Thursday, September 19, 2024
Homeహెల్త్Dry fruits: డ్రైఫ్రూట్స్ చలికాలంలో వెచ్చనైన డైట్...

Dry fruits: డ్రైఫ్రూట్స్ చలికాలంలో వెచ్చనైన డైట్…

డ్రై ఫ్రూట్స్ శరీర ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే చలికాలంలో వీటిని తింటే శరీరానికి కావలసినంత వెచ్చదనం అందుతుందిట. అంతేకాదు ఈ సీజన్ లో తలెత్తే రకరకాల జబ్బుల బారిన పడకుండా కూడా ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయట. శరీర రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్ కూడా ఈ డ్రైఫ్రూట్స్. వీటిల్లో శరీరానికి ఎనర్జీని అందించే ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్నాయి.

- Advertisement -

ప్రొటీన్, విటమిన్లు ఎన్నో డ్రైఫ్రూట్లల్లో ఉన్నాయి. అన్ని రకాల నట్స్ ఒకే రకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అందుకే వెరైటీ నట్స్ అన్నింటినీ కలిపి డ్రైఫ్రూట్స్ అంటుంటారు. రోజూ తినే ఆహారంలో డ్రైఫ్రూట్స్ ను కూడా చేర్చడం వల్ల బరువు తగ్గుతారు. ఫ్రైడ్స్ ఫుడ్స్ కు ఇవి బలమైన ప్రత్యామ్నాయం. తినడానికి కూడా ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కొద్దిగా తింటే చాలు కడుపు నిండినట్టు ఉంటుంది.

వీటిల్లోని న్యూట్రియంట్స్ ఇన్ఫెక్షన్స్ పై శక్తివంతంగా పోరాడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియ బాగా జరిగేట్లు సహకరిస్తాయి. డ్రైఫ్రూట్లు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. బరువు బాగా పెరుగుతారు. అంతేకాదు రకరకాల అనారోగ్య సమస్యలు సైతం చుట్టుముడతాయి.

డ్రైఫ్రూట్లలో కిస్మిస్ లు ఒకటి. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. స్వీట్లు ఇష్టం పడేవారికి ఇవి బాగా నచ్చుతాయి. ఈ కిస్మిస్లు సహజమైన తీపిని కలిగి ఉండి రుచిగా ఉంటాయి. వీటిల్లో కాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. డయటరీ ఫైబర్ వీటిల్లో ఎక్కువ ఉండి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను ఇవి తగ్గిస్తాయి.

వీటిల్లో ఐరన్, కాల్షియంలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకలు బలంగా తయారవడమే కాకుండా ఆస్టియోపొరాసిస్ లాంటి జబ్బుల బారిన తొందరగా పడము. వీటిల్లో షుగరు, కాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ పరిమాణంలో తినాలి. పెరుగు, సెరియల్స్, ఓట్స్, బ్రెడ్, కుకీస్ లో కూడా వీటిని వేసుకుని తినొచ్చు. డ్రైఫ్రూట్స్ లో మరోది ఎండు ఖర్జూరం. వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఇతర న్యూట్రియంట్స్ చాలా ఉన్నాయి. మధుమేహ నియంత్రణలో, కాన్సర్ నిరోధించడంలో, జీర్ణిక్రియ సరిగా జరిగేలా చేయడంలో ఇవి బాగా పనిచేస్తాయి.

శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి. ప్రొటీన్ బార్స్ లో డ్రైడ్ డేట్స్ వాడతారు. వీటిల్లో కాలరీలు ఎక్కువగా ఉన్నా ఎక్కువ పీచు ఉండడంతో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డైట్ లో రెండు లేదా మూడు ఖర్జూరాలు తినొచ్చు. తీపి తినాలనే మీ కోరికను కూడా ఇవి తీరుస్తాయి.

