Drinking these 3 drinks will prevent diabetes: ఈ రోజుల్లో షుగర్ వ్యాధి సర్వసాధారణంగా మారింది. పెద్దలే కాదు చిన్న వయస్సులోని వారు సైతం షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది క్రమంగా అనేక ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. డయాబెటిస్ రోగులకు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడం చాలా కీలకం. ఈ విషయంలో కొన్ని మూలికా పానీయాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి గ్లూకోజ్ శోషణను తగ్గించడం ద్వారా రక్తంలో షుటర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. ఈ మూడు ఆరోగ్యకరమైన పానీయాలను దినచర్యలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్‌ను తగ్గించుకోవచ్చు. ఈ పానీయాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. రక్తంలో అధిక చక్కెర అదుపులో ఉండేందుకు 3 పానీయాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
అధిక రక్త చక్కెర అదుపు చేసే పానియాలు
మెంతుల నీరు
శరీరంలో పెరుగుతున్న చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి మెంతుల నీరు అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటిక్ రోగులకే కాకుండా.. ప్రీ-డయాబెటిక్ వారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. మెంతులు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. భోజనం తర్వాత చక్కెర శోషణను నెమ్మదించేలా చేస్తాయి. తద్వారా రక్త చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. దీనికోసం ఒకటి, రెండు టీస్పూన్ల మెంతులను రాత్రిపూట నానబెట్టండి. ఉదయం ఆ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి.
కాకరకాయ రసం
కాకరకాయ ఎంత చేదుగా ఉంటే.. అది శరీరానికి అంత ఆరోగ్యకరం. ఇందులో ఉండే యాంటీ-డయాబెటిక్ గుణాలు మధుమేహానికి ఔషధంలా పనిచేస్తాయి. కాకరకాయలో ఉండే చరాంటిన్, పాలిపెప్టైడ్-పి అనేవి ఇన్సులిన్ మాదిరిగానే పనిచేసి.. శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. కాకరకాయను చిన్న ముక్కలుగా చేసి.. నీటితో కలిపి మిక్సీలో బ్లెండ్ చేయాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి పరగడుపున తాగాలి.
దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్క టీ తాగడం వలన భోజనం తర్వాత చక్కెర స్థాయిల్లో వచ్చే పెరుగుదల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలోని సిన్నమాల్డిహైడ్ అనే పదార్థం ఇన్సులిన్ మాదిరిగానే పనిచేసి.. శరీర చక్కెర నియంత్రణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని కోసం ఒకటి లేదా రెండు దాల్చిన చెక్క ముక్కలను మరిగే నీటిలో వేసి నానబెట్టండి. కొన్ని నిమిషాల తర్వాత వడకట్టి కప్పులో పోసి తాగండి. చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి భోజనం తర్వాత దీనిని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.


