Fruits For Bloating Relief: నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. అందులో కడుపు ఉబ్బరం ఒకటి. ఈ సమస్య చలికాలంలో మరింత తీవ్రతమవుతుంది. మీరు ఈ సీజన్ లో ఉబ్బరం, గ్యాస్‌తో బాధపడుతుంటే, కొన్ని పండ్లను తినడం ద్వారా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కివి, బొప్పాయి, అరటిపండు వంటి పండ్లు ఈ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని తరచుగా తినడం కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. బొప్పాయిలోని పాపైన్, కివిలోని ఆక్టెనిడిన్ అనే ఎంజైమ్‌లు ప్రోటీన్లను జీర్ణం చేయడానికి సహాయపడతాయి. కడుపు తేలికగా అనిపిస్తుంది. ఇక అరటిపండ్లలో ఉండే పొటాషియం గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ క్రమంలో కడుపు ఉబ్బరం ఉంటె ఎలాంటి పండ్లు తినాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
కివి పండు: కివి కడుపు సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కివిలో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను బాగా జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది. కివి తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కివిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
బొప్పాయి పండు: బొప్పాయి జీర్ణక్రియకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది తిన్న ప్రోటీన్ ఆహారాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. తరచుగా ఈ పండు తింటే మలబద్ధకం, ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయిలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. కడుపు సమస్యలను దూరం చేస్తుంది.
అరటిపండ్లు: చాలా మందికి భోజనం తర్వాత అరటిపండ్లు తినడం అలవాటు. దీనికి కారణం అది మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సరిగ్గా పనిచేసినప్పుడు గ్యాస్ ఉత్పత్తి లేనప్పుడు మలబద్ధకం వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అరటిపండ్లు పొటాషియం మంచి మూలం. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అవి నీటి నిలుపుదలని కూడా తగ్గిస్తాయి. ఉబ్బరం కనిపించడాన్ని తగ్గిస్తుంది. కడుపు చదునుగా ఉంచుతుంది.

