Friday, November 22, 2024
Homeహెల్త్Drinks for Glamour: గ్లామర్ కోసం ఇవి తాగండి

Drinks for Glamour: గ్లామర్ కోసం ఇవి తాగండి

ఇంట్లో ఫ్రెష్ గా చేసుకుని తాగండి

సొగసుకు స్కిన్ డైట్ డ్రింకులు

- Advertisement -

మెరిసే చర్మం కావాలా? అయితే స్కిన్ డైట్ చేయాల్సిందే. అదేమిటో తెలుసుకోవాలనుందా? స్కిన్ ను పట్టులా మెరిపించే ఆరు బెస్ట్ డ్రింక్స్ తాగితే పట్టులాంటి మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.


చర్మం మెరియడానికి, కాంతివంతంగా ఉండడానికి చాలామంది కాస్మొటిక్ క్రీమ్స్ వాడుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చర్మం లోపలి నుంచీ మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ ఆరు హెల్దీ డ్రింకులూ మీ స్కిన్ డైట్ లో ఉండాలి.

అలాంటి హెల్దీ, స్కిన్ బ్యూటీ డ్రింకే టర్మరిక్ షాట్స్. పసుపులో యాంటిబాక్టీరియల్, యాంటి ఫంగల్ గుణాలు ఉన్నాయి. అందుకే పసుపు స్కిన్ టోన్ ను బాగా మెరుగుపరుస్తుంది. దీనివల్ల చర్మ కాంప్లెక్షన్ కూడా మెరుపులు చిందుతుంటుంది. చర్మానికి సహజమైన మెరుపును టర్మరిక్ షాట్స్ ఇస్తాయి. దీని తయారీకి కేరట్, పసుపు వేరు,ఆమ్లా, నీళ్లు, మిరియాలు (ఆప్షనల్) రెడీ పెట్టుకోవాలి. దీన్ని సులభంగా చేయొచ్చు. కేరట్లు, పసుపు వేరు, ఉసిరి మూడింటినీ నీళ్లల్లో బాగా కడగాలి. టర్మరిక్ షాట్ తయారుచేసే ముందు వీటిని అరగంట పాటు నీళ్లల్లో నానబెట్టాలి. ఆతర్వాత ఆమ్లాను, కేరట్లను ముక్కలుగా తరిగి ఒక బౌల్ లో వేయాలి. టర్మరిక్ రూట్ పై ఉండే తొక్కను తీసేసి సన్నటి ముక్కలుగా తరగాలి. తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నీళ్లతో పాటు పసుపు వేరు ముక్కలు, ఉసిరి, కేరట్ ముక్కలను వేసి మెత్తటి పేస్టులా
చేయాలి. ఆ పేస్టును వొడగట్టి దాని నుంచి వచ్చిన నీరును తాగాలి. కేరట్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి. పసుపు ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఉసిరిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.


చర్మాన్ని మెరిపించే మరో హెల్దీ డ్రింకు బీట్ రూట్ రసం. ఈ దుంపలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. డల్ స్కిన్ ను సైతం మెరిపించే ప్రత్యేకత బీట్ రూట్ జ్యూసులో ఉంది. దానిమ్మ ఆరోగ్యవంతమైన చర్మాన్ని ఇస్తుంది. ఇక అల్లం ముక్క మీ జీర్ణశక్తిని బాగా పనిచేసేలా సహాయపడుతుంది. ఈ డ్రింకు తయారుచేయాలంటే బీట్ రూట్, అంగుళం సైజు అల్లం ముక్క, దానిమ్మ గింజలు రెడీ పెట్టుకోవాలి. ఈ డ్రింకును తయారుచేసే ముందర దానిమ్మ, బీట్ రూట్లను కుళాయి నీళ్లతో శుభ్రంగా కడగాలి. పచ్చిదనంతో కూడిన డ్రింకు తాగుతాము కాబట్టి అందుకు ఉపయోగించే వాటిలో మట్టి, మలినాలు అస్సలు ఉండకుండా జాగ్రత్తపడాలి. కడిగిన బీట్ రూట్ పై ఉండే తొక్కును గీకేసి కొద్దిగా మందమైన ముక్కలుగా కట్ చేయాలి. అలాగే అల్లం పైనుండే పొట్టును కూడా తీసేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. దానిమ్మను ఒలిచి గింజలన్నింటినీ విడిగా ఒక గిన్నెలో వేయాలి. మిక్సర్ బ్లెండర్ తీసుకుని అందులో రెడీ పెట్టుకున్న అన్ని పదార్థాలను వేసి వాటితో పాటు ఒక కప్పు చల్లటి నీళ్లను కూడా మిక్సర్ బ్లెండర్ లో వేయాలి. దాన్ని రసంగా చేసి ఒడగట్టి తాగాలి.

