రాగి పాత్రలో నీటిని తాగడం కొత్త కాదు.. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో రాగిపాత్రల వాడకం ఉంది. అయితే ఆధునిక కాలంలో చాలా మంది స్టీల్, ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు తాగుతున్నారు. భారతీయ సంప్రదాయంలో రాగి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు దాని ట్రెండ్ కూడా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ చాలా మంది రాగిపాత్రలో నీళ్లు తాగడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే రోజూ రాగిపాత్రలో నీళ్లు తాగడం మంచిదేనా.. దీని వళ్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా.. వైద్యులు ఏమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పెద్దలు చెపుతుంటారు. రాగి పాత్రలు, బాటిళ్లలో నీరు తాగే వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. ఎందుకంటే
యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న లోహం ఏదైనా ఉందంటే అది రాగి. అందుకే చాలా మంది స్కూల్, ఆఫీస్ లకు రాగి బాటిళ్లలో నీటిని పోసుకొని తీసుకు వెళ్తున్నారు. అయితే రాగి సీసా లేదా పాత్రలోని నీటిని రోజూ తాగడం ఆరోగ్యానికి ప్రయోజనమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
నిజానికి రాగి బాటిళ్ల నుండి నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రాగి సీసాలోని నీటిని తాగడం వల్ల బరువు తగ్గడం, జుట్టు బలపడటం, రక్తపోటు నియంత్రణ, మెరిసే చర్మం, రక్తహీనను నివారించడం.. వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ కొన్ని పద్ధతులు పాటించకపోతే.. రాగి పాత్రలోని నీరు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా రాగి పాత్రలో పోసిన నీరు నాలుగైదు గంటల తర్వాత తాగాలి. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీరు మాత్రమే తాగితే గరిష్టంగా 12 గంటల పాటు ఉంచిన నీటిని తాగవచ్చు. కానీ ఎక్కువ సేపు బాటిల్ లో నీటిని ఉంచి అదే నీటిని నిరంతరం తాగడం వల్ల శరీరంలో రాగి పరిమాణం పెరిగి అనారోగ్యానికి గురవుతారు.
మరోవైపు ఇటీవల కాలంలో రాగి పాత్రల వినియోగం పెరగడంతో కల్తీ సీసాలు, పాత్రలు కూడా మార్కెట్ లోకి వచ్చేసాయి. నకిలీ గాళ్లు రాగికి బదులు వేరొక లోహాన్ని ఉపయోగించి పాత్రలు, బాటిల్స్ తయారు చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. మీరు రాగి బాటిల్ కొంటుంటే, జాగ్రత్తగా ఆలోచించి మంచి బ్రాండ్ కోవడం మంచిది. ఇక సీసాను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే.. అది మిమ్మల్ని ఆసుపత్రికి చేరుస్తుంది. అందుకే రాసి సీసాను ఉపయోగిస్తే దానిని ప్రతి రోజూ సరిగ్గా శుభ్రం చేసుకోవాలి.
ముఖ్యంగా బాటిల్ పైభాగం చాలా చిన్నదిగా ఉంటుంది.. అక్కడ శుభ్రం చేయడం కష్టం. ఒక్కోసారి ఇదికూడా మిమ్మలిని అనారోగ్యానికి గురి చేయవచ్చు. కాబట్టి బాటిల్ కొనేటప్పుడు, అది వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల దానిని సుభ్రం చేయడం సులభం అవుతుంది. ఈ చిన్న చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకోకపోతే.. తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు. ఫాలో అయ్యే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోండి.)