International Stress Awareness Week : ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది సర్వసాధారణ పదం. విజయం సాధించాలంటే ఒత్తిడి తప్పదని, అదొక గౌరవ చిహ్నమని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఈ ఆలోచనా విధానమే అత్యంత ప్రమాదకరమని, ఒత్తిడి ఒక నిశ్శబ్ద మహమ్మారిలా ప్రపంచాన్ని కబళిస్తోందని ప్రముఖ ఆస్ట్రేలియన్ మానసిక నిపుణురాలు, ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పతక గ్రహీత డాక్టర్ లీసా ఫేహే తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఒత్తిడి అవగాహన వారోత్సవం (నవంబర్ 3-7) సందర్భంగా ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు మనల్ని ఆలోచింపజేస్తున్నాయి. అసలు ఒత్తిడి మన ఆరోగ్యంపై ఎంతటి పెను ప్రభావాన్ని చూపిస్తుంది…? దానిని కేవలం ఒక అవగాహన వారోత్సవంతో సరిపెట్టవచ్చా…?
ఒత్తిడి.. కీర్తించాల్సిన విషయం కాదు : ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, కార్యాలయాలపై ఒత్తిడి పెను ప్రభావాన్ని చూపుతోందని, ఇదొక మహమ్మారిలా విస్తరిస్తోందని డాక్టర్ లీసా ఫేహే ఆందోళన వ్యక్తం చేశారు. “అంతర్జాతీయ ఒత్తిడి అవగాహన వారం, మనం ఎదుర్కొంటున్న ఈ తీవ్ర సమస్యను మరోసారి గుర్తుచేస్తోంది. మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడంలో మన సంస్కృతిలో ఇప్పటికీ ఒకరకమైన సంకోచం కనిపిస్తోంది. చాలా తరచుగా, ఒత్తిడిని ఒక సాధారణ విషయంగా లేదా విజయం సాధించాలంటే తప్పనిసరి అని కీర్తించడం చూస్తున్నాం. కానీ, దాని దీర్ఘకాలిక దుష్ప్రభావాలు మనల్ని మౌనంగా కబళిస్తాయి,” అని ఆమె అన్నారు.
కేవలం మానసికం కాదు.. శారీరకం కూడా : ఒత్తిడి కేవలం మానసిక అలసటకు మాత్రమే పరిమితం కాదని, అది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు నేరుగా కారణమవుతోందని డాక్టర్ ఫేహే స్పష్టం చేశారు. “నేటి ఒత్తిడి, మధుమేహం (షుగర్), గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. సంస్థలు మానసిక శ్రేయస్సును కేవలం పేరుకు మాత్రమే చేపట్టే కార్యక్రమంగా కాకుండా, తమ ప్రధాన వ్యూహాత్మక ప్రాధాన్యతగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది,” అని ఆమె పిలుపునిచ్చారు.
ఎవరీ డాక్టర్ లీసా ఫేహే : డాక్టర్ లీసా ఫేహే ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ మనస్తత్వవేత్త, పారిశ్రామికవేత్త & మానసిక ఆరోగ్య ఆవిష్కర్త. వైద్య రంగంలో ఆమె చేసిన సేవలకుగాను, 2023లో ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ‘మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ (OAM)తో సత్కరించబడ్డారు. మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, మద్దతునిచ్చే టెక్నాలజీ ఆధారిత వేదిక ‘గివ్ మీ ఫైవ్’ (GM5) వ్యవస్థాపకురాలు & సీఈఓ కూడా ఈమె. భారతదేశంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలకు సేవలందిస్తూ, GM5 తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.
అవగాహన ఒక్కటే సరిపోదు : “ఒత్తిడి ఒక గౌరవ చిహ్నం లేదా విజయానికి తప్పనిసరి అనే మనస్తత్వం నుండి మనం సమిష్టిగా బయటపడాలి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని కేవలం అవగాహన దినోత్సవాలతో పరిష్కరించలేం. దీనికి నాయకుల నిజాయితీతో కూడిన ఆత్మపరిశీలన, ఆలోచనాత్మక విధాన మార్పులు, ప్రతి ఒక్కరి శ్రేయస్సును వాస్తవరూపంలోకి తీసుకురావడానికి దృఢమైన, నిరంతర నిబద్ధత అవసరం,” అని డాక్టర్ లీసా ఫేహే వివరించారు.