పసుపు కలిపిన మచ్చా టీ కూడా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఇందులో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మం ఎంతో మెరుపును సంతరించుకుంటుంది. అంతేకాదు యాక్నే సమస్య కూడా పోతుంది. దీన్ని తయారుచేయడానికి మచ్చా పొడి కావాలి. అలాగే పసుపుపొడి, మిర్యాలపొడి (ఆప్షనల్), నీళ్లు, నాన్ డయిరీ మిల్క్, స్వీట్నర్ ( మీ ఛాయిస్) లను రెడీ పెట్టుకోవాలి. తేనె, బెల్లం, సిరప్, మాపిల్ సిరప్, జింజర్ సిరప్, ఖర్జూరం సిరప్ వంటివేటినైనా స్వీట్నర్ గా ఈ డ్రింకులో వాడొచ్చు. అలాగే నాన్ డయిరీ మిల్క్ అంటే జీడిపప్పు పాలు,
బాదం పాలు, ఓట్స్ పాలు,కొబ్బరిపాల వంటివేవైనా వాడొచ్చు. దీన్ని తయారు చేయడానికి ఒక కప్పు మొదట తీసుకోవాలి. అందులో మచా, పసుపు పొడులను వేయాలి. వాటితోపాటు చిటికెడు మిరియాలపొడి, కొద్దిగా నీళ్లు కూడా వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపాలి. అందులో పైన చెప్పిన నాన్ డెయిరీ పాలల్లో మీకు నచ్చిన పాలను కలపాలి. మీ ఛాయిస్ స్వీట్నర్ ను కూడా అందులో కొద్దిగా చేర్చి మళ్లీ కలపాలి. ఇక ఆ డ్రింకును తాగుతూ ఎంజాయ్ చేయడమే తరవాయి.


చర్మాన్ని మృదువుగా చేసేదే బ్రేక్ ఫాస్ట్ డ్రింకు. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ డ్రింకు అయిన ఓట్స్, నట్ స్మూదీ కొలాజిన్ ను పెంచి చర్మాన్ని స్మూద్ గా చేస్తుంది. దీనివల్ల చర్మం ఎలాస్టిసిటీ దెబ్బతినదు. ఈ డ్రింకు తయారుచేయడానికి ఓట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, జీడిపప్పులు, ఖర్జూరాలు, నీళ్లు రెడీ పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన అన్ని పదార్థాలు వేసి అందులో నీళ్లు పోసి రాత్రంతా వాటిని నానబెట్టాలి. ఆ మర్నాడు ఉదయం ఆ గింజల్లో ఉన్న నీళ్లను ఒంపేసి వాటిని బ్లెండర్ లో వేయాలి. అందులో ఒక గ్లాసుడు నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి. మెత్తగా నోరూరించే స్మూదీ రెడీ. ఈ స్మూదీలో ఉపయోగించిన ఓట్స్ లో పోషకాలు ఉన్నాయి. అవిసె గింజల్లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజల్లో జింకు అధిక పాళ్లల్లో ఉంది. బొప్పాయి, కీర, నిమ్మ మూడింటి మిక్స్డ్ జ్యూసు కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

బొప్పాయిని చర్మానికి రాసుకోవడమే కాదు మెరిసే చర్మం కోసం దాంతో బ్యూటీ డ్రింకు కూడా చేసుకోవచ్చు. బొప్పాయిలోని ఎంజైములు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. తేమను అందిస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. కీర చర్మాన్నికి కావలసిన సాంత్వనను అందిస్తుంది. నిమ్మ శరీరం లోపల, బయట కూడా మలినాలు లేకుండా శుభ్రం చేస్తుంది. ఆరోగ్యమైన చర్మం కావాలంటే ఈ డ్రింకు తాగాల్సిందేనంటున్నారు బ్యూటీ నిపుణులు సైతం. ఈ డ్రింకు తయారీ కోసం రెండు బొప్పాయి ముక్కలు, సగం కీరకాయ, నాలుగైదు చుక్కల నిమ్మరసాన్ని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత రెండు బొప్పాయి ముక్కలను తీసుకుని చిన్న ముక్కలుగా తరగాలి. అలాగే కీరకాయ పైతొక్కను తీసేసి సన్నని చిన్న ముక్కలుగా దాన్ని కట్ చేయాలి. రెండు కప్పుల నీరు బ్లెండర్ లో వేసి అందులో కీర, బొప్పాయి ముక్కలను వేసి బ్లెండ్ చేయాలి. దాని రసాన్ని వొడగట్టి గాజు గ్లాసులో పోసి అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసాన్ని రుచికోసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దాన్ని తాగాలి.


చర్మం అందంతో, ఆరోగ్యంతో మెరిసిపోయేలా చేసే మరో డ్రింకే చెర్రీ, అలొవిరా జ్యూసు. అలొవిరా చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. అలొవిరాలో చర్మాన్ని మృదువుగా చేసే గుణంతో పాటు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే సుగుణాలు కూడా ఎక్కువ. ఇది సన్ బర్న్స్, బ్రేకవుట్స్ బాధ నుంచి ఉపశమనం
ఇస్తుంది. అంతేకాదు అలొవిరా జ్యూసు రోగనిరోధక వ్యవస్థకు ఎంతో సాంత్వననివ్వడమే కాదు చర్మం లోపల, బయట కూడా ఆరోగ్యంగా ఉండేలా పరిరక్షిస్తుంది. ఈ డ్రింకు తయారు చేయడానికి అలొవిరా జెల్ రెండు టేబుల్ స్పూన్లు, ఐదు నుంచి ఎనిమిది చెర్రీలు, మూడు కప్పుల నీళ్లు రెడీ పెట్టుకోవాలి. అలొవిరా జెల్, చెర్రీ పళ్ల (గింజలు లేకుండా) కు కొద్దిగా నీళ్లను జోడించి బ్లెండర్ లో బాగా మెత్తగా చేయాలి.
గాజు గ్లాసులో ఆ జ్యూసును పోయాలి. ఫ్లేవర్ కోసం చిటికెడు అల్లం లేదా నిమ్మ చుక్కలను అందులో వేసుకోవచ్చు.

ఇంకేముంది మీ చర్మంతో పాటు మీకెంతో సాంత్వననిచ్చే అలువిరా జ్యూసు ను ఎంజాయ్ చేస్తూ తాగడమే తరువాయి. ఈ ఆరు జ్యూసులను తాగి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News