Liver Health-Damage:శరీరంలో జీర్ణక్రియ, రక్త శుద్ధి, శక్తి నిల్వ వంటి అనేక ముఖ్యమైన పనులు నిర్వహించే అవయవం కాలేయం. ఇది సక్రమంగా పనిచేస్తేనే శరీరంలోని ఇతర వ్యవస్థలు సరిగ్గా పనిచేయగలవు. కానీ కాలేయం దెబ్బతింటే లేదా పనితీరు తగ్గితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలా మందికి సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ గుర్తించకపోవడం వల్ల పరిస్థితి మరింత క్షీణిస్తుంది. వాస్తవానికి శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను చూపిస్తుంది. ముఖ్యంగా కళ్లు, చేతులు, కాళ్లు, పొత్తికడుపు వంటి భాగాల్లో కనిపించే మార్పులు కాలేయ సమస్యలకు ముందస్తు హెచ్చరికలుగా భావించవచ్చు.
కళ్లలో కనిపించే మార్పులు…
కళ్లలో కనిపించే మార్పులు కాలేయ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన సూచనలుగా ఉంటాయి. కళ్లలోని తెల్లటి పొర పసుపు రంగులోకి మారితే అది సాధారణంగా కామెర్లు వచ్చినట్లుగా సూచిస్తుంది. ఈ పరిస్థితి రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరగడం వల్ల వస్తుంది. బిలిరుబిన్ అధికమైతే కళ్లతో పాటు చర్మం కూడా పసుపు రంగులోకి మారుతుంది. ఇది హెపటైటిస్, కాలేయ సిరోసిస్ లేదా కాలేయ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు.
‘పామర్ ఎరిథెమా’
చేతులపై ఎరుపు పాచులు లేదా మచ్చలు కూడా కాలేయానికి సంబంధించిన సమస్యల్లో ఒకటి. వైద్య భాషలో దీనిని ‘పామర్ ఎరిథెమా’ అంటారు. ఇది సాధారణంగా కాలేయం పనితీరు దెబ్బతిన్నప్పుడు కనిపిస్తుంది. ఈ లక్షణం ఉన్నవారు ఇతర కాలేయ సమస్యలను కూడా పరిశీలించుకోవాలి.
కాలేయం బలహీనత..
కాళ్లలో, ముఖ్యంగా పాదాలలో తరచూ వాపు ఉండడం కూడా కాలేయం బలహీనతకు సూచన. కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలో ప్రోటీన్, ఆల్బుమిన్ స్థాయులు తగ్గుతాయి. వీటి కొరత వల్ల ద్రవం కాళ్లలో పేరుకుపోతుంది, దీన్ని ఎడీమా అంటారు. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే, నిర్లక్ష్యం చేయకూడదు.
పొత్తికడుపు ఆరోగ్యం..
కాలేయ సమస్యలు కళ్లలో, చేతుల్లో మాత్రమే కాకుండా పొత్తికడుపు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. పొత్తికడుపులో నిరంతరం నొప్పి లేదా వాపు ఉండడం కూడా కాలేయ నష్టానికి సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి తేలికగా ఉన్నప్పటికీ దీర్ఘకాలం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
జీర్ణక్రియకు..
జీర్ణక్రియకు సంబంధించి కూడా కొన్ని మార్పులు గమనించవచ్చు. వికారంగా అనిపించడం, ఆకలి తగ్గిపోవడం లేదా తరచుగా వాంతులు రావడం వంటి సమస్యలు కాలేయం పనితీరులో లోపానికి సూచనలుగా పరిగణించబడతాయి. ఈ లక్షణాలతో పాటు మూత్రం ముదురు రంగులో కనిపించడం, శరీరంలో అసాధారణ అలసట, కండరాల బలహీనత, రోజువారీ పనులు చేయడంలో శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు.
నిద్ర విధానం కూడా కాలేయ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం లేదా నిద్ర సమయం మారిపోవడం కాలేయ పనితీరు క్షీణించిందనే సంకేతంగా పరిగణించవచ్చు. ఇది దీర్ఘకాలం కొనసాగితే పరీక్షలు చేయించుకోవడం మంచిది.
Also Read: https://teluguprabha.net/health-fitness/seven-healthy-drinks-to-stay-fit-with-a-new-taste-every-day/
కాలేయాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం సేవించకపోవడం, అధిక నూనె ఉన్న ఆహారాన్ని దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవాలి. శరీరానికి అవసరమైనంత నీరు తాగడం ద్వారా కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.
వైద్యుని సలహా లేకుండా మందులు తీసుకోవడం చాలా ప్రమాదకరం. కొన్ని మందులు కాలేయంపై భారం పెంచి దానిని దెబ్బతీయవచ్చు. అందువల్ల వైద్యుల సూచనలతో మాత్రమే మందులు వాడాలి.
ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి అనే విషయంలో జాగ్రత్త అవసరం. పసుపు రంగు కళ్లు, చేతులపై ఎరుపు పాచులు, కాళ్లలో వాపు, పొత్తికడుపులో నొప్పి, ఆకలి తగ్గడం, వాంతులు రావడం, ముదురు మూత్రం వంటి లక్షణాలు కొన్ని రోజులకంటే ఎక్కువ కొనసాగితే వెంటనే వైద్యుడిని కలవాలి. అవసరమైతే LFT (లివర్ ఫంక్షన్ టెస్ట్), అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి.


