Dry Cough vs. Wet Cough: పగలు పని చేసుకోనివ్వదు… రాత్రి హాయిగా నిద్రపోనివ్వదు. దగ్గు పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. ఉపశమనం కోసం వంటింటి చిట్కాలు, గూగుల్‌లో మార్గాలు వెతకడం సహజమే. అయితే, అన్ని దగ్గులూ ఒకే గాటన కట్టేవి కావంటున్నారు నిపుణులు. మీది పొడి దగ్గా? లేక కళ్లెతో కూడిన తడి దగ్గా? ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోతే, మీరు తీసుకునే చికిత్స కూడా దారితప్పే ప్రమాదం ఉంది. ఇంతకీ ఈ రెండింటిని ఎలా గుర్తించాలి? ఏది ప్రమాదకరం? ఎప్పుడు వైద్యుడి వద్దకు పరుగెత్తాలి? వివరంగా తెలుసుకుందాం.
దగ్గు అనేది శరీరంలో ఏదో సమస్య ఉందని చెప్పే ఒక ముఖ్యమైన సూచన. అది పొడి దగ్గా లేక తడి దగ్గా అనేదాన్ని బట్టి, దానికి ఇంట్లోనే చికిత్స సరిపోతుందా లేక వైద్యుడిని సంప్రదించాలా అనేది నిర్ణయించుకోవచ్చు.
పొడి దగ్గు vs తడి దగ్గు: తేడా ఏంటి :
పొడి దగ్గు (Non-productive Cough): ఈ రకం దగ్గులో కళ్లె (శ్లేష్మం) పడదు. గొంతులో ఏదో అడ్డుపడినట్టు, దురదగా, గీరినట్టుగా ఉండి పదేపదే దగ్గు వస్తుంది.
తడి దగ్గు (Productive Cough): ఈ దగ్గుతో పాటు కళ్లె లేదా శ్లేష్మం బయటకు వస్తుంది. ఊపిరితిత్తులలో లేదా శ్వాసనాళాల్లో చేరిన ఇన్‌ఫెక్షన్‌ను, మలినాలను శరీరం బయటకు పంపే ప్రయత్నంలో ఈ దగ్గు వస్తుంది.
కారణాలు వేరు… చికిత్సలు వేరు : ఈ రెండు రకాల దగ్గులకు కారణాలు వేర్వేరుగా ఉంటాయి.
పొడి దగ్గుకు కారణాలు: Clevelandclinic ప్రకారం, పొడి దగ్గు రావడానికి ముఖ్య కారణాలు:
అలర్జీలు, గొంతులో ఇన్‌ఫెక్షన్ (వాపు).
ఉబ్బసం (ఆస్తమా).
యాసిడ్ రిఫ్లక్స్ (గ్యాస్ట్రిక్ సమస్య).
కొన్నిసార్లు బ్రోన్కైటిస్ ప్రారంభ దశలో కూడా పొడి దగ్గు ఉంటుంది.
తడి దగ్గుకు కారణాలు:
జలుబు, ఫ్లూ, కొవిడ్-19 వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు.
బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు.
సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్).
కొన్నిసార్లు జలుబు వంటి సమస్యలు తడి దగ్గుతో మొదలై, ఇన్‌ఫెక్షన్ తగ్గాక కూడా శ్వాసనాళాల్లోని వాపు కారణంగా పొడి దగ్గుగా మారి కొన్ని వారాలు లేదా నెలల పాటు వేధించవచ్చు.
ఇంటి చిట్కాలతో ఉపశమనం : దగ్గు ఏ రకమైనదైనా, కొన్ని సాధారణ చిట్కాలు గొంతుకు ఉపశమనం కలిగించి, చికాకును తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం. గొంతులో గరగర తగ్గడానికి నేరుగా ఒక చెంచా తేనె తీసుకోవడం. పుష్కలంగా నీరు, ద్రవపదార్థాలు తాగడం వల్ల కళ్లె పలచబడి సులభంగా బయటకు వస్తుంది. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం అని Medlineplus అధ్యయనం పేర్కొంది.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి : సాధారణంగా దగ్గు అనేది శరీరపు రక్షణ చర్యే. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం దాన్ని అశ్రద్ధ చేయడం అత్యంత ప్రమాదకరం. National Library of Medicine అధ్యయనం ప్రకారం, చాలా దగ్గులు వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తాయి, కానీ కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాలి:
దగ్గు మూడు వారాలకు మించి తగ్గకపోవడం.
దగ్గుతో పాటు రక్తం లేదా గులాబీ రంగు కళ్లె పడటం. తీవ్రమైన జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాసం. ఖంగు ఖంగుమని ఆగకుండా దగ్గు రావడం.
నాలుగేళ్లలోపు పిల్లలు దగ్గుతో బాధపడుతుంటే, సొంత వైద్యం చేయకుండా తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించాలి. వైద్యులు దగ్గుకు అసలు కారణాన్ని నిర్ధారించి, సరైన చికిత్సను అందిస్తారు. అవసరమైతే పొడి దగ్గును అణచివేసే మందులు (Suppressants) లేదా తడి దగ్గుకు కళ్లెను బయటకు పంపే సిరప్‌లు (Expectorants) సూచిస్తారు.


