Eat something sweet and stay healthy: షుగర్ ఉంది లేదా బరువు పెరుగుతామనే భయంతో ఇష్టమైన తీపికి దూరంగా ఉండటం మనలో చాలామందికి అనుభవమే! నాలుక తీపిని కోరుతుంటే, మనసు ఆరోగ్యం గురించి హెచ్చరిస్తుంటుంది. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ‘డైట్ చీటింగ్’ పేరిట అపరాధ బావనతో సతమతమయ్యే వారి కోసం న్యూట్రిషనిస్టులు ఒక తీపి కబురు అందిస్తున్నారు. తీపిని పూర్తిగా మానేసి మనసును చంపుకోవాల్సిన పనిలేదని, తెల్ల చక్కెరకు బదులుగా తీపిని కాస్త “ఆరోగ్యదాయకంగా” మార్చుకుంటే షుగర్ క్రేవింగ్స్‌ను చిటికెలో జయించవచ్చని చెబుతున్నారు. ఆ ఆరోగ్యకరమైన తీపి మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం… ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో షుగర్, అధిక బరువు ముఖ్యమైనవి. ఇటీవల షుగర్ బారిన వారికైనా, లేదా బరువు తగ్గాలని డైట్ పాటిస్తూ తీపికి దూరంగా ఉండటానికి పోరాడుతున్న వారికైనా ఎదురయ్యే అతిపెద్ద సవాలు షుగర్ క్రేవింగ్స్. అకస్మాత్తుగా ఆహారంలో చక్కెరను పూర్తిగా మానేసినప్పుడు, మనస్సు, శరీరం మరింత ఎక్కువగా తీపిని కోరుకోవడం సహజం. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది డైట్ ‘చీటింగ్’ చేసి, ఆ తర్వాత బెంగపడుతుంటారు. అయితే, తీపిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండా, తెల్ల చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా ఈ సమస్యకు సులువైన పరిష్కారం కనుగొనవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
చక్కెరకు దూరం ఎందుకు?
ప్రస్తుత కాలంలో ప్రాసెస్ చేసిన తెల్ల చక్కెర శరీరానికి అత్యంత హానికరమైనదిగా మారింది. ఇది శరీరంలో అదనపు క్యాలరీలను పెంచి బరువు పెరిగేలా చేస్తుంది. క్రమంగా ఇది టైప్-2 డయాబెటిస్‌కు, గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అందుకే డైటింగ్ ప్రారంభించే వారు మొదట మానేసేది చక్కెరే!
సహజ ప్రత్యామ్నాయాలు
తీపి తినాలనే కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు ఆరోగ్యానికి హాని చేయని, శరీరానికి శక్తినిచ్చే ఈ మూడు సహజ పదార్థాలను పరిమిత మోతాదులో తీసుకోవచ్చు.
ఎండుద్రాక్ష
ఇవి సహజమైన తీపితో పాటు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి. కొద్దిగా ఎండుద్రాక్ష తిన్నా షుగర్ క్రేవింగ్స్ తక్షణమే తగ్గుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం నుంచి విముక్తి కలిగిస్తాయి. వీటిలోని క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అలాగే, గుండె ఆరోగ్యానికి, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
ఖర్జూరాలు
బలవర్ధకమైన ఆహారం ఖర్జూరం. శరీరానికి ఎంతో శక్తినిస్తుంది. ఇవి పిత్త దోషాన్ని నిర్మూలిస్తాయి. కండరాల పుష్టికి సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి బలం చేకూరుతుంది.
తేనె
తేనె మంచి ఫ్యాట్ బర్నర్. స్వచ్ఛమైన తేనె శరీర బరువును సమతుల్యం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తేనె తీసుకుంటే బరువు తగ్గుతారు. చల్లని నీటితో తీసుకుంటే బరువు పెరగడానికి దోహదపడుతుంది. నిమ్మకాయ రసంతో కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా వైద్యుల సలహాతో తక్కువ మోతాదులో తేనెను ఉపయోగించవచ్చు.
నిపుణుల మాట
ప్రోటీన్లు, కొవ్వుల వంటివేవీ లేని సింపుల్ కార్బోహైడ్రేట్లతో కూడిన తెల్ల చక్కెర కంటే, ఇటువంటి సహజ సిద్ధమైన తీపి పదార్థాలను ఎంచుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, ఆరోగ్యకరమైన పోషకాలు కూడా అందుతాయి. షుగర్ క్రేవింగ్స్ అనేవి శాశ్వతం కావు. కొన్ని రోజుల పాటు తెల్ల చక్కెరకు దూరంగా ఉంటూ, పైన పేర్కొన్న సహజ ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకుంటే, కొద్ది రోజుల్లోనే ఆ క్రేవింగ్స్ దానంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి తీపిని పూర్తిగా మానేసి ఇబ్బంది పడేకంటే, ఈ “ఆరోగ్యకరమైన తీపి” వైపు అడుగులేసి మీ ఆరోగ్యాన్ని, తద్వారా జీవితంలో ఆనందాన్నికాపాడుకోవడం ఎంతో మేలు.