పిస్తాలలో ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. పొటాషియం కూడా బాగా ఉంటుంది. యాంటాక్సిడెంట్స్ ప్రభావం కూడా వీటిల్లో ఉంది. గుండెకు ఇవి ఎంతో మంచిది. జీర్ణశక్తికి పిస్తాలు ఎంతో మంచిది. వీటిని తినడం వల్ల శరీరంలో లాభకరమైన బాక్టీరియా పెరుగుతుంది. శరీర బరువు తగ్గడంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి. వీటిల్లోని ప్రొటీన్, పీచుపదార్థాల వల్ల కొద్దిగా తింటే చాలు కడుపునిండుగా ఉంటుంది. సోడియం కూడా వీటిల్లో ఉంటుంది కాబట్టి పరిమితికి మించి వీటిని తినకూడదు. డెసర్టులు, ఐస్ క్రీములపై డ్రెస్సింగ్ కు వీటిని వాడతారు.

డ్రైఫ్రూట్లలో మరో ముఖ్యమైంది జీడిపప్పులు. వీటిల్లో ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇవి శరీరారోగ్యానికి ఎంతో మంచివి. వీటిల్లో మెగ్నీషియం, కాపర్, మాంగనీసు ఉంటాయి. ఇవి బ్రెయిన్ చురుగ్గా పనిచేసేలా తోడ్పడతాయి. ఎముకలను శక్తివంతంగా మలుస్తాయి. రోగనిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. జీడిపప్పుల్లో యాంటాక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఇవి రకరకాల జబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కాపడతాయి. గుండె ఆరోగ్యానికి ఇవి మంచిది. మంచి కొలెస్ట్రాల్

ను శరీరంలో పెంచుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. వీటిని తింటే శరీరానికి ఎంతో ఎనర్జీ అందుతుంది. వీటిని సూప్స్, సలాడ్స్, స్వీట్లు, రకరకాల వంటకాలు, బిర్యానీల్లో ఉపయోగిస్తారు. కప్పులో నాల్గవ వంతు జీడిపప్పుల్లో 170 కాలరీలు ఉంటాయి. పచ్చి జీడిపప్పుల్లో ఎక్కువ ఉప్పు, ఆయిల్ ఉంటుంది. అందుకే వీటిని రోస్ట్ చేస్తే వాటి పాళ్లు తగ్గుతాయి. బాదం పప్పులు మెమరీని బాగా పెంచుతాయి. వీటిని రాత్రి నీటిలో నానబెట్టి పగలు పొట్టుతీసి తింటే కాగ్నిటివ్ పవర్ బాగా పెరుగుతుంది. వీటిల్లో విటమిన్ ఇ కూడా బాగా ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ వీటిని డైట్ లో భాగంగా తినడం వల్ల డెమన్షియా బారిన పడరని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బాదంలో అధిక పాళ్లల్లో మెగ్నీషియం ఉంటుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ ప్రమాణాలు నియంత్రణలో ఉంటాయి. వీటిల్లోని పీచుపదార్థాలు, గుడ్ ఫ్యాట్స్, ప్రొటీన్స్ వల్ల బరువు తగ్గుతారు.

మరొక డ్రైఫ్రూట్ వాల్ నట్స్. వీటిల్లో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వాల్ నట్స్ లోని ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెజబ్బులు రాకుండా ఇవి నియంత్రిస్తాయి. జీర్ణవ్యవస్థను కూడా ఇవి ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని సలాడ్లు, డెజర్టులు, పెరుగు, స్టిర్ ఫ్రైస్ లో వాడొచ్చు. కొందరిలో ఇవి ఎలర్జీని రేకెత్తించవచ్చు . ఇలాంటి వాళ్లు వీటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యానికి మంచివి కదా అని వీటిని ఎక్కువ తింటే పొట్ట పాడవుతుంది. సో ఈ పండుగ వేళలో రకరకాల వంటకాల్లో డ్రైఫ్రూట్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని మితంగా తినడం వల్ల పండుగను పసందుగా ఎంజాయ్ చేయడంతో పాటు చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అంతేకాదు వణికిస్తున్న ఈ చలికాలంలో మీ శరీరానికి ఇవి కావలసినంత వెచ్చదనాన్ని కూడా పంచుతాయి. సో…ఈట్ అండ్ ఎంజాయ్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News