Dry Fruits Water For immunity: ఈరోజుల్లో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలు. అయితే, ఏదైనా అనారోగ్య సమస్యకు గురైతే మన శరీర రోగనిరోధక శక్తి బలంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంది. ఒకవేళ ఇది బలహీనపడితే జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, మన శరీర రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సులభమైన, అత్యంత సహజమైన మార్గం ఏమిటంటే? తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం! ఇవి అనేక ఆరోగ్య లాభాలను అందిస్తాయి. డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండ తీసుకుంటే రోజంతా శక్తివంతంగా, చురుగా ఉండవచ్చు. ఈ క్రమంలో డ్రై ఫ్రూట్స్‌ను ఎందుకు నానబెట్టాలి తీసుకోవాలి? వాటిని తరచుగా తింటే కలిగే ప్రయోజనాలేమిటి? ఆహారంలో ఎలా చేర్చుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డ్రై ఫ్రూట్స్‌ను ఎందుకు నానబెట్టాలి?
చాలా మంది తెలియక డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా తింటుంటారు. కానీ, వాటిని నానబెట్టి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నానబెట్టడం వల్ల డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇది పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తర్వాత తినేటప్పుడు లేదా నీటిని త్రాగినప్పుడు శరీరం విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల పూర్తి ప్రయోజనాలను పొందుతుంది. ఇది రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచే 5 డ్రై ఫ్రూట్స్ వాటర్స్
బాదం నీరు: బాదంపప్పులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మనస్సును పదును పెట్టడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రాత్రిపూట 5 నుండి 6 బాదంపప్పులను నానబెట్టాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగి, మిగిలిన బాదం పప్పులు తినవచ్చు.
వాల్‌నట్స్ నీరు: వాల్‌నట్స్ డ్రింక్ కోసం రాత్రిపూట 2 వాల్‌నట్స్ నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తిని, ఆ నీటిని తాగవచ్చు. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అంతేకాకుండా వాపును తగ్గించడం, రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
ఎండుద్రాక్ష నీరు: ఎండుద్రాక్షలు ఐరన్, విటమిన్ సి గొప్ప నిధి. ఈ రెండు పోషకాలు రక్త గణనలను పెంచడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. వీటి నీరు జీర్ణక్రియకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండుద్రాక్ష నీరు కోసం ఒక కప్పు నీటిలో 8 నుండి 10 ఎండుద్రాక్షలను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే వాటిని నమిలి, మిగిలిన నీటిని తాగాలి/.
అంజీర్ పండ్లు నీరు: అంజీర్ పండ్ల నీరు కోసం రాత్రిపూట 2 ఎండిన అంజూర పండ్లను నానబెట్టాలి. ఉదయం ఈ నీటిని తాగి, అంజీర్ పండ్లు తినాలి. దీని వల్ల కడుపు శుభ్రపడుతుంది. అత్తి పండ్లలో ఫైబర్, పొటాషియం, అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. అవి ముఖ్యంగా పేగు ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే శరీర రోగనిరోధక శక్తిలో ఎక్కువ భాగం ప్రేగులపై ఆధారపడి ఉంటుంది.
నల్ల ఎండుద్రాక్ష నీరు: నల్ల ఎండుద్రాక్షలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అవి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. ఇది వ్యాధితో బాగా పోరాడటానికి వీలు కల్పిస్తుంది. రాత్రిపూట 5 నుండి 7 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. ఉదయం వాటి నీటిని తాగి, ద్రాక్షలను తినాలి. ఇలా నల్ల ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కాలానుగుణ వ్యాధుల నుండి దూరం ఉండవచ్చు.
డ్రై ఫ్రూట్స్ వాటర్ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?
ఐదు డ్రై ఫ్రూట్స్ (బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్ష, అంజూర పండ్లు, నల్ల ఎండిన ద్రాక్ష) కొద్ది మొత్తంలో వీటిని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ముందుగా ఈ నీరు తాగాలి. ఆపై మిగిలిన డ్రై ఫ్రూట్స్ నమిలి తినాలి. ఈ అలవాటు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


