఉండవు. అంతేకాదు ఈ వాయువు కారణంగా నీటి ఆవిరి కూడా ఉండదు.. ఫలితంగా చిప్స్ కరకరలాడుతూ ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. ఒకవేళ నైట్రోజన్కు బదులుగా ఆక్సిజన్ నింపితే ఏమవుతో ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్సిజన్ అనేది ఆహారంలోని పదార్థాలతో చర్య జరిపే గుణం ఉంటుంది. కాబట్టి చిప్స్ ప్యాకెట్లలో ఆక్సిజన్ నింపితే.. అవి త్వరగా పాడైపోతాయి. అందుకే చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ అనే జడవాయువును నింపుతారు.
చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపడం వెనుక మరో కారణం కూడా ఉంది. ప్యాకెట్లలో గాలి లేకపోతే ట్రాన్స్పోర్ట్ టైమ్లో.. అవి చిన్న చిన్న ముక్కలుగా చిదిగిపోయే అవకాశం ఉంది.. కాబట్టి రవాణా సౌలభ్యం కోసం కూడా గ్యాస్ లేదా గాలి నింపుతారు.